కండక్టర్ ని సూపర్ స్టార్ చేసిన ప్రాణస్నేహితుడు

ఇండియాలోనే కాదు జపాన్ మలేషియా లాంటి దేశాల్లోనూ సూపర్ స్టార్ గా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్న రజినీకాంత్ గురించి సినిమా పరంగా మనకు తెలుసు కానీ ఆయన వ్యక్తిగత జీవితం తొలి రోజుల గురించి అవగాహన తక్కువే. ఓసారి లుక్ వేద్దాం. రజని తల్లితండ్రులు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన కర్ణాటక వాసులు. 1950 డిసెంబర్ 12న శివాజీరావు గైక్వాడ్ అంటే ఇప్పటి రజనీకాంత్ పుట్టేనాటికి వాళ్లకు ముగ్గురు సంతానం ఉన్నారు. తొమ్మిదేళ్లకే అమ్మను కోల్పోయాడు. పోలీస్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న నాన్న అండదండలతో చక్కగా చదువుకుని 1969లో కెఎస్ఆర్టిసిలో కండక్టర్ గా ఉద్యోగం తెచ్చుకున్నాడు. 21 ఏళ్ళకే సర్కారు నౌకరి.

అప్పుడే బస్సు డ్రైవర్ రాజబహదూర్ తో స్నేహం మొదలయింది. రజనిలోని నట తృష్ణ గమనించిన అతను వేషాల కోసం ప్రయత్నించమని ప్రోత్సహించి మదరాసు పంపించాడు. చేస్తున్న జాబ్ వదలేయడం ఇష్టం లేకపోయినా హీరో కావాలన్న లక్ష్యం ముందు ఇది చిన్నదే అనిపించి రాజీనామా చేశాడు. నగరంలో ఖర్చులకు గాను తనకొచ్చే నాలుగు వందల జీతంలో సగం రాజబహదూర్ క్రమం తప్పకుండ రజినీకాంత్ కు మనీ ఆర్డర్ చేసేవాడు. ఒకవేళ ఎక్కువ మొత్తం అవసరమైతే ఎమెర్జెన్సీ కోసం ఓ గొలుసు కూడా ఇచ్చాడు. అంత నమ్మకం ఆయనకి స్నేహితుడి మీద. 1975లో బాలచందర్ పరిచయంతో రజనీకాంత్ దశ తిరిగింది.

తెలుగులో తూర్పు పడమరగా వచ్చిన అపూర్వ రాగంగల్ లో శ్రీవిద్య భర్తగా నటించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. 76లో కథా సంగమ, 77లో అంతులేని కథ కెరీర్లో మేలి మలుపులుగా నిలబడ్డాయి. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 80 దశకం మధ్యలో వచ్చేనాటికి రజనిలో సూపర్ స్టైల్ కోట్లాది ఫ్యాన్స్ ని తెచ్చిపెట్టింది. దళపతి బాషా నరసింహ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో బ్లాక్ బస్టర్ ది ఒక్కో చరిత్ర. తన నటపునాదిలో అన్ని రాళ్లని మోసిన రాజా బహదూర్ తో స్నేహం ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు రజని. ఆయన ప్రోత్సాహం లేకపోతే ఎప్పుడో ఆర్టిసి ఎంప్లొయ్ గా రిటైర్ అయ్యేవాడినని రజని చమత్కరిస్తూనే ఉంటారు.

Show comments