iDreamPost
. అయితే ఇప్పుడు ఆ పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబం చేతిలో కాకుండా నారా కుటుంబం చేతిలో ఉన్నాయి
. అయితే ఇప్పుడు ఆ పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబం చేతిలో కాకుండా నారా కుటుంబం చేతిలో ఉన్నాయి
iDreamPost
తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పగ్గాలు నందమూరి కుటుంబం చేతిలో కాకుండా నారా కుటుంబం చేతిలో ఉన్నాయి. ఈ విషయంలో కొందరు నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ ని అమితంగా ఇష్టపడే వారు అసంతృప్తిగా ఉన్నారు. తెలుగుదేశం పగ్గాలు నందమూరి కుటుంబం వారు చేపట్టాలేని ఎప్పటినుంచో డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు నారా చంద్రబాబు కూడా రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకునే సమయం వస్తోంది. వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని ఇప్పటికే ఆయన ప్రకటించాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ వారసుడు ఎవరు? తెలుగుదేశం భవిష్యత్ సారథి ఎవరు? అంటూ ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ పేరు తెరపైకి వస్తుంటుంది. అయితే నారా లోకేష్ టీమ్ చేసిన పనికి తాజాగా మరోసారి జూనియర్ పేరు తెరపైకి వచ్చింది. అంతేకాదు లోకేష్ అండ్ కో పై జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
టీడీపీ సోషల్ మీడియా విభాగం లోకేష్ కంట్రోల్ లో ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనవరి 23న లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా ఐటీడీపీ అఫిషియల్ ట్విట్టర్ పేజ్ లో ‘ఆయనొక గొప్ప నాయకుడు’, ‘భవిష్యత్ ఆశాకిరణం’ అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా “తాతకు తగ్గ మనవడు.. తాతలా ప్రజలంటే ప్రాణం ఇచ్చే వాడు” అంటూ ఎన్టీఆర్ కి అసలైన వారసుడు లోకేషే అనేలా ప్రచారం చేయడం నందమూరి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. నారా లోకేష్ అసలు నందమూరి వారసుడు ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. ఐతే తండ్రి నారా చంద్రబాబు వారసుడు అవుతాడు లేదా తాత నారా ఖర్జూరనాయుడు వారసుడు అవుతాడు.. అంతేగానీ ఎన్టీఆర్ వారసుడు ఎలా అవుతాడని ఫైర్ అవుతున్నారు.
తాతకు తగ్గ మనవడు, ఎన్టీఆర్ అసలుసిసలు వారసుడు జూనియర్ ఎన్టీఆరే అంటూ ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. తాత పోలికలు ఉన్నాయి, తాతకు తగ్గ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. 2009 ఎన్నికల సమయంలో తాతని తలపించేలా తెలుగు స్పీచ్ లతో అదరగొట్టాడు. సినిమాల్లో తన నటనతో సొంతంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇన్ని అర్హతలతో తాతకి తగ్గ మనవడుగా జూనియర్ పేరు తెచ్చుకుంటే.. తప్పుల్లేకుండా తెలుగులో మాట్లాడలేని లోకేష్ ని పట్టుకొని ఎన్టీఆర్ వారసుడు, టీడీపీ భవిష్యత్ నాయకుడు అంటూ ఈ రుద్దే ప్రయత్నం చేయడం ఏంటని జూనియర్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ జూనియర్ దేనని అంటున్నారు. చూస్తుంటే ముందు ముందు తెలుగుదేశంలో లోకేష్ వర్సెస్ జూనియర్ పోరు తారా స్థాయికి చేరేలా ఉంది.