iDreamPost
android-app
ios-app

MLC Elections – కాబోయే ఎమ్మెల్సీలెవరు, జగన్ అండదండలు అందేదెవరికి

  • Published Oct 31, 2021 | 7:42 AM Updated Updated Oct 31, 2021 | 7:42 AM
MLC Elections – కాబోయే ఎమ్మెల్సీలెవరు, జగన్ అండదండలు అందేదెవరికి

ఏపీలో ఎమ్మెల్సీల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆశావాహుల సందడి మొదలయ్యింది. గతంలో తమకు పార్టీ అధినేత నుంచి హామీ రావడంతో ఈసారి తమ ఆశలు పండుతాయనే అభిప్రాయంతో చాలామందే ఉన్నారు. దాంతో ఈసారి జాబితాలో ఎవరి పేరు ఉంటుందన్నది చర్చనీయాంశం అవుతోంది. ముఖ్యంగా మూడు ఎమ్మెల్సీ ఖాళీ సీట్లకు ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. గత మే నెలలోనూ ఇవి ఖాళీ అయ్యాయి. టీడీపీ కి చెందిన ఎమ్మెల్సీ, మండలి చైర్మన్ గా పనిచేసిన మహ్మద్ షరీఫ్, బీజేపీ తరుపున మండలిలో ప్రాతినిధ్యం వహించిన సోము వీర్రాజు, వైఎస్సార్సీపీకి చెందిన దేవసాని చిన్న గోవిందరెడ్డి పదవీకాలం ముగియడంతో రిలీవ్ అయ్యారు. అయితే కరోనా కారణంగా అప్పట్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. వాయిదా పడుతూ వచ్చిన ఎన్నికలకు ఇప్పుడు ముహూర్తం ఖరారు కావడంతో అధికార పార్టీ తరుపున బరిలో నిలిచేదెవరూ అనే ఆసక్తి కనిపిస్తోంది.

ఎమ్మెల్యేల కోటాలో ఈ మూడు స్థానాలు అధికార పార్టీ కైవసం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉంది. దాంతో అధినేత అండదండలు దక్కిన వారు నేరుగా మండలిలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. దాంతో ఈసారి మళ్ళీ డీసీ గోవిందరెడ్డికి అవకాశం దక్కడం ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇటీవల బద్వేలు ఉప ఎన్నికల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. బద్వేలు పరిధిలోని శ్రీ అవధూత కాశీనాయన మండలానికి చెందిన గోవిందరెడ్డి గట్టిపట్టున్న నాయకుడిగా గుర్తింపు ఉంది. బద్వేలు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మెజార్టీ భారీగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయనకు రెండోసారి ఛాన్స్ ఖాయంగా చెబుతున్నారు.

మిగిలిన రెండు సీట్లలో ఎవరికి అవకాశం వస్తుందోననే చర్చ ఉంది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కూడా నవంబర్ లోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దాంతో ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి. ఈలోగా మిగిలిన రెండు సీట్ల కోసం పలువురు పోటీలో ఉన్నారు. అందులో మర్రి రాజశేఖర్ వంటి వారు పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ ఆయనకు స్థానిక సంస్థల కోటాలో ఛాన్స్ ఇచ్చేందుకు అధినేత మొగ్గు చూపుతారనే అభిప్రాయం కూడా ఉంది. అదే సమయంలో సామాజిక సమీకరణాల రీత్యా రాయలసీమ రెడ్డి కోటాలో గోవిందరెడ్డికి ఛాన్సిస్తే మిగిలిన వాటిలో ఒకటి ఎస్సీలకు, రెండోది మహిళలకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దాంతో ఉత్తరాంధ్రకు చెందిన వరుదు కళ్యాణి వంటి వారు ఆశావాహుల జాబితాలో ఉన్నారు.

ఎస్సీలకు సంబంధించి ఇటీవలే ముగ్గురుకి చాన్స్ దక్కింది. అందులో తిరుపతి ఎంపీగా మరణించిన బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబం కోటాలో ఒకటి కాగా, మాజీ ఎంపీ పండుల రవీంద్రతో పాటుగా సీనియర్ నేతగా ఉన్న మోజేస్ రాజుకి కూడా అవకాశాలు వచ్చాయి. దాంతో ఈసారి ఎస్సీలకే ఛాన్స్ వస్తుందా లేదా అనే చర్చ కూడా సాగుతోంది. దాంతో ఇప్పటికే పలువురు నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో జగన్ ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో చూడాలి. ఏజన్సీ కోటాలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ గా పనిచేసిన అనంతబాబు కూడా ఆశిస్తున్నారు. అయితే కాపుల పేరు పరిశీలకు వస్తేనే ఆయన్ని పరిగణలోకి తీసుకుంటారు. రాజమండ్రికి చెందిన శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం కూడా రేసులో ఉన్నారు. ఏపీఐఐసీ చైర్మన్ గా పనిచేసిన ఆయన వైశ్య కోటాలో ఆశావాహుల జాబితాలో ఉన్నారు.

వారితో పాటుగా గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి దక్కని వారు, చాలాకాలంగా ఎమ్మెల్సీ ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న నేతల పేర్ల లిస్టు కూడా పెద్దదే ఉంది. అయితే స్థానిక సంస్థల జాబితాలోనే ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ముగ్గురిలో ఒక మహిళ, ఒక రెడ్డి సీట్లు ఖాయం కాగా, మూడోది ఎవరికి దక్కుతుందన్నదే కీలకంగా కనిపిస్తోంది.