iDreamPost
iDreamPost
దీపావళి అమావాస్య రోజున తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి హృదయంలో హఠాత్తుగా హిందూ ప్రేమ జ్యోతులు వెలిగాయి! అమరావతి నుంచి
హిందువులపై అపారమైన ప్రేమానురాగాలను ఒలకబోశారు. బీజేపీతో పొత్తు కోసం ఎన్నాళ్లుగానో పరితపించి పోతున్న బాబు తాజాగా ఆ పార్టీ దృష్టిలో పడేందుకు మీడియా సాక్షిగా చాలా కష్టపడ్డారు.
సీఎం, ఎస్‌ఈసీపై అక్కసు..
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్ దీపావళి రోజున ప్రారంభించడంపై బాబు మండిపడ్డారు. హిందువులు దీపావళి పండగ చేసుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. దీన్ని బట్టి సీఎం జగన్మోహనరెడ్డి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఇతర మతాల పండగలు ఉంటే ఎన్నికల ప్రక్రియ చేపట్టేవారా? అని నిలదీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించారు. ఇలాంటి
వ్యాఖ్యలు చేస్తే ఓవర్ నైట్
తానొక వీర హిందువుగా గుర్తింపు తెచ్చుకోగలనని బాబుగారి ప్రగాఢ విశ్వాసం. తద్వారా తనను బీజేపీ తప్పక అక్కున చేర్చుకుంటుందని ఆశ.
ఈ విన్యాసాలు ఎవరైనా నమ్ముతారా? తాను ముఖ్యమంత్రిగా గుళ్ళు, గోపురాలకు వెళ్లిన వెళ్లినప్పుడు, పూజాధికాల సమయంలో బూట్లు కూడా విప్పని చంద్రబాబుకు దేవుడంటే ఎంత భక్తి ఉందో అందరికీ తెలుసు. విజయవాడలో 43 హిందూ దేవతల విగ్రహాలు కూల్చినప్పుడు కానీ, గోదావరి పుష్కరాల్లో 29 మంది హిందూ భక్తులు తొక్కిసలాటలో మరణించినప్పుడు కానీ మీరు ఏ పాటి మానవత్వం చూపారో అటు ప్రజలకు, ఇటు బీజేపీ వారికి అనుభవమే. కేవలం రాజకీయ స్వార్థం కోసమే మీరు గత ఏడాదిగా హిందువులపై ప్రేమ, సానుభూతి చూపిస్తున్నారన్న సంగతి సులువుగానే అర్థమవుతోంది. ఇంక ఎవరు నమ్ముతారని ఈ విన్యాసం?
Also Read : TDP BJP Allience -టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీజేపీ వైఖరి, బాబుకు మింగుడుపడని వ్యవహారం
నాటకాలాడితే వదిలిపెట్టరట..
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఎస్ఈసీని ప్రభావితం చేస్తున్నట్టు కలర్ ఇవ్వడానికి ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న బాబు తాజాగా కూడా ఆ తరహా ఆరోపణలే చేశారు. నామినేషన్ల విషయంలో ఆర్వోలు పద్ధతిగా వ్యవహరించాలి. నాటకాలాడితే వదలం. వెంటాడతాం అంటూ ఎన్నికల అధికారులను బహిరంగంగా బ్లాక్ మెయిల్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించారు. రాష్ట్రాన్ని పిచ్చివాళ్ల రాజ్యం చేస్తారా? అని ఊగిపోయిన బాబు ఎక్కడ దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించారో..ఎవరు సృష్టించారో చెప్పలేదు. ఆయన స్వీప్ కామెంట్లు చేసేస్తే గతంలో ఏవో అరాచకాలు జరిగిపోయాయని మనం అనుకోవాలా?
టీడీపీ అభ్యర్థులకు సూచనలంటూ హంగామా..
అభ్యర్థులు నామినేషన్లను జాగ్రత్తగా దాఖలు చేయాలి. నామినేషన్ల దాఖలుకు ముందు, తర్వాత సోషల్ మీడియాలో పెట్టాలి.
చిన్న తప్పులు చేసినా నామినేషన్లు చెల్లకుండా చేసే ప్రమాదం ఉంది. న్యాయవాదుల సలహాలు తీసుకోవాలి అని టీడీపీ అభ్యర్థులకు బాబు సూచనలు కూడా చేశారు. పనిలో పనిగా ఎన్నికలను ఎలా నిర్వహించాలో వివరిస్తూ ఎస్ఈసీకి కూడా బాబు కొన్ని సూచనలు ఇచ్చేశారు! ఆ ప్రకారం ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించకుంటే సీఎం జగన్మోహనరెడ్డితో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కుమ్మక్కు అయినట్టు మనం భావించాలన్న మాట.
అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలట..
వైఎస్సార్ సీపీకి దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలి. గతంలో ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేసేలా వ్యవహరించారు. ఎన్నికలు పకడ్బందీగా జరిగితే వైఎస్సార్ సీపీ గెలవదు అని బాబు తేల్చేశారు. అంటే బాబుగారి గెలవని ఏ ఎన్నికైనా పకడ్బందీగా జరగనట్టే అని అర్థం చేసుకోవాలి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల నుంచి మొన్నటి బద్వేల్ ఉప ఎన్నిక వరకు అన్నీ ప్రజాతీర్పును ప్రతి బింబించలేదన్న మాట. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే టీడీపీ గెలవడం ఖాయం. అందుకే బాబుగారు
అసెంబ్లీ ఎన్నికలకు కాలు దువ్వుతున్నారు. అయితే ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ లా, ఒక వేమూరి రాధాకృష్ణ లా నిష్పక్షపాతంగా పనిచేసే వాళ్లు దేశంలో బొత్తిగా కరువైపోయారు. అలాంటి వృత్తి నిబద్ధత ఉన్న వ్యక్తి దొరికిన తక్షణం అసెంబ్లీని రద్దు చేసేసి ఎన్నికలు నిర్వహించడం ఉత్తమం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం సాధ్యమైనంత త్వరగా ఫరిడవిల్లాలి కదా!
Also Read : TDP Buddha Venkanna – ఎందుకొచ్చిన సవాళ్లు.. బుద్దాకు ఇది అవసరమా?