iDreamPost
android-app
ios-app

501రూ/- కే టిక్కెట్ ఇచ్చిన ఎయిర్ డెక్కన్ ఏమైంది?

  • Published Nov 12, 2020 | 2:19 PM Updated Updated Nov 12, 2020 | 2:19 PM
501రూ/- కే టిక్కెట్ ఇచ్చిన ఎయిర్ డెక్కన్ ఏమైంది?

కష్టపడటం, పడటం, ఎదురయ్యే సమస్యలతో పోరాడి నిలబడటం, మళ్ళీ పడటం ఆయన జీవన ప్రయాణంలో భాగం. పశువులను పెంచి పాల వ్యాపారం చేసినా, పౌల్ట్రీ, పట్టు పురుగుల పెంపకం చేసినా, మోటారు సైకిల్ వ్యాపారిగా, ఉడిపి హోటల్ యజమానిగా చివరికి రాజకీయ నాయకుడిగా మారినా ఆయనకు గుర్తింపు తెచ్చింది మాత్రం భారత్ దేశంలో ప్రతి సామాన్యుడికి విమానం ఎక్కి ప్రయాణీంచే వెసులుబాటు కల్పించడం. ఎయిర్ డెక్కన్ విమానయాన సంస్థ వ్యవస్థాపకుడుగా ఆయన ఒక సంచలనం. ఆయనే కెప్టెన్ గోపీనాథన్.

గోపీనాథ్ నవంబర్ 13, 1951 న మాండ్యలోని మెల్కోట్లో జన్మించారు. గోపీనాథ్ తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడు కావడంతో మొదట్లో ఇంట్లో ప్రారంభ విద్యను అభ్యసించిన గోపీనాధన్, 1962 లో ఐదవ తరగతిలో నేరుగా కన్నడ పాఠశాలలో చేరారు. ఆ తరువాత ప్రవేశ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించి బీజాపూర్ లోని సైనిక్ పాఠశాలలో చేరారు. మూడేళ్ల కఠిన శిక్షణ తర్వాత నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి తరువాత ఇండియన్ మిలిటరీ అకాడమీ నుండి పట్టభద్రుడయ్యారు. కోర్సు పూర్తయిన తరువాత ఎనిమిది సంవత్సరాలు భారత సైన్యంలో పనిచేసిన ఆయన ఆ సమయంలోనే 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కూడా పాల్గొన్నారు.

28 సంవత్సరాల వయస్సులో స్వచ్ఛందంగా సైన్యం నుండి పదవీ విరమణ చేసిన ఆయన అనేక వ్యాపారాలు చేసిన పిదప, 1995లో చార్టర్డ్ హెలికాప్టర్ డెక్కన్ ఏవియేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ చాలా మంది రాజకీయ నాయకులకు సేవలు అందించింది. శ్రీలంక, నేపాల్, కాబూల్ అలాగే దక్షిణ భారతదేశాలలో భద్రతా కార్యకలాపాల్లో పాల్గొంది. ఈ సంస్థ భారత్, శ్రీలంకలో అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్స్ చార్టర్ కంపెనీగా ఎదిగింది. ఆ తరువాత 2003లో విమానయాన రంగంలో సంచలనం సృష్టించిన తక్కువ ఖర్చుతో కూడిన ఎయిర్లైన్స్ అయిన ఎయిర్ డెక్కన్ ను ప్రారంభించారు.

గోపీనాథ్ ఆరిజోనా ఫీనిక్స్ విమానాశ్రయంలో ఉన్నప్పుడు తక్కువ ధరకే భారత్ లో విమానప్రయాణం అందుబాటులోకి తేవాలనే ఆలోచన కలిగినట్టు అనేక సందర్భాల్లో వెల్లడించారు. ఫీనిక్స్ విమానాశ్రయం రోజుకు 1,000 విమానాలు, 100,000 మంది ప్రయాణీకులను నిర్వహిస్తుందని తెలుసుకున్న గోపీనాథ్ ఎడారి మధ్యలో ఉన్న ఒక విమానాశ్రయం, ఆ సమయంలో భారతదేశంలోని 40 విమానాశ్రయాల కంటే ఎక్కువ విమానాలు, ప్రయాణీకులను నిర్వహించడం తనని ఆలోచింపజేసిందని దీంతో సైన్యంలో హెలికాప్టర్ పైలట్లుగా విధులు నిర్వహించిన ఇద్దరు పాత స్నేహితులను కలిసి ఎయిర్ డెక్కన్ను ప్రారంభించానని చెప్పుకొచ్చారు.

విమాన రంగంలో ఎయిర్ డెక్కన్ అడుగుపెట్టగానే అప్పటివరకు విమాన ప్రయాణం కేవలం ధనవంతులకే పరిమతం అనే ఆలోచనను చెరిపివేసింది. భారత రైల్వే లో సెకండ్ క్లాస్ టికెట్టు ఖర్చుతో అంతే దూరాన్ని విమానంలో ప్రయాణం చేసేలా విప్లవాత్మకమైన వెసులుబాటు సామాన్యులకి కలిగించారు. మొదట్లో 501 రూపాయలకే విమాన టిక్కెట్ అందించి ఎయిర్ డెక్కన్ సంచలనం సృష్టించింది. ఎయిర్ డెక్కన్ ప్రారంభించిన 2 ఏళ్ళలోనే విమాన ప్రయాణం కొత్త అయిన 2 కోట్ల మందిని విమాన ప్రయాణం చేసేలా చేసింది. ఎయిర్ డెక్కన్ క్రమేపి విస్తరించి భారతదేశంలోని అరవై తొమ్మిది నగరాలను కలుపుతూ తమ విమాన సేవలని మధ్యతరగతి వారికి అందుబాటులోకి తెచ్చింది.

అయితే ఎయిర్ డెక్కన్ తక్కువ ఖర్చుతో ప్రయాణికులకు సేవలు అందించినా, ఇతర విమానయాన సంస్థల నుండి అధిక పోటీ కారణంగా క్రమేపి నష్టాల బాట పట్టింది. దీంతో 2007 లో కింగ్‌ఫిషర్ విమానయాన సంస్థ ఎయిర్ డెక్కన్ కు చెందిన 26 శాతం వాటాను సొంతం చేసుకుంది. క్రమేపి గోపీనాథ్ తన వాటాలను అమ్మడంతో విజయ్ మాల్యా ఎయిర్ డెక్కన్ ను కింగ్ ఫిషర్లో విలీనం చేసారు. దీంతో విమానయాన రంగంలో పెను విప్లవం సృష్టించిన ఎయిర్ డెక్కన్ చరిత్రలో కలిసిపోయింది. తరువాత 2009 లో గోపీనాథ్ కార్కో ఎయిర్ క్రాఫ్ట్ సర్వీస్ సంస్థ డెక్కన్ 360 ను ప్రారంభించారు కానీ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న యునైటెడ్ ఏవియేషన్ సర్వీసెస్, పటేల్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ దావా వేసిన నేపథ్యంలో 2013 లో డెక్కన్ 360 మూసివేశారు. ఆ తరువాత గోపీనాథ్ గుజరాత్‌లో డెక్కన్ సట్‌లెస్ పేరుతో రోజువారీ విమాన సేవలను ప్రారంభించినా ఏడాదికాలంలోనే నిలిపివేశారు.

2009 లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అలాగే 2014 లో, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. గోపీనాథ్ తన జీవన ప్రయాణంలో అనుభవాలను అన్నీ కలిపి సింప్లీ ఫ్లై అనే ఆటో బయోగ్రఫీను పుస్తక రూపంలో ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. స్వర్గీయ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సింప్లీ ఫ్లై పుస్తకాన్ని అన్ని మానేజ్మెంట్ కోర్సులు అభ్యసించే దగ్గర పాఠ్యాశంగా తీసుకురావాలని ఒకానొక సందర్భలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తాజాగా గోపీనాథ్ కథను ఆదర్శంగా తీసుకుని సూర్యా ప్రధాన పాత్రదారుడిగా ఆకాశమే నీ హద్దు రా అనే చిత్రం ‘ఓ.టి.టీ’ ప్లాట్ఫాం లో విడుదల అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.