iDreamPost
android-app
ios-app

అమరరాజా గొడవేంటి ?యాజమాన్యం ఎందుకు స్పందించదు ?

  • Published Aug 04, 2021 | 5:39 AM Updated Updated Aug 04, 2021 | 5:39 AM
అమరరాజా గొడవేంటి ?యాజమాన్యం ఎందుకు స్పందించదు ?

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన అమరరాజా కంపెనీ రాష్ట్రం నుండి తరలించి తమిళనాడులో ఏర్పాటు చేస్తున్నారు . ఇందుకు ప్రభుత్వమే కారణం . టీడీపీ పార్టీ నేతకి చెందిన కంపెనీ అయినందున , వర్గ కోణంలో చూస్తూ వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఇబ్బందులు పెడుతుంది . అందుకే అమరరాజా కంపెనీ పక్క రాష్ట్రానికి తరలిపోతుంది అంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ఇటీవల పుంఖానుపుంఖాలుగా కధనాలు రాస్తూ వచ్చింది .

ఇదిలా ఉండగా నిన్న ప్రెస్ మీట్లో అటవీ , పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో రెగ్యులర్ వెరిఫికేషన్ లో భాగంగా అమరరాజాతో పాటు పలు కంపెనీల్లో తనిఖీలు నిర్వహించామని ఆ సందర్భంగా అమరరాజా కంపెనీ నుండి వెలువడుతున్న విష పదార్ధాల వలన తిరిగి పునరుద్ధరించలేని స్థాయిలో పర్యావరణం దెబ్బ తింటున్నదని గుర్తించిన తాము సీసం వంటి వ్యర్ధ పదార్ధాల వలన చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల మేర భూగర్భ , ఉపరితల జలవనరులు కాలుష్యం బారిన పడటంతో పాటు మొక్కల్లో కూడా లెడ్ చేరి అవి పశుపక్ష్యాదులతో పాటు మనుషుల శరీరాల్లో ప్రవేశించి ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయన్నారు .

దీనితో పాటు కంపెనీలో పని చేసే ఉద్యోగుల శరీరాల్లో కూడా ప్రమాదకర స్థాయిలో లెడ్ చేరిందని ఈ పరిణామాల్ని గమనించి కంపెనీ నుండి వెలువడే విష పదార్ధాలను నియంత్రించే చర్యలు తీసుకోమని ఆదేశించగా కంపెనీ యాజమాన్యం కొంత గడువు కోరిందన్నారు . గడువు తీరినా కూడా వ్యర్ధాల నిర్వహణ పట్ల ఏ విధమైన పురోగతి కనపడకపోవడంతో పర్యావరణానికి , ప్రజలకి ప్రమాదకరంగా మారిన కంపెనీని మూసివేయాలంటూ క్లోజర్ ఆర్డర్ ఇచ్చామని అదే విధంగా ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 64 పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయాలని 50 పరిశ్రమలు మొత్తంగా మూసివేయాలని ఆజ్ఞలు జారీ చేసామన్నారు . ఈ విషయంగా అమరరాజా కంపెనీ కోర్టుకి వెళ్లగా అన్ని విషయాలు వివరిస్తూ కాలుష్య నియంత్రణ మండలి తరుపున పిటిషన్ వేశామని కోర్టు కూడా అమరరాజా కంపెనీ వ్యర్ధాలు , విష పదార్ధాలను అదుపు చేయటానికి నెల రోజులు గడువు ఇచ్చిందని తెలిపారు .

ఆంధ్రజ్యోతి పత్రిక ఈ వాస్తవాలు కప్పిపుచ్చి , అటవీ , పర్యావరణ శాఖకు , ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ , రాజకీయ కోణంలో కంపెనీ పై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నందున వేల మందికి ఉపాధి కల్పించే అమరరాజా కంపెనీ తరలిపోతుందంటూ అసత్య వార్తా కధనాలు రాసిన ఆంధ్రజ్యోతి పై చర్యలు తీసుకొమ్మని కోర్టుకు నివేదిస్తామన్నారు .

మొత్తం వ్యవహారంలో ప్రధాన పాత్రదారి అయిన అమరరాజా కంపెనీ యాజమాన్యం ఇంతవరకూ ఎక్కడా స్పందించలేదు కానీ వారి తరుపున వకాల్తా పుచ్చుకొన్నట్టు ఆంధ్రజ్యోతి మాత్రం తీవ్రంగా స్పందిస్తుంది . ఇది టీడీపీ నాయకుల పట్ల , ఒక వర్గం పట్ల వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపుకి నిదర్శనం అని వైసీపీ పార్టీ ధోరణి వల్ల రాష్ట్రం నుండి కంపెనీలు తరలిపోతున్నాయి అంటూ వార్తలు రాసుకొస్తుంది కానీ అమరరాజా కంపెనీ డైరెక్టర్ అయిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నుండి కానీ పౌండర్ అయిన వారి తండ్రి రామచంద్ర నాయుడు నుండి కానీ ఏ విధమైన స్టేట్మెంట్స్ తీసుకోలేకపోయింది .

కొసమెరుపు ఏంటంటే ఏ కుటుంబం పట్ల వైసీపీ ప్రభుత్వం , జగన్ కక్ష సాధిస్తుంది అని ఆంధ్రజ్యోతి చెబుతుందో అదే కుటుంబం దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితులు . అమరరాజా డైరెక్టర్ గల్లా జయదేవ్ తల్లిగారైన గల్లా అరుణకుమారిని సొంత చెల్లెలుగా చూసేవారని వైఎస్సార్ కి చిత్తూరు జిల్లాలోనే అత్యంత ఆత్మీయ కుటుంబమని పేరు . వైస్సార్ క్యాబినెట్లో అరుణకుమారి మంత్రిగా పనిచేయటం గమనార్హం .

వైఎస్సార్ మరణం తర్వాత గల్లా అరుణకుమారి టీడీపీలో చేరినా గత కొంతకాలంగా టీడీపీ పార్టీకి , పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు .మొత్తం పరిణామాల పై గల్లా కుటుంబం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి ..