బాబుకు భవిష్యత్‌ అర్థమైపోయింది..!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయ తీరు కొద్ది రోజులుగా భిన్నంగా సాగుతోంది. రాజకీయ శైలిని, పంథాను బాబు పూర్తిగా మార్చేశారు. మాట తీరేకాదు.. కట్టు, బొట్టు కూడా మారింది. దీంతో బాబు తీరు ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు ఎందుకిలా ప్రవర్తిస్తున్నారంటే.. ఆ పార్టీ నేతలే ఆసక్తికర విషయం చెబుతున్నారు. తన పార్టీ భవిష్యత్‌పై చంద్రబాబుకు ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చిందంటున్నారు. ఇంక ఉపేక్షిస్తే.. బీజేపీ తన పార్టీని మింగేస్తుందనే ఆందోళన చంద్రబాబులో కనిపిస్తోందంటున్నారు. బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా, టీడీపీని బతికించుకునేందుకే గతానికి భిన్నంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అంటున్నారు.

బీజేపీ హిందుత్వ అంజెడాగా ఏపీలో బలపడాలనుకుంటోంది. బీజేపీని అడ్డుకోవడం ద్వారా మాత్రమే టీడీపీని బతికించుకోగలనని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఆయన బీజేపీ బాటలోనే నడుస్తున్నారు. హిందుత్వాన్ని భుజాన వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తద్వారా బీజేపీకి చెక్‌ పెట్టడంతోపాటు.. రాజకీయంగా లబ్ధిపొందాలనే ఆలోచనలు చేస్తున్నట్లు ఆయన ప్రవర్తన ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నాడు బొట్టు పెట్టని బాబు.. ఇటీవల రామతీర్థం ఘటన నుంచి బొట్టు లేకుండా బయటకు రావడం లేదు. క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. సీఎం, హోం మంత్రి, డీజీపీలు క్రిస్టియన్లు కాబట్టే.. దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. సాధారణంగా బీజేపీ చేసే విమర్శలను బాబు చేస్తుండడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

బాబు తీరును గమనించిన బీజేపీ.. హిందుత్వం, హిందూ దేవాలయాలపై ఆయన కంగారు పడాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెక్‌ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. విజయవాడలో 40 దేవాలయాలను కూల్చివేసిన ఘటనను సోము వీర్రాజు తరచూ ప్రస్తావిస్తూ.. చంద్రబాబు హిందుత్వ రాజకీయాలకు అడ్డుకట్ట వేసేందుకు యత్నిస్తున్నారు, తద్వారా హిందుత్వంపై తమదే పేటెంట్‌ రైట్‌ అని చెప్పకనే చెబుతున్నారు. అయితే చంద్రబాబు కూడా సోము వీర్రాజు విమర్శలను తిరిగి బీజేపీ మెడలో వేస్తున్నారు. కేంద్ర మంత్రి గడ్కరి చెబితేనే.. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ కోసం కూల్చామని చెబుతూ బీజేపీని బాబు ఇరకాటంలో పెట్టారు. మరి బాబుకు హిందుత్వ దూకుడుకు బీజేపీ అడ్డుకట్ట వేస్తుందా..? టీడీపీని బీజేపీ నుంచి చంద్రబాబు కాపాడుకోగలరా…? వేచి చూడాలి.

Show comments