iDreamPost
android-app
ios-app

బీసీలపై కక్ష ఎవరికి …?

బీసీలపై కక్ష ఎవరికి …?

ఈఎస్‌ఐ స్కామ్‌లో టెక్కలి ఎమ్మెల్యే, తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే అచ్చెన్న అరెస్టుకు ప్రతిస్పందనగా టీడీపీ బీసీలపై దాడి, కక్ష సాధింపు అంటూ కులరాజకీయాలకు తెరలేపడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చి, చరిత్రకు భిన్నంగా జనరల్‌ స్థానాల్లో బీసీలను ఎంపీలు, ఎమ్మెల్యేలుగా నిలబెట్టి, గెలిపించుకున్న వైఎస్సార్‌సీపీకి బీసీలపై కక్షెందుకు ఉంటుందో టీడీపీయే చెప్పాలంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఉత్తర్రాంధ్ర ఏం చెప్తోంది….?

ఉత్తరాంధ్రలో బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచీ వారంతా ఆ పార్టీనే ఆదిరిస్తూ వస్తున్నారు. కానీ, 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర బీసీలంతా ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీకి జైకొట్టారు. దాంతో ఉత్తరాంధ్రలోని మొత్తం 34 సీట్లలో టీడీపీ కేవలం 6 సీట్లకే పరిమితమైంది. విజయనగరం జిల్లాలోనైతే ఏకంగా ఆ పార్టీకి ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.

టీడీపీలో బీసీల నుంచి ఇచ్చాపురం నుంచి బెండాళం అశోక్, టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు, విశాఖనగరంలో వాసుపల్లి గణేష్, పీజీవీర్‌ నాయుడులు మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అదేసమయంలో వైఎస్సార్‌సీపీ తరుపున గెలిచిన బీసీ ఎమ్మెల్యేల సంఖ్య 15 మంది.. ఈ సంఖ్య టీడీపీకి అందనంత ఎత్తులో ఉండటం గమనార్హం.

ఉత్తరాంధ్రలోని 34 స్థానాలలో ఎనిమిది SC మరియు ST రిజెర్వేడ్ నియోజకవర్గాలు. అంటే 24 జనరల్ నియోజకవర్గాలలో వైసీపీ తరపున ఏకంగా 15 మంది బీసీలు గెలిచారు.. మరి బీసీల మద్దతు ఏ పార్టీకి ఉన్నట్లు? వైసీపీ తరుపున గెలిచిన వారిలో కోలగట్ల వీరభద్రస్వామి,ముత్తంశెట్టి శ్రీనివాస్,గుడివాడ అమర్ నాథ్ మరియు రమణమూర్తి రాజు మాత్రమే బీసీలు కానిది.

ఉత్తరాంధ్రలో టీడీపీ ఆరు సీట్లు గెలవగా అందులో బీసీలు నలుగురు,ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు,SC & ST ల నుంచి ఒకరు కూడా గెలవలేదు… ఈ లెక్కలన్నీ చూస్తే బీసీ ,దళిత ,మైనార్టీల మద్దతు అంటూ చంద్రబాబు చెప్పే మాటలలోని డొల్లతనం బయటపడుతుంది.

జగన్ బీసీ నేత అయిన తమ్మినేని సీతారాం(కాళింగ)ను ఏకంగా స్పీకరు పదవికి ఎన్నిక చేయగా ధర్మాన కృష్ణ దాస్(కొప్పుల వెలమ) బొత్స సత్యనారాయణ(తూర్పు కాపు) ను మంత్రిని చేశారు .ఆ విధంగా ఉత్తరంధ్రలోని మూడు ప్రధాన బీసీ కులాలకు జగన్ మంచి ప్రాతినిధ్యం కలిగించారు.

అచ్చెన్నే ప్రతినిధా….?

ఉత్తరాంధ్రలో అచ్చెన్ననాయుడుని బీసీలకు ప్రతినిధిగా చూపించాలనే టీడీపీ ప్రయత్నంపైనా విమర్శలు వస్తున్నాయి. అచ్చెన్న కొప్పువెలమ సామాజికవర్గానికి చెందిన నేత. ఉత్తరాంధ్రలోని తూర్పుకాపులతోపాటు ఇతర బీసీ కులాలు అధికంగా ఉన్నారు.

ఆయా కులాలు కొప్పువెలమల కంటే ఆర్థికంగా వెనుకబడినవి కావడం గమనార్హం. వైఎస్పార్‌సీపీ నుంచి ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ వంటి బలమైన నాయకుడు తూర్పుకాపుల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనకాపల్లి నుంచి గుడివాడ అమర్‌నాథ్, నర్సీపట్నం నుంచి పెట్ల ఉమాశంకర్‌ గణేశ్, చోడవరం నుంచి కరణం ధర్శశ్రీ వంటి బీసీ నేతలు వైఎస్సార్‌సీపీ టిక్కెట్లపై గెలుపొందారు. వాస్తవాలు ఇలా ఉంటే అచ్చెన్నాయుడు అరెస్టుతో బీసీలకు ఏదో జరిగిందంటూ టీడీపీ చేస్తున్న కుటిల రాజకీయాలను ప్రజలు ఎంతవరకు పట్టించుకుంటారనేది సందేహాస్పదమే.

ధర్మాన సోదరులు,అచ్చెన్ననాయుడు ఒకే కులం “కొప్పుల వెలమ”కు చెందిన వారు.సాంకేతికంగా ఆ కులం బీసీ కేటగిరి కి చెందినదే అయినా వారు ఎప్పుడు బీసీ నేతలుగా చెప్పుకుంది లేదు.. శ్రీకాకుళం జిల్లాలో బీసీలంటే ముందు గుర్తొచ్చేది కాళింగ మరియు తూర్పు కాపులే.. అయినా కాని ఇప్పుడు అర్జెంటుగా అచ్చెన్ననాయుడుని బీసీ నేతగా ప్రోజెక్టు చేయటానికి టీడీపీ ఆరాటపడటం ఆశ్చర్యకరం.

తొలిసారి గోదావరి గుర్తింపు

వైఎస్సార్‌సీపీ గోదావరి జిల్లాల్లోని బీసీలకు చారిత్రాత్మక గుర్తింపును కట్టపెట్టిందని చెప్పాలి. జనరల్‌ సీటైన రాజమహేంద్రవరంలో బీసీ సామాజికవర్గానికి చెందిన మార్గాని భరత్‌ను నిలబెట్టి గెలిపించుకుంది. దీంతో తూర్పు గోదావరి జిల్లా నుంచి బీసీకి ఎంపీగా ప్రాతినిధ్యం దక్కినట్లయింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం నుంచి పొన్నాడ సతీశ్(మత్సకార), రామచంద్రాపురం నుంచి చెల్లుబోయిన శ్రీనివాస్‌ గోపాలకృష్ణ(శెట్టిబలిజ), పశ్చిమగోదావరి జిల్లాలో తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరావు(యాదవ) వంటి బీసీ నేతలు వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికయ్యారు. అదే సమయంలో రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యేగా ఎర్రంన్నాయుడు కూతురు భవాని (టీడీపీ) ఎంపికైనప్పటికీ ఆవిడకు,ఆవిడ మామగారు ఆదిరెడ్డి అప్పారావ్ లకు రాజమండ్రిలో ఉన్న బీసీ గుర్తింపు ఏపాటిదో అందరికీ తెలిసిందే.

కృష్ణా నుంచి నెల్లూరు వరకు…..

కృష్ణా నుంచి నెల్లూరు వరకు బీసీ ఎమ్మెల్యేల పరంగా టీడీపీకి సరైన ప్రాతినిధ్యమే కనిపించడం లేదు. కృష్ణా జిల్లాలో పెనమలూరు నుంచి గెలుపొందిన బీసీ నేత పార్థసారథి టీటీడీ పాలకమండలి సభ్యునిగా ఉన్నారు. అలాగే పెడన నుంచి గెలుపొందిన గౌడ సామాజికవర్గానికి చెందిన జోగి రమేష్‌ వైఎస్సార్‌సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గుంటూరు జిల్లాలో విషయానికొస్తే రేపల్లె నుంచి గెలిచినా అనగాని సత్య ప్రసాద్ మినహా బీసీలకు టీడీపీలో ఎక్కడా సరైన ప్రాతినిధ్యమే దక్కలేదు.

చిలకలూరిపేట నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి కాంగ్రెస్ ,టీడీపీల తరుపున కేవలం కమ్మసామాజిక వర్గం వారే గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో తొలిసారి బీసీ మహిళ విడుదల రజనీ వైసీపీ తరుపున గెలిచారు.ఆవిడ సామాజిక వర్గం రజక నుంచి ఆంద్ర ప్రాంతంలో గత మూడు దశాబ్దాలలో ఎవరు ఎమ్మెల్యేగా గెలవలేదు.

ప్రకాశం జిల్లాలో అనేక సంవత్సరాలుగా రెడ్లు,చౌదర్లు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్న కనిగిరిలో ఈసారి వైఎస్సార్‌సీపీ బీసీ అయిన బుర్రా మధుసూదన్‌ యాదవ్‌కు టిక్కెట్టు ఇచ్చింది. ఆయన గెలుపొందారు కూడా. అదేవిధంగా రెడ్డి సామాజికవర్గ ప్రభావం ఎక్కువగా ఉండే నెల్లూరు నుంచి అనిల్‌కుమార్‌ యాదవ్‌(నెల్లూరు అర్బన్‌)కు మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా వైఎస్సార్‌సీపీ బీసీలపై అభిమానాన్ని చాటుకుంది.

సీమలో విప్లవాత్మక మార్పులు

రాయలసీమ జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ బీసీలకు అనుకూలంగా సంచలన నిర్ణయాలు తీసుకుంది. రెడ్డి సామజికవర్గ ప్రభావం అధికంగా ఉండే కర్నూలు, అనంతపురం, హిందూపురం ఎంపీ సీట్లను బీసీలకు కేటాయించింది. దీంతో డాక్టర్‌ సంజీవ్‌కుమార్(చేనేత), తలారి రంగయ్య(బోయ), గోరంట్ల మాధవ్‌(కురుబ)లు పార్లమెంటు సభ్యులు కాగలిగారు. రాయలసీమలో తెలుగుదేశం నుంచి చంద్రబాబునాయుడు (కుప్పం), నందమూరి బాలకృష్ణ(హిందూపురం), పయ్యావుల కేశవ్‌(ఉరవకొండ) మాత్రమే గెలుపొందారు. వీరంతా ఏ సామాజిక వర్గం వారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

నిజమైన ప్రేమెవరిది….

అత్యధిక సీట్లు ఇచ్చి…ఎన్నికల్లో బీసీల ఆదరాభిమానాలతో అత్యధికం సీట్లు పొందిన వైఎస్సార్‌సీపీకి ఆ వర్గంపై కక్ష ఉందనడం ద్వారా టీడీపీ ప్రజల్లో మరింత పలచనవుతుంది. మరోవైపు గత ఎన్నికల్లో బీసీలు తమకు ఓట్లేయలేదనే అక్కసుతోనే టీడీపీ బీసీలను రాజకీయ బలిపశువులను చేయాలని చూస్తోందంటూ వైఎస్సార్‌సీపీ విమర్శిస్తోంది.