iDreamPost
android-app
ios-app

TDP, Chandrababu, OTS – డ్వాక్రా సంఘాలు, ఓటీఎస్‌.. ఓ చంద్రబాబు

TDP, Chandrababu, OTS – డ్వాక్రా సంఘాలు, ఓటీఎస్‌.. ఓ చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే హామీలు ఇస్తున్నారు. అవి 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం మంజూరు చేసిన గృహాల బకాయిలను ఒకే విడతలో చెల్లించి, ఆ ఆస్తికి పట్టాను పొందే అవకాశాన్ని జగన్‌సర్కార్‌ కల్పించింది. దీనికి ఓటీఎస్‌(వన్‌ టైం సెటిల్‌మెంట్‌) అని పేరు పెట్టింది. గ్రామాలలో 10 వేల రూపాయలు, పట్టణాలలో 15 వేలు, నగరాల్లో 20 వేల రూపాయలు చెల్లిస్తే.. చాలు గృహాలపై ఉన్న రుణాలు అన్నింటినీ మాఫీ చేసి.. లబ్ధిదారులకు ఇంటిపై హక్కు కల్పిస్తారు.

అయితే ఓటీఎస్‌కు ఎవరూ డబ్బులు కట్టవద్దని, తాము అధికారంలోకి రాగానే ఉచితంగా పట్టా ఇస్తామంటూ చంద్రబాబు హామీ ఇస్తున్నారు. నెల రోజుల్లోనే రుణాలు అన్నీ మాఫీ చేసి పట్టాలు ఇస్తామని చెప్పుకొస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన ఈ హామీ 2014 ఎన్నికల సమయంలో ఆయన ఇచ్చిన డ్వాక్రా రుణాల మాఫీ హామీని గుర్తు చేస్తోంది. 2014 ఎన్నికలకు ఆరు నెలల ముందే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, మహిళలు ఎవరూ రుణాలు కట్టవద్దని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మిన కొంత మంది మహిళలు నెల వారీ వాయిదాలు కట్టడం మానేశారు. చంద్రబాబుకు ఓట్లేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే సమయానికి డ్వాక్రా సంఘాల రుణాలు 14,200 కోట్ల రూపాయలు ఉన్నాయి.

స్వల్ప మెజారిటీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రోజులు, నెలలు గడుస్తున్నా.. రుణాల మాఫీపై చంద్రబాబు ప్రకటన చేయడం లేదు. మహిళలు మాత్రం ఇచ్చిన హామీని అమలు చేస్తారనే ఆశతో.. కంతులు కట్టడం లేదు. నెలలు గడిచిపోయాయి. అప్పటికే డ్వాక్రా సంఘాల మహిళలు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు తానెప్పుడు చెప్పానని బుకాయించడంతో మహిళల గుండెల్లో ఒక్కసారిగా పిడుగుపడినట్లైంది. చంద్రబాబు ఈ తరహా ప్రకటన చేసిన వెంటనే.. బ్యాంకులు రుణాలు కట్టని డ్వాక్రా సంఘాలకు నోటీసులు పంపడం ప్రారంభించాయి. అసలు, దానిపై వడ్డీ, అపరాధ రుసుముతో సహా డ్వాక్రా సంఘాల మహిళలు తమ బాకీలను బ్యాంకులకు చెల్లించారు. పలు సంఘాలు పేరుకుపోయిన బాకీలు ఒక్కసారిగా చెల్లించలేక ఎగవేత సంఘాలుగా మారిపోయాయి.

ఇప్పుడు మరోసారి ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఇస్తున్న హామీ ఓటీఎస్‌ కూడా డ్వాక్రా సంఘాల రుణాల మాఫీ మాదిరిగా కాదన్న గ్యారెంటీ ఏముంది..? ఒక సారి మోసపోయిన ప్రజలు.. చంద్రబాబు మాటను మళ్లీ నమ్ముతారా..? అంటే టీడీపీ శ్రేణులు కూడా ఈ విషయంలో ఆలోచిస్తున్నాయి. చంద్రబాబు, ఆ పార్టీ పై స్థాయి నేతలు మాత్రమే ఓటీఎస్‌ కట్టొద్దంటూ మీడియా ముందుకు వచ్చి ప్రచారం చేస్తున్నారు గానీ.. క్షేత్రస్థాయిలో టీడీపీ క్యాడర్‌ మాత్రం బాబు చెబుతున్న హామీని ప్రజలకు చెప్పే సాహసం చేయడం లేదు. అలా చెబితే.. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తమ్ముళ్లకు బాగా తెలుసు.

Also Read : OTS -ఓటీఎస్‌పై టీడీపీ అవాస్తవాల ప్రచారం