iDreamPost
android-app
ios-app

కొత్త పుంతలు తొక్కుతున్న మిత్రపక్ష రాజకీయం

కొత్త పుంతలు తొక్కుతున్న మిత్రపక్ష రాజకీయం

దేశంలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకూ ప్రత్యర్థి పార్టీల ప్రజా ప్రతినిధులను చేర్చుకునే సంస్కృతి ఉండగా.. తాజాగా మిత్రపక్ష పార్టీల మధ్య ఫిరాయింపుల రాజకీయం మొదలైంది. ఇందుకు బీజేపీ–జేడీయూ పార్టీలు వేదికగా నిలిచాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో జేడీయూకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలలో ఆరుగురు బీజేపీలోకి ఫిరాయించడం ఆ రెండు పార్టీల మధ్య సరికొత్త ఆజ్యానికి కారణమవుతోంది. తన పార్టీ ఎమ్మెల్యేలను మిత్రపక్షమైన బీజేపీ లాగేసుకోవడంపై జేడీయూ అత్యవసరంగా సమావేశమైంది. దేశ రాజకీయాలు – జేడీయూ భవిష్యత్‌ అనే అంశాలపై ఆ పార్టీ నేతల మధ్య అత్యవసర సమావేశం జరిగింది. అదే సమయంలో జేడీయూ సారధిగా నితీష్‌కుమార్‌ స్థానంలో ఆ పార్టీ రాజ్యసభ్యుడు ఆర్‌పీ సింగ్‌ను ఎంపిక చేశారు.

తన పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకున్నా.. నితీష్‌కుమార్‌ మౌనాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. బిహార్‌లో బీజేపీ–జేడీయూ ప్రభుత్వానికి నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే.. ఆయన మౌనానికి కారణమనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ పగ్గాలు అత్యవసరంగా వేరే వారికి అప్పగించారనే విశ్లేషణలు సాగుతున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ చేర్చుకోవడంపై జేడీయూ సీనియర్‌ నేత కేసీ త్యాగీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కూటమి రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు మంచివి కావని, వీటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమన్నారు. బీజేపీ తరును ఖండించారు. అయితే ఇది జరిగిన రెండు రోజుల తర్వాత జేడీయూ స్పందించడం విశేషం.

కాగా, మరో వైపు భవిష్యత్‌ పరిణామాలపై హెచ్చరికలు జారీ చేస్తూనే.. కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌదరి జేడీయూ మాజీ చీఫ్, బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కు సలహా ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలతో టచ్‌లో ఉండాలంటూ సూచించారు. మిత్రపక్షాలను మింగేసి, తానే బలంగా ఉండాలనుకునే బీజేపీ రాజకీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధీర్‌ సూచించడం బిహార్‌లో గతంలో జరిగిన పరిణామాలను గుర్తు చేస్తున్నాయి. 2015 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీతో జేడీయూ పొత్తుపెట్టుకుని గెలిచింది. ఆర్‌జేడీ–జేడీయూ కూటమి తరఫున నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే మధ్యలోనే నితీష్‌కుమార్, ఆర్‌జేడీకి హ్యాండ్‌ ఇచ్చి బీజేపీతో జతకట్టారు. 2014 ఎన్నికల్లో మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన నితీష్‌ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చారు. మళ్లీ కలిశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే తనకు చివరి ఎన్నికలని నితీష్‌ ప్రకటించారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా జరుగుతున్న ఘటనలతో నితీష్‌ ముఖ్యమంత్రి పీఠం, జేడీయూ భవిష్యత్‌ ఎలా ఉండబోతోందన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.