Idream media
Idream media
ఎలక్షన్ కమిషన్ అంటే రాజ్యాంగబద్ధంగా కీలకమైన వ్యవస్థ. ప్రజాస్వామ్య విలువలు ఆ వ్యవస్థపై ఆధారపడే ఉంటాయి. అంతటి ప్రాధాన్యమైన వ్యవస్థకు ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై రోజురోజుకూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలు తగవని అటు ప్రభుత్వం, ఇటు ఉద్యోగులు మొత్తుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఆ నిర్ణయం సరికాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఎన్నికలు తప్పనిసరైతే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సీపీఎం వంటి రాజకీయ పార్టీలు కూడా సూచిస్తున్నాయి. ఇవేమి పట్టించుకోకుండానే నిమ్మగడ్డ ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా ప్రయత్నిస్తుండడమే వివాదాలకు తావిస్తోంది. ఓ పార్టీ కనుసన్నల్లో ఎన్నికల కమిషనర్ నడుస్తున్నారన్న ఆరోపణలను నిమ్మగడ్డ ఎదుర్కొంటున్నారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎస్‌ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని కొద్ది రోజుల కిందట ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. బిహార్ అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలియజేస్తూ ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎందుకు ఇబ్బందులుంటాయని చెబుతున్నారు. ఆ ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికలు జరిగిన తర్వాత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే ఎన్నికలు పెట్టే ఆలోచన చేయరని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు బిహార్ ఎన్నికల అనంతరం ఆ రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరిగాయని, కరోనా ప్రభావం జీహెచ్‌ఎంసీ పోలింగ్ శాతంపై పడిందని చెబుతున్నారు.
రాష్ట్రంలో కరోనా కేసులు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు కాబట్టి… స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి – చీఫ్ సెక్రెటరీ నీలం సాహ్ని తెలియజేస్తూ ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు లేఖ కూడా రాశారు. పట్టించుకోని నిమ్మగడ్డ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయిన ఎస్ఈసీకి ప్రభుత్వ వైపు నుంచి సహకారం ఉండటం లేదని ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. మరోవైపు ఫిబ్రవరిలో ఎన్నికల ప్రక్రియను నిలిపివేసేలా ఎస్‌ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం పేర్కొంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యపడదని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వడం సాధ్యం కాదని చెప్పిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.
ఇదిలాఉండగా.. స్వప్రయోజనాల కోసం ఎన్నికల కమిషనర్ పని చేయకూడదని, ఇతర రాష్ట్రాలతో ఏపీని పోల్చాల్సిన అవసరం లేదని మాజీ ఆర్టీఐ కమిషనర్ విజయబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ పునరాలోచన చేయాలని సూచించారు. ‘‘ఎన్నికలను ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నిర్వహిస్తామని చెప్పడం భావ్యం కాదు. బీహార్ ఎన్నికల తర్వాత కోవిడ్ కేసులు పెరగటం చూశాం. హైదరాబాద్ ఎన్నికల్లో ఓటర్లు కోవిడ్ భయానికి ప్రజలు ఓటు వేసేందుకు కూడా రాని పరిస్థితి చూశాం. యూఎస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత కూడా అధికసంఖ్యలో యూఎస్‌లో కేసులు పెరిగాయని’’ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ ఓ పార్టీ కనుసన్నల్లోనే నడుస్తున్నట్లు కనిపిస్తుందని.. రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలను లెక్క చేయకుండా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారని విజయబాబు విమర్శించారు. ఇదే అభిప్రాయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలు వద్దంటూ ఈసీకి లేఖ రాస్తామని, తమ వినతిని పట్టించుకోకపోతే కోర్టుకు వెళ్తామని చెబుతున్నారు. ఇలా కొన్ని నెలలుగా ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.