iDreamPost
android-app
ios-app

ఓట్ల వేటలో ‘భాగ్యనగరం’ వల

ఓట్ల వేటలో ‘భాగ్యనగరం’ వల

గ్రేటర్ ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరింది. ప్రచారంలో దూకుడును పెంచిన అధికార ప్రతిక్షాలు ఆఖరి ఆయుధాలను సంధిస్తున్నాయి. బీజేపీ అగ్రనేతలంతా ఒకరి తరువాత ఒకరు హైదరాబాద్ లో ప్రచారం నిర్వహిస్తుండగా, అధికార పార్టీ నిర్వహించిన బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. గ్రేటర్ ప్రచారంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ మరోమారు కీకల వ్యాఖ్యలు చేశారు. నగర ప్రజలు బీజేపీని ఆశీర్వదిస్తే హైదరాబాద్ ను భాగ్యనగరం గా మార్చుతామని ప్రకటించారు. ఈ మాట ఇప్పటికే బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తో పాటు, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య నోట సైతం వెలువడింది. మొత్తానికి బీజేపీ హైదరాబాద్ పేరు మార్చడాన్ని ప్రధాన అస్త్రంగా ప్రయోగిస్తోంది.

నగరంలో ప్రచారం నిర్వహించిన యూపీ సీఎం యోగి తాము అధికారంలోకి వచ్చాక ఫైజాబాద్ పేరును అయోధ్యగా, అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చామని గుర్తుచేశారు. ఇక హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మార్చుతామన్నారు. నిజానికి బీజేపీ మొదటి నుంచీ ఈ అంశాన్ని ప్రస్తావిస్తోంది. దేశంలోని వేరు వేరు చోట్ల ముస్లిం రాజుల పాలనలో ఏర్పడ్డ నగరాల పేర్లను మార్చడంపై దృష్టిసారించింది. నిజామాబాద్ పేరును సైతం ఇందూరుగా మార్చుతామని గతంలో బీజేపీ నేత అరవింద్ ప్రకటించడం కూడా అందుకు ఓ ఉదాహరణ. ఇప్పుడు అదే ఎజెండాను గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది బీజేపీ. బీజేపీ ప్రచారానికి టీఆర్ఎస్ కూడా గట్టి కౌంటర్ ఇస్తోంది. నేమ్ చేంజర్స్ కావాలా? గేమ్ చేంజర్స్ కావాలా అంటూ మంత్రి కేటీఆర్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఇంతకూ బీజేపీ హైదరాబాద్ పేరును ఎందుకు మార్చాలనుకుంటోంది? హైదరాబాద్ గతంలో భాగ్యనగరంగా చెలామణి అయ్యేదా? అదే నిజమైతే… ఆ పేరెలా వచ్చింది? ఆ పేరుకూ బీజేపీ ప్రచారానికి ఉన్న సంబంధమేంటి? ఇప్పుడీ సందేహమే నగరవాసుల మనసును తొలిచేస్తోంది. చార్మినార్ ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి ఆలయం పేరుతో నగరానికి భాగ్యనగరం అనే పేరు వచ్చిందనేది బీజేపీ శ్రేణుల వాదన. అందుకోసమే… గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగ్యలక్ష్మి టెంపుల్ ను బీజేపీ కేంద్రంగా చేసుకుంటోంది. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా సైతం భాగ్యలక్ష్మి టెంపుల్ ని దర్శించుకోవాలనుకోవడం వెనక ఉన్న ఉద్దేశ్యం అదే. బీజేపీ చేస్తున్న ఈ వాదనను చరిత్రకారులు తిరస్కరిస్తుండడం గమనార్హం. చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం లేదని, కేవలం ముడు నాలుగు దశాబ్ధాల క్రితమే అక్కడ గుడి నిర్మాణం జరిగిందని చెబుతున్నారు.

బాగ్ నగర్ !

బీజేపీ వాదన ఎలా ఉన్నా…. హైదరాబాద్ ను బాగ్ నగర్ (గార్డెన్ సిటీ)గా పిలిచేవారనడానికి అనేక ఆధారాలున్నాయి. బాగ్ అంటే తోట. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు విస్తారంగా తోటలు ఉండేవి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాలకు వాటితోనే పేరు వచ్చింది. బాగ్ లింగంపల్లి, బాగ్ అంబర్ పేట, కుందన్ బాగ్, బషీర్ బాగ్ లాంటి పేర్లు అలా ఉనికిలోకి వచ్చినవే. కానీ ఈ వాదననూ తప్పుబట్టే వాళ్లూ ఉన్నారు. తోటల వల్ల హైదరాబాద్ కు ఆ పేరు రాలేదని, కులీకుతుబ్ షా తన భాగ్య భాగమతి పేరుతో ఈ నగరాన్ని నిర్మించారని వాదించే వాళ్లూ ఉన్నారు.

కల్పిత గాథ?

భాగమతి కులీకుతుబ్ షాల ప్రేమకు చిహ్నంగా హైదరాబాద్ నగరాన్ని కొందరు వర్ణిస్తుంటారు. భాగమతి చెంచు మహిళ అని, చిచలం అనే ప్రాంతంలో ఆమె నివసించేందని చెబుతుంటారు. ఆమెను కలిసేందుకు కులీ కుతుబ్ షా గోల్కండ నుంచి నది దాటి వెళ్లేవారని, అది చూడలేక కుతుబ్ షా తండ్రి ఇబ్రహీం 1578లో పురానాపూల్ వంతెనను నిర్మించాడని చెబుతారు. తరువాత కుతుబ్ షా భాగమతిల వివాహం జరిగిందని ఆమె పేరుతో హైదరాబాద్ నగరం ఏర్పడిందని చెబుతుంటారు. కానీ ఈ కథను కల్పిత గాథగా కొట్టిపారేసేవాళ్లూ ఉన్నారు. కులీకుతుబ్ షా 1565లో జన్మించాడు. పురానాపూల్ వంతెన నిర్మించేనాటికి అతడి వయసు కేవలం 13ఏళ్లు. అందుకే… కులీ భాగమతిల ప్రేమ కోసం ఆ వంతెన నిర్మించారనేది అవాస్తమంటుంటారు. ఇక భాగమతి అనే మహిళ ఒక వేశ్య అని, కులీని పెళ్లి చేసుకున్నాక ఆమె మతం మార్చుకొని హైదర్ గా మారిందని ఇలా అనేక కథలు చెలామణిలో ఉన్నాయి. కానీ భాగమతి నిజంగానే ఉందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవు. చివరకు కుతుబ్ షాహీల సమాధులున్న సెవెన్ టూంబ్స్ లోనూ భాగమతి సమాధి లేకపోవడం గమనార్హం.

కల ఫలించేనా?

ఎన్నెన్నో శేష ప్రశ్నలు భాగ్యనగరం పేరు వెనక ఉన్నాయి. ఎన్నెన్నో సందేహాలూ ఉన్నాయి. ఎన్నెన్నో వివాదాలూ ఉన్నాయి. ఒక నాటి గోల్కొండ బాగ్ నగర్ నుంచి హైదరాబాద్ గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. బాగ్ నగర్ పేరు చాలా తక్కువ కాలం చెలామణిలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయినా… ఇప్పుడు అదే పేరును హైదరాబాద్ కు పెట్టాలని బీజేపీ పట్టుబడుతోంది. ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా ఈ అంశాన్నే ప్రస్తావిస్తోంది. బీజేపీ వాదనకు చరిత్రతో, వాస్తవాస్తవాలతో ఎలాంటి సంబంధమూ లేదు. హేతుబద్ధత కూడా అవసరం లేదు. ఎందుకంటే, మెజార్టీ మతానికి సంబంధించిన ప్రతీకల్ని ప్రచారంలో పెట్టడం దాని ఎజెండా. తద్వారా మెజార్టీ మతస్తుల మససులను, ఓట్లను గెలుసుకోవచ్చనే కాంక్ష. ఆ కాంక్షనే బీజేపీ దూకుడుకు కారణం. అందుకే… గ్రేటర్ ప్రచారంలో భాగ్యనగరం ప్రస్తావనను పదే పదే తెస్తోంది. నిజంగానే భాగ్యనగరానికి బాటలు పడతాయో లేదో వేచిచూడాలి.