iDreamPost
android-app
ios-app

కాపు రిజర్వేషన్‌పై పార్లమెంట్‌లో మాట్లాడిన ఎంపీ.. లక్ష్యం అదేనా..?

కాపు రిజర్వేషన్‌పై పార్లమెంట్‌లో మాట్లాడిన ఎంపీ.. లక్ష్యం అదేనా..?

ఆంధ్రప్రదేశ్‌లో కాపు రిజర్వేషన్‌ అంశం గురించి దాదాపు ఎవరూ మాట్లాడలేదు. కానీ తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కాపు రిజర్వేషన్‌పై మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. అది కూడా రాజ్యసభలో సదరు ఎంపీ కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని మాట్లాడడం ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు సూచికగా కనిపిస్తున్నాయి.

2014 ఎన్నికల్లో కాపుల ఓట్లకోసం వారిని బీసీల్లో చేరుస్తాననే హమీని ఇచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కూడా పట్టించుకోలేదు. ఈ తరుణంలో మాజీ మంత్రి, కాపు సామాజికవర్గ నేత ముద్రగడ పద్మనాభం ఉద్యమం ప్రారంభించారు. 2016 నుంచి 2017 వరకు రెండుసార్లు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఆ సమయంలో ఉభయగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాదయాత్రలు తలపెట్టినా.. చంద్రబాబు ప్రభుత్వం అణచివేసింది. మొత్తం మీద కాపు రిజర్వేషన్‌ హామీ.. హామీగానే మిగిలిపోయింది.

2019 ఎన్నికల ప్రచార సమయంలో కాపు రిజర్వేషన్‌పై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పష్టమైన వైఖరిని వెల్లడించారు. రిజర్వేషన్‌ అంశం కేంద్ర పరిధిలోనిదని చెప్పిన జగన్‌.. రాష్ట్ర పరిధిలో లేని, అమలు చేయలేని హామీని ఇవ్వలేనంటూ కాపు రిజర్వేషన్‌ ఉద్యమం ప్రారంభమైన ముద్రగడ పద్మనాభం నియోజకవర్గమైన జగ్గంపేట సభలో చెప్పారు. కాపులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటానని, ఏడాదికి 2 వేల కోట్ల రూపాయల చొప్పన ఐదేళ్లలో పది వేల కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీని జగన్‌ నెరవేరుస్తున్నారు. అన్ని పథకాలతోపాటు.. కాపుల కోసం ప్రత్యేకంగా వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం ప్రారంభించి అమలు చేస్తున్నారు. ఐదేళ్లలో కాపుల్లోని పేదలకు (రేషన్‌కార్డు ఉన్న వాళ్లు) 75 వేల రూపాయలు ఐదు విడతల్లో ఇస్తున్నారు.

ఎన్నికల సమయంలో జగన్‌ కాపు రిజర్వేషన్‌ అంశంపై స్పష్టత ఇవ్వడంతో.. కాపు ఉద్యమనేత ముద్రగడ సహా ఇతరులు రిజర్వేషన్‌ అంశంపై మాట్లాడలేకపోయారు. ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయలేకపోయారు. ముద్రగడ సైలెంట్‌ కావడంతో.. ఆయనపై టీడీపీ, జనసేనలు సోషల్‌ మీడియాలోనూ, టీవీ ఛానెళ్ల డిబేట్లలోనూ దూషించడం మొదలు పెట్టింది. మనస్తాపానికి గురైన ముద్రగడ.. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

కాపు రిజర్వేషన్‌ అంశంపై ఇకపై టీడీపీ మాట్లాడలేదు. రాష్ట్ర పరిధిలో లేని పనిని చేయలేమని వైసీపీ ముందే చెప్పింది. ముద్రగడ కూడా ఆ విషయం వదిలేసి.. రాజకీయ దారిలోకి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఎంపీ జీవీఎల్‌.. కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని మాట్లాడడం ఆసక్తికరమైన అంశం. రాబోయే రోజుల్లో కాపు రిజర్వేషన్‌ అంశాన్ని తన ప్రధాన అజెండాగా బీజేపీ తీసుకోబోతోందనే సంకేతాలు జీవీఎల్‌ మాటల ద్వారా తెలుస్తోంది. రిజర్వేషన్లు ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్న నేపథ్యంలో.. జాతీయ పార్టీ, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సదరు హామీని ఇస్తే.. అమలు జరిగే అవకాశం ఉంటుందని విశ్వసించవచ్చు. రిజర్వేషన్‌ ఇస్తామని చెప్పడం ద్వారా రాబోయే ఎన్నికల్లో బీజేపీ కాపులను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే వేదికను సిద్ధం చేస్తున్నట్లు పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

Also Read : బీజేపీ నోటా.. అదే మాట!