iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకూ ఎదిగిన వారణాశి రామ్ మాధవ్ వ్యవహారం ఇప్పుడు మరోసారి ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా నుంచి పక్కకు తొలిగారు. జేపీ నడ్డా టీమ్ లో ఆయనకు చోటు దక్కలేదు. దాంతో రామ్ మాధవ్ కి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందనే ప్రచారం ఢిల్లీ స్థాయిలో సాగుతోంది. దానికి అనుగుణంగానే ఆయన మిత్రులు ఆశావాహకంగా కనిపిస్తున్నారు. అయితే తాజాగా ఆయన మరోసారి ఆర్ఎస్ఎస్ వ్యవహారాలకు మళ్లుతున్నట్టు అంచనాలు వినిపిస్తున్నాయి. హస్తిన- నాగపూర్ వర్గాల మధ్య సమన్వయకర్తగా ఆయనకు మరోసారి బాధ్యతలు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఆరేడేళ్లుగా రామ్ మాధవ్ బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. అనేక సందర్భాల్లో ఆయన పార్టీ అవసరాల రీత్యా తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చాయి. కశ్మీర్, త్రిపుర సహా అనేక రాష్ట్రాల వ్యవహారాల్లో ఆయన చొరవ ప్రదర్శించారు. అదే సమయంలో ఏపీలో కూడా రామ్ మాధవ్ తనదైన మార్క్ చూపించారు. సోము వీర్రాజుకి రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కడంలో ఆయనదే ప్రధాన పాత్ర. గతంలో కొన్ని అడ్డంకులు ఎదురయినా ఇటీవల వాటిని అధిగమించి రామ్ మాధవ్ మాట మేరకు సోము వీర్రాజు ఏపీ బీజేపీ సారధిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పుడు రామ్ మాధవ్ మరోసారి బీజేపీ బాధ్యతల నుంచి వైదొలిగితే అది ఏపీ బీజేపీ వ్యవహారాల మీద పడుతుందనడంలో సందేహం లేదు. ఇటీవల నూతన కార్యవర్గంలో రామ్ మాధవ్ తో పాటుగా జీవీఎల్ కి అధికార ప్రతినిధి హోదా కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు వారిలో ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం వస్తే రాష్ట్ర రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా మారతారనే అంచనాలున్నాయి. అలాంటి సమయంలో హఠాత్తుగా రామ్ మాధవ్ మళ్లీ పార్టీ నుంచి సంఘ్ బాధ్యతల్లోకి మళ్లితే కీలక మలుపు అవుతుంది. వాస్తవానికి ఒకసారి సంఘ్ నుంచి పార్టీకి వచ్చిన తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లిన నేతలు తక్కువే. కానీ ఇటీవల సంతోష్ జీ వంటి నేతలు పార్టీలోకి వచ్చిన తరుణంలో సమన్వయకర్తగా రామ్ మాధవ్ మరోసారి వ్యవహరించాల్సి ఉంటుందనే వాదనను కొందరు తీసుకొస్తున్నారు
రామ్ మాధవ్ మాత్రం క్యాబినెట్ బెర్త్ మీద ఆశతో ఉన్నట్టు కనిపిస్తోంది. దాంతో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తికరం. వాస్తవానికి మోడీ- రామ్ మాధవ్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. కీలకాంశాలలో రామ్ మాధవ్ కి మోడీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు కూడా తన క్యాబినెట్ లో సహచరుడిగా తగిన హోదా ఇస్తారనే అంచనాలున్నాయి. దాంతో ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లో ఏం జరుగుతోంది..అది ఏపీ రాజకీయాల మీద ఏమేరకు ప్రభావం పడుతుందన్నది ఆసక్తికరమే.