iDreamPost
iDreamPost
టీవీ డిబేట్ లో మహ్మద్ ప్రవక్త పై అనుచిత కామెంట్స్ చేసిన అధికార ప్రతినిధి నూపుర్ శర్మ (Nupur Sharma)ను బీజేపీ బహిష్కరించింది. ఈ వ్యాఖ్యలపై గల్ఫ్ దేశాల నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది. ఈ రియాక్షన్ ను భారతదేశం ఊహించలేదు.
నుపూర్ శర్మ ఆ తర్వాత తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఏ ఒక్కరి మత భావాలను గాయపరచాలన్నది నా అభిమతం కాదని అన్నారు. కాని అప్పటికే నష్టం జరిగిపోయింది.
ఎవరీ నూపుర్ శర్మ?
ఆమె ఓ అడ్వకేట్. బీజేపీలో వాగ్ధాటి ఉన్న నేతల్లో ఒకరు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా పట్టా తీసుకున్నారు. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో LLM పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే రాజకీయాల్లోకి దిగారు. టీచ్ ఫర్ ఇండియాకు ఆమె రాయబారిగా కూడా.
ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడంతోనే, 2008లో, ఆమె రాజకీయ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ యూత్ వింగ్ లో ఆమె పనిచేశారు.
2015 ఎన్నికల్లో ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కి వ్యతిరేకంగా, న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీచేయడంతోనే మీడియా దృష్టిని ఆకట్టుకున్నారు. ఆమె ఓడినా, ఢిల్లీ నుంచి బీజేపీ తరుపున మాట్లాడే నేతల్లో ఒకరిగా మారారు.
తరచు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తారని, నోటికి అదుపుతక్కువని చాలా విమర్శలు వచ్చాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో, ఆమె వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రగడ మొదలైంది. ఈ ఘర్షణలో 40 మంది గాయపడితే, 1,500 మందిమీద కేసులు పెట్టారు.
నూపుర్ శర్మ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా పెద్ద దుమారమే రేగింది. సౌదీ అరేబియా, ఖతార్, బెహ్రెయిన్, ఇరాన్ దేశాలు గట్టిగానే విమర్శించాయి. ఇక ఖతార్, బహ్రెయిన్ దేశాలు భారత దౌత్యవేత్తలను పిలిచి, అసంతృప్తిని వ్యక్తిచేశాయి. కాని ఈ రెండు దేశాలు శర్మపై బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించాయి.