iDreamPost
android-app
ios-app

కేసీఆర్‌ నిర్ణయాల్లో వ్యూహం ఏంటి..?

కేసీఆర్‌ నిర్ణయాల్లో వ్యూహం ఏంటి..?

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కొనుగోలు విధానంపై మరింత శ్రద్ధ పెట్టారు. కరోనా సమయంలో కూడా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని కొనుగోలు కేంద్రాల సంఖ్యను 6వేల పైచిలుకు పెంచి గ్రామగ్రామనా ధాన్యం సేకరించారు. రైతుల ముంగిట్లో కొనుగోలు కేంద్రాలు ఉండటంతో వారికి పంట అమ్ముకునేందుకు సౌకర్యవంతంగా ఉండేది. రైస్‌మిల్లర్లు, దళారులను నియంత్రించటానికి, మార్కెటింగ్‌ బ్యాలెన్స్‌ కోసం ఇవి దోహదపడేవి. మరోవైపు ఆరుతడి పంటలైన కందులు, మొక్కజొన్న, శనగలు, పొద్దుతిరుగుడు, సోయాబీన్‌, జొన్నలు, ఎర్రజ్నొలు, పెసర్లు, మినుములు… తదితర పంట ఉత్పత్తులను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసేవారు. రైతులకు ఎమ్మెస్పీ చెల్లించటం, రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమచేయటంతోపాటు కొనుగోలు ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయచట్టాలను అమలుచేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. తాము ఉత్పత్తి చేసిన పంటలను రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని.. పంటల కొనుగోలు, అమ్మకాలు సర్కారు బాధ్యత కాదంటూ ప్రగతిభవన్‌ సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

మార్పులు దేనికి సంకేతం..

పంట ఉత్పత్తుల కోసం ఇక నుంచి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఉండవని ఆయన స్పష్టం చేయడం ద్వారా ధాన్యం, ఇతర ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ నుంచి సర్కారు వైదొలిగిందన్న ప్రచారం జరుగుతోంది. పౌరసరఫరాల సంస్థ, మార్క్‌ఫెడ్‌, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ఏర్పాటుచేస్తున్న కొనుగోలు కేంద్రాలు ఇకనుంచి గ్రామాల్లో కనిపించవు. ఈ పరిస్థితుల్లో అన్నదాతలకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలే పెద్ద దిక్కుగా మారనున్నాయి. అక్కడ లైసెన్సు ఉన్న వ్యాపారులే తప్ప.. ప్రభుత్వం కొనుగోలుచేసే పరిస్థితి ఉండదు. కొనుగోలు కేంద్రాలు ఇక నుంచి ఉండవంటూ ప్రభుత్వం చేసిన ప్రకటన.. రైతులు, రైతుసంఘాల్లో చర్చనీయాంశంగా మారింది. పంట ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ నుంచి రాష్ట్ర ప్రభుత్వం వైదొలిగితే రైతులు పరిస్థిత ఏమిటనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 189 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు, 94 సబ్‌ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. గతంలో మాదిరిగానే వీటిలో పంట ఉత్పత్తుల కొనుగోలు జరుగుతుంది. మార్కెట్‌ ప్రాంగణంలో జరిగే క్రయవిక్రయాలపై ఒక శాతం సెస్‌ను వసూలు చేస్తారు. ఉదాహరణకు రూ.1లక్ష విలువైన పంట ఉత్పత్తులను కొంటే, సెస్‌ రూపంలో రూ.1000 మార్కెటింగ్‌ శాఖకు వెళుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి