Idream media
Idream media
2020లో ఏదో జరుగుతుందని 31 రాత్రి కేక్ కట్ చేస్తాం. టపాసులు కాల్చుతాం, మందుపార్టీలు చేసుకుంటాం, డ్యాన్స్‌లు చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అని అరుస్తాం. 2020 రానే వస్తుంది, తర్వాత? మీరనుకున్నట్టు ఏమీ జరగదు.
2020లో మీ పిల్లల స్కూల్ ఫీజులు తగ్గవ్. గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లి ధైర్యంగా తిరిగి రాలేరు. మాల్‌లో అరలీటర్ వాటర్ బాటిల్ రూ.50కే అమ్ముతారు. క్యాబ్ వాడు టైంకు రాడు. సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాలకి ఎవరూ గ్యారెంటీ ఇవ్వరు.
అందరూ ఎవరి ఫోన్లతో వాళ్లే మాట్లాడుకుంటారు తప్ప, ఎదురుగా ఉన్నవాళ్లతో మాట్లాడరు. వీధిలో చిన్న నిరసన చేయలేనివాళ్లంతా ఫేస్‌బుక్‌లో విప్లవ గీతాలు, ఉద్వేగ ఉపన్యాసాలు వల్లిస్తూ ఉంటారు. జలుబు చేసి కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే ముక్కుకి ఆపరేషన్ చేయకుండా వదలరు.
చంద్రబాబు అబద్ధాలు చెప్పడం మానడు. జగన్ పథకాలు ప్రకటించకుండా ఆగడు. పత్రికలు ఎవడి డప్ప వాడు కొడుతుంటాయి. టీవీ9 రజనీకాంత్ గొడవలు పెడుతూనే ఉంటాడు.
రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ని బాగు చేయలేడు. మైనార్టీలను మోడీ మనశ్శాంతిగా ఉంచడు. కర్నాటక, మహారాష్ట్రలలో గవర్నమెంట్ ఉంటుందన్న గ్యారెంటీ లేదు. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని అంటూనే ఉంటాడు. కమల్‌హాసన్ వచ్చినా ఏమీ చేయలేడు.
కూరగాయల ధరలు తగ్గవ్, రైతులకి గిట్టబాటు ధర రాదు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అడ్డా కూలీలు ఎదురు చూస్తూనే ఉంటారు. దమ్ బిర్యానీ తిని , గట్టిగా తేన్పుతూ , పనిలో పనిగా ఒక కవి ఆకలి గీతం రాసి పోస్ట్ పెడితే, ఆయన అభిమానులు ఆకలిగొన్న పులుల్లా లైక్‌లు కొడుతూనే ఉంటారు. అవార్డుల కోసం ఒక రచయిత తోకకి పదును పెడుతూ ఉంటాడు.
నీ కొనుగోలు శక్తి పెరగదు. నాయకులు నిన్ను అమ్మకుండా వదలరు. తెలుగు సినిమాలు నిన్ను ఉతుకుతూనే ఉంటాయి. ఏ ప్రభుత్వంలోనైనా పోలీసులు జనాల్ని ఆరేస్తూ ఉంటారు. నిర్మలా సీతారామన్ ఉల్లిపాయలు తినకపోయినా , ప్రజలు ఏమీ తినకుండా పన్నులేని ఉన్న పళ్లు ఊడగొడుతూ ఉంటుంది.
ఢిల్లీలో వాయుకాలుష్యం తగ్గదు. ఆంధ్రాలో నాయకుల శబ్ద కాలుష్యం ఆగదు. ఏమీ మారదు కానీ, 8 గంటలకి దుకాణాలు బంద్ చేస్తారు. మందు జాగ్రత్త పడు. మూడు పెగ్గులు పడితే జీవితమే ఒక టైం మిషన్. అన్నీ గుర్తుంటాయి. ఏదీ గుర్తుండదు. మరుపు అనేది ప్రజాస్వామ్యపు ప్రాథమిక హక్కు.
చెక్ మీదనో మరో పత్రం మీదనో తేదీ వేసేటప్పుడు మాత్రం 2020 అని పూర్తిగా రాయాలి. 31/01/20 అని రాస్తే దాన్ని 2001 నుంచి 2020 వరకు ఏ సంవత్సరమైనా వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి 2020లో తేదీలో సంవత్సరం మొత్తం వెయ్యాలి!!!