iDreamPost
android-app
ios-app

బొజ్జల కుటుంబానికి రాజకీయ పూర్వవైభవం సాధ్యమేనా..?

బొజ్జల కుటుంబానికి రాజకీయ పూర్వవైభవం సాధ్యమేనా..?

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఆరు సార్లు పోటీ చేయగా.. ఐదు సార్లు గెలిచారు. చంద్రబాబు ప్రభుత్వాలలో మంత్రిగా పని చేశారు. న్యాయవాది వృత్తి నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గోపాలకృష్ణారెడ్డి 1989లో టీడీపీ నుంచి పోటీ చేశారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లో విజయం సాధించారు. 1994లోనూ వరుసగా రెండోసారి గెలిచారు.

1994లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ నుంచి ముఖ్యమంత్రి పదవి, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు చేజిక్కించుకోవడంలో బొజ్జల గోపాల కృష్ణారెడ్డిది కూడా కీలక పాత్ర. టీడీపీ ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలు నడిసిన హైదరాబాద్‌లోని వైశ్రాయ్‌ హోటల్‌ స్వయానా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బావమరిది ప్రభాకర్‌ రెడ్డిదే. క్యాంపు రాజకీయంలో చంద్రబాబుకు చేదోడు వాదోడుగా బొజ్జల మెలిగారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు.

1999లోనూ వరుసగా మూడోసారి శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గెలిచారు. హాట్రిక్‌ విజయంతో మరోమారు చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 2003లో తిరుమల సమీపంలోని అలిపిరిలో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ సమయంలో చంద్రబాబుతోపాటు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి ఉన్నారు. ఈ ఘటనలో చంద్రబాబు కన్నా.. బొజ్జలకు ఎక్కువ గాయాలయ్యాయి.

అలిపిరి బాంబు దాడి నేపథ్యంలో సానుభూతి ఓట్లు సంపాదించాలనే లక్ష్యంతో ఆరు నెలల ముందే చంద్రబాబు ఎన్నికలకు వెళ్లగా.. టీడీపీతోపాటు.. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కూడా శ్రీకాళహస్తిలో ఓడిపోయారు. అప్రతిహాతంగా మూడుసార్లు గెలిచిన బొజ్జలకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌సీవీ నాయుడు బ్రేక్‌ వేశారు. వైఎస్‌రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్ర వేవ్ కు బొజ్జల కూడా గల్లంతవకతప్పలేదు. అలిపిరి బాంబు దాడిలో గాయపడినా సానుభూతి ఓట్లు కూడా దక్కలేదు.

Also Read : “కోట్ల” రాజకీయ భవిషత్తు ఏమవుతుంది?

2009లో బొజ్జల మళ్లీ గెలిచినా టీడీపీ ఓడిపోయింది. 2014లోనూ వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూధన్‌ రెడ్డిపైనా 7,583 ఓట్ల మెజారిటీతో బొజ్జల విజయం సాధించారు. చంద్రబాబు కేబినెట్‌లో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

అయితే అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ బొజ్జలను చంద్రబాబు మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆ పదవిని వైసీపీ నుంచి వచ్చిన వారికి కట్టబెట్టారు. ఈ పరిణామంపై బొజ్జల సతీమణి చంద్రబాబు నైజాన్ని ఎండగట్టారు. వైశ్రాయ్‌ ఘటనలో తోడునీడగా ఉన్నా, అలిపిరి ఘటనలో బాబుతోపాటు దాడికి గురైనా.. అవేమీ బొజ్జలను మంత్రి పదవిలో నిలబెట్టలేకపోయాయి.

2019 ఎన్నికల్లో బొజ్జల వారసుడు బొజ్జల సుధీర్‌ రెడ్డి టీడీపీ తరఫున బరిలో నిలిచారు. వైసీపీ తరఫున మళ్లీ బియ్యపు మధుసూధన్‌ రెడ్డి నిలబడ్డారు. 2014 ఓటమికి ప్రతికారం తీర్చుకునేలా.. బియ్యపు మధుసూధన్‌ రెడ్డి టీడీపీ అభ్యర్థి అయిన బొజ్జల సుధీర్‌ రెడ్డిపై 38,141 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. శ్రీకాళహస్తి అసెంబ్లీ చరిత్రలో అత్యధిక మెజారిటీ ఇదే.

Also Read : తోటకు కౌంటర్‌ ఇచ్చే కాపు నేతే లేరా..?

ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బొజ్జల చికిత్స తీసుకుంటున్నారు. నియోజకవర్గ టీడీపీ బాధ్యతలను సుధీర్‌ రెడ్డి చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఇరు పార్టీలు శ్రీకాళహస్తిపై దృష్టి కేంద్రీకరించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే.. ఈ సారి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ శ్రీకాళహస్తి నుంచి ఇవ్వాలనే లక్ష్యంతో బియ్యపు మధుసూధన్‌ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన, చేస్తున్న పనులు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. కార్యకర్తలు, నేతలను ఆ దిశగా దిశానిర్దేశం చేస్తున్నారు. టీడీపీ తరఫున ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు శ్రీకాళహస్తి బాధ్యతలు చూస్తున్నారు. స్థానిక కో ఆర్డినేటర్‌ బొజ్జల సుధీర్, ఇతర నేతలతో సమాలోచనలు జరుపుతున్నారు.

బొజ్జల కుటుంబానికి కంచుకోట మాదిరిగా ఉన్న శ్రీకాళహస్తిలో భారీ మెజారిటీతో గత ఎన్నికల్లో పాగా వేసిన బియ్యపు మధుసూధన్‌ రెడ్డి.. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి మన్ననలు పొందుతున్నారు. నియోజవర్గంలో అభివృద్ధి పనులు చేయడంతోపాటు.. సొంత నిధులతో నిత్యం సేవాకార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. గత ఏడాది కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో మధుసూధన్‌ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు చేసిన సేవలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలందాయి.

ఈ తరహాలో ప్రజలల్లో పేరు తెచ్చుకుంటూ పని చేస్తున్న బియ్యపు మధుసూధన్‌ రెడ్డిని ఎదుర్కొవాలంటే బొజ్జల సుధీర్‌ రెడ్డి శక్తికి మించి కష్టపడాల్సి ఉంటుంది. బొజ్జల కుటుంబానికి మళ్లీ రాజకీయంగా పూర్వవైభవం వస్తుందనే ఆశ టీడీపీ శ్రేణుల్లో కలగాలంటే.. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్‌ తన సత్తా చూపించాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో బియ్యపు మధుకు వచ్చిన మెజారిటీ (38,141 ఓట్లు)ని ఎంత మేరకు తగ్గిస్తారనేదే బొజ్జల రాజకీయ పూర్వ వైభవానికి ప్రమాణికంగా తీసుకొచ్చు. అదే సమయంలో వైసీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కన్నా ఎక్కువ మెజారిటీ సంపాదిస్తే.. బియ్యపు తన సేవా కార్యక్రమాలతో మరింత పట్టు సాధించినట్లే.

Also Read : తిరుపతి ఎన్నికల్లో బీదా రవి కనిపించటం లేదే..!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి