iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్‌లో అందరి దృష్టంతా ఇప్పుడు ఒక్కటే స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇటు రాజకీయ నాయకులతో పాటు గ్రామాల నుంచి పట్టణాల దాకా అందరూ ఈ ఎన్నికలపైనే దృష్టి సారించారు. అయితే ఆ జిల్లాలో మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరిలో టెన్షన్ కనిపించడం లేదంట.. గెలుపుపై ధీమా పెట్టుకొని దర్జాగా ఉన్నారంట.. ఇంతకీ ఏంటా జిల్లా అనుకుంటున్నారా..
వై ఎస్ ఆర్ కడప జిల్లాలో ఇప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉందంట. అవును రాష్ట్రమంతా ఎన్నికల టెన్షన్ వాతావరణం కనిపిస్తున్నా జిల్లాలో మాత్రం ఎన్నికల జోష్ తప్ప టెన్షన్ లేనట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడమే ఇందుకు కారణం.. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సరిగ్గా ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోందని అంతా చర్చ నడుస్తోంది. అందుకే ఎలాగో గెలిచే స్థానాలు మావంటే మావని నేతలు ధీమాగా ఉన్నారంట. ఇక టెన్షనంతా ఒక్క చైర్మన్ పీఠం ఎవ్వరికి దక్కుతుందన్న దానిపైనే ఉంది. ఈ సారి కడప జెడ్పీ చైర్మన్ పీఠం జనరల్ గా వచ్చింది. దీంతో ఆశావహులు ఇప్పుడు ఈ సీటుపై మాత్రమే కన్నేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో రాజకీయ పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అధికార వైసీపీతో పాటు టిడిపి కూడా రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల ఎంపికలో ఉన్నారు.
ఇక కడప జిల్లా పరిషత్ చైర్మన్ స్థానానికి పోటీ చేసేందుకు చాలా మంది ఆశావహులు ఆసక్తి చూపుతున్నారు. అధికార పార్టీ కావడం, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ సాధించడం, అంతకుముందు 2014లో జరిగిన స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించడం జరిగింది. వరుస విజయాల నేపథ్యంలో ఇక్కడ పోటీ చేసేందుకు వైసీపీ నేతలు ముందు వరుసలో ఉన్నారు. కమలాపురం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి పేరు వినిపిస్తోంది. 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించినా అప్పటికి ఆయనకు అవకాశం దక్కలేదు. గత ఎన్నికల్లో కూడా ఆయన క్రియాశీలకంగా ఉంటూ ముందుకు సాగారు. దీంతో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈయనకు సముచిత స్థానం దక్కుతుందని అంతా అనుకుంటున్నారు,వైస్సార్ కుటుంబనికి దగ్గర బంధువు,వల్లూరు జడ్పిటిసిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నారు.
ఈయనతో పాటు కమలాపురం ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి తనయుడు నరేన్ రామాంజనేయరెడ్డి కూడా జెడ్పీ స్థానానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది,పెండ్లిమర్రి మండలము నుండి పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాడు వైసీపీకి కొంచుకోట అయిన ఈ మండలం నుండి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసే యోచనలో ఉన్న ఈయన ముందుగా జెడ్పీ చైర్మన్‌గా రావాలని చూస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డి బావమరిది, ప్రముఖ కాంట్రాక్టర్ శివప్రకాష్ రెడ్డి పేరు జెడ్పీ రేసులో ప్రస్తావనకు వచ్చినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
అయితే ఆయన ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. వీరితో పాటు వివేకానంద రెడ్డి కుమార్తె పేరు కూడా వినిపిస్తున్నా డాక్టరుగా ఉన్న ఆమె ఇందుకు ఒప్పుకుంటుదా లేదా అన్నది సందిగ్దంగా చెప్పుకోవచ్చు, ఇప్పుడు అనూహ్యంగా భర్త అయిన రాజశేఖర్ రెడ్డి పేరుని వైస్సార్ కుటుంబ సభ్యులు ప్రతిపాదించారు అని ఊహాగానాలు వినపడుతున్నాయి, పులివెందుల మండలం నుండి పోటీ చేయడానికి,నియోజకవర్గ పరిధిలోని జనరల్ స్థానాలు ఉన్న ఏ స్థానంలో నుండి పోటీకి దిగిన గేలువు నల్లేరు నడకే. ప్రస్తుతం వైస్సార్ కుటుంబం నుంచి ఈ పేర్లు ప్రచారంలో ఉండగా జిల్లా నుంచి మరికొందరి పేర్లు వినిపిస్తున్నాయి. రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేరు ప్రచారంలో ఉంది. అయితే ఆయనకు గత ఎన్నికల్లో జగన్ ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన దేనిపై ఆసక్తి చూపుతారోనని స్పష్టంగా తెలియదు. 2021 డిసెంబరు వరకు ఎమ్మెల్సీ స్థానాలు ఖాలీ అయ్యే అవకాశం లేకపోవడంతో జెడ్పీ చైర్మన్ పదవికే ఆయన ఆసక్తి చూపుతారా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈయనే కాకుండా పోరుమామిళ్ల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చిత్తా విజయప్రతాపరెడ్డి గత కొంత కాలంగా జెడ్పీ చైర్మన్‌గా పోటీ చేసేందుకు ఆసక్తిచూపుతున్నారని తెలుస్తోంది. పోరుమామిళ్లలో విద్యాసంస్థలు నిర్వహించడంతో పాటు ప్రజల్లో గుర్తింపు ఉన్న ఈయన.. ఇప్పటికే పలువురు ఎమ్మల్యేలను కలిసి సిఫారసు చేయాలని విజ్నప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంతమంది ఆశావహులు కడప జెడ్పీ బరిలో ఉంటే జగన్ మదిలో ఎవరున్నారో.. ఎవరికి అవకాశం దక్కుతుందోనన్నది చర్చనీయాంశంగా మారింది.
కాకపోతే ఇప్పటికే జగన్ దీనిపై ఓ క్లారిటీగా ఉన్నట్లు అక్కడక్కడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన టిడిపి నుంచి జెడ్పీ స్థానానికి ఎవరు ఆసక్తి చూపుతారన్న దానిపై వివరాలు తెలియడం లేదు. వైసీపీకి పోటీగా ఎన్నికల్లో పోటీ చేయాలని.. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని అధినే చంద్రబాబునాయుడు ఇప్పటికే జిల్లా పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్‌యంలో టిడిపిలో ఎవరు ముందుకు వస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.