iDreamPost
android-app
ios-app

పోలవరం ప్రాజెక్టు భవితవ్యంతో కేంద్రం ఆటలాడుతోందా.. పునరావాసంపై కప్పదాట్లు ఎందుకు?

  • Published Jul 25, 2021 | 4:37 AM Updated Updated Jul 25, 2021 | 4:37 AM
పోలవరం ప్రాజెక్టు భవితవ్యంతో కేంద్రం ఆటలాడుతోందా.. పునరావాసంపై కప్పదాట్లు ఎందుకు?

కేంద్రం తీరు కలవరపరుస్తోంది. చట్టంలో లేదని చెప్పి ప్రత్యేక హోదా ఇవ్వడానికి నిరాకరించి ఆంధ్రప్రదేశ్ ఆశలు తుంచేసిన మోడీ సర్కారు ఇప్పుడు చట్ట ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా పేర్కొన్న పోలవరం విషయంలోనూ అస్పష్టంగానే సాగుతోంది. ప్రాజెక్టు మొత్తం వ్యయం భరించాల్సి ఉన్నప్పటికీ అందులో ఇరిగేషన్ కాంపోనెంట్ వరకూ మాత్రమే పరిమితమయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వం అనేక మార్లు కేంద్రానికి మొర పెట్టుకున్నా కనికరించడానికి సిద్ధంగా లేరనే సంకేతాలు ఇస్తోంది. తాజాగా పోలవరం హెడ్ వర్క్స్ వరకే నిధులు అంటూ జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ చేసిన ప్రకటన అలజడి రేపుతోంది.

పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఉమ్మడి ఆంధ్రాలోనే దానికి వైఎస్సార్ శ్రీకారం చుట్టి త్వరితగతిన పూర్తి చేయాలని సంకల్పించారు. అందుకు అనుగుణంగా అడుగులు పడ్డాయి. తొలుత కాలువలు పూర్తి చేసేందుకు పూనుకున్నారు. ఆలోగా అనుమతులు తీసుకుని ప్రాజెక్ట్ నిర్మించాలని భావించారు. అంతలోనే అనూహ్య పరిణామాలతో వైఎస్సార్ దూరం కావడం, అనంతరం అధికారం చేపట్టిన ప్రభుత్వాలు వివిధ కారణాలతో తాత్సార్యం చేసిన ఫలితంగా పోలవరం నిర్మాణం నత్తనడకన సాగింది. ఇక రాష్ట్ర విభజన సమయంలో ప్రాజెక్టుకి జాతీయ హోదా దక్కడంతో నిర్మాణం బాధ్యత కేంద్రానిదేనని స్పష్టమయ్యింది. చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్నందున ఇక పోలవరం కల నెరవేరుతుందని ఆంధ్ర ప్రదేశ ప్రజలు ఆశించారు.

కానీ చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పిదం ఇప్పుడు రాష్ట్రానికి పెను భారంగా మారుతోంది. పోలవరం పరిస్థితి సందిగ్ధంగా తయారవుతోంది. కేంద్రం చేతులు దులుపుకోవడానికి దోహదపడుతోంది. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం తన నెత్తిన పెట్టుకుని చేసిన దానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఇప్పుడు ముందుకొస్తోంది. ప్రాజెక్టులో స్పిల్ వే పనులు వేగంగా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ కలలు పండించాలని జగన్ సంకల్పించారు. దానికి అనుగుణంగా ఈసారి వరదలకు ముందే గోదావరి ప్రవాహం స్పిల్ వే మీదుగా మళ్లించడంతో అనేక మంది ఆశాభావదృక్పథంతో ఉన్నారు. కానీ ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమయిన పునరావాసం విషయంలో కేంద్రం ఇప్పుడు కొర్రీలు వేస్తుండడం కలవరం కలిగిస్తోంది. సుమారుగా రూ. 30వేల కోట్లు వ్యయం అవుతుంది. ఆ స్థాయిలో పెరగడానికి కూడా కేంద్రం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం వంటివే కీలకం.

కేంద్రం తాను తీసుకొచ్చిన చట్టాల కారణంగా పునరావాసం ఖర్చు పెరిగినప్పటికీ తాను మాత్రం కేవలం హెడ్ వర్క్స్ కి మాత్రమే నిధులు ఇస్తామని, అది కూడా 2013 నాటి లెక్కలకే పరిమితం అవుతామని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. ఇది పూర్తిగా బాధ్యత నుంచి వైదొలడమేననే వాదన వినిపిస్తోంది. ఆనాటి లెక్కల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. 20,398 కోట్లకు గానూ ఇప్పటికే రూ. 11,182 కోట్లు చెల్లించినట్టు ఇటీవల విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో సమాధానం చెప్పారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న బిల్లుల్లో రూ. 1900 కోట్లకు గానూ రూ. 919 కోట్లకు అభ్యంతరాలు పెట్టడం విస్మయకరంగా మారింది. అందులో లెఫ్ట్ కెనాల్ వర్క్స్ కోసం చేసిన ఖర్చులున్నాయనే పేరుతో పీపీఏ అడ్డుపుల్ల వేస్తోంది. ఫలితంగా ఏపీ ప్రభుత్వానికి రీయంబెర్స్ చేయాల్సిన నిధులు కూడా చెల్లించడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది.

ఈ పరిస్థితుల్లో కాంటూరు 41.15 మీటర్ల వద్ద చెల్లించాల్సిన పునరావాస సహాయ చర్యలు కూడా అసలే ఆర్థిక సమస్యల్లో ఉన్న ఏపీకి అదనపు భారం అవుతుంది. అంతేగాకుండా ఎర్ కం రాక్ ఫిల్ డ్యామ్ పూర్తి చేయాల్సి ఉండగా కేంద్రం మాత్రం తాము కేవలం ఆరేడు కోట్లకు మించి ఇవ్వలేమనే సంకేతాలు ఇవ్వడం పోలవరం ప్రాజెక్టు పరిస్థితిని డోలాయమానంలో పడేస్తోంది. స్పిల్ వే పూర్తయిన తర్వాత ఆశలు చిగురించి ఏపీ ప్రజల్లో నిరాశను మిగిల్చినట్టవుతుంది. ఇప్పటికే డీపీఆర్ 2 ప్రకారం నిధులు చెల్లించాలని కేంద్రాన్ని పలుమార్లు జగన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ స్పందించకుండా ఇలాంటి సంకేతాలు ఇవ్వడం సమంజసం కాదని పలువురు వాదిస్తున్నారు. దాంతో పోలవరం పయనం సందిగ్ధంగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికే సుమారు రూ. 5వేల కోట్లు వెచ్చించాల్సి ఉండగా దాని పరిస్థితి కూడా అనుమానమేనా అనే అభిప్రాయం వినిపిస్తోంది. చంద్రబాబు వైఫల్యం. మోడీ సర్కారు అవకాశవాదం కలిసి ఏపీకి తీరని అన్యాయం చేసే దిశలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆశాభావంతో ప్రయత్నాలు సాగిస్తోంది.