Idream media
Idream media
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు రోజురోజుకూ క్లిష్టతరంగా మారుతున్నాయి. ప్రధానంగా అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ప్రత్యర్థి పార్టీ భారతీయ జనతా పార్టీతో పాటు ఎన్నికల కమిషన్ తో కూడా ఢీ కొడుతోంది. నోటిఫికేషన్ విడుదల నుంచే ఈసీపై టీఎంసీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తోంది. ఏకంగా 8 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించడాన్ని టీఎంసీ తప్పుబట్టింది. ఎన్నికల నోటిఫికేషన్ లు విడుదలైన ఐదు రాష్ట్రాల కంటే బెంగాల్ లోనే ఇన్ని దశలు ఎందుకంటూ ప్రశ్నించింది. దానికి ఈసీ వివరణ ఇచ్చినప్పటికీ టీఎంసీ సంతృప్తి చెందలేదు.
ఇక ప్రచార పర్వం మొదలైనప్పటి నుంచీ తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఈసీ మధ్య కూడా వార్ నడుస్తూనే ఉంది. మమత అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ పలుమార్లు మమతకు నోటీసులు ఇచ్చిన ఈసీ ఇప్పుడు ఏకంగా ఆమె ప్రచారంపై నిషేధం విధించింది. నాలుగో దశ పోలింగ్ రోజు జరిగే ముందు రోజు కూడా మమత చేసిన అభ్యంతకరం వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలంటూ ఈసీ మమతతకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 24 గంటల్లో సమాధానాలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే, సమాధానం ఇచ్చేది లేదని తొలుత భీష్మించుకు కూర్చున మమత అనంతరం బదులు ఇచ్చినప్పటికీ సంతృప్తికరంగా లేదని ఈసీ అభిప్రాయ పడుతోంది.
ఇప్పుడు మరోసారి మమత తీరుపై ఈసీ ఫైర్ అయింది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఎన్నికల ప్రచారంలో మత ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థించడం, కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఎన్నికల సంఘం స్పందించింది. 24 గంటల పాటు ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిషేధం విధించింది. ఏప్రిల్ 12 రాత్రి 8 గంటల నుంచి ఏప్రిల్ 13 రాత్రి 8 గంటల వరకు ఈ నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. షోకాజ్ నోటీసుకు ఇచ్చిన సమాధానంలో కీలక అంశాలను ఆమె కావాలనే దాటవేశారని వ్యాఖ్యానించింది.
Also Read : బెంగాల్ దంగల్ : పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం ?
ఈసీ నిర్ణయంపై మమత తీవ్రంగా స్పందించారు. ఈ నిషేధం రాజ్యాంగవిరుద్ధమని, దీనిపై కోల్‌కతాలో మమత ధర్నాకు దిగారు. ఈసీ నిష్పక్షపాక్షితపై తమకు మొదట్నుంచీ అనుమానాలున్నాయని టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. మమతపై విధించిన తాజా నిషేధంతో ఈసీ వేసుకున్న ముసుగు పూర్తిగా తొలగిపోయిందని, ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మోదీ, షాల ఆదేశాల మేరకు పనిచేస్తోందని స్పష్టమవుతోందని పేర్కొన్నారు.
బీజేపీ పెద్దలు చెబుతున్నట్లుగా ఈసీ నడుస్తోందంటూ మొదటి నుంచీ ఆరోపణలు చేస్తున్న టీఎంసీ కొద్ది రోజుల క్రితం ఓ వీడియో క్లిప్ ను కూడా బయటపెట్టింది. దాంట్లో ‘‘మనకు పశ్చిమ బెంగాల్‌లో చాలా పోలింగ్ బూత్‌లలో పార్టీ ఏజెంట్లు లేరు. ఇలా అయితే కష్టమే. ఎన్నికల్లో గెలవలేము. అందుకే.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ఓటర్లకు కూడా పోలింగ్ బూత్‌లో ఏజెంట్లుగా అవకాశమివ్వాలి. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు తప్పనిసరిగా విజ్ఞప్తి చేయాలి’’ అని పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీకి చెందిన శిశిర్ భొజారియాతో అంటున్నట్లుగా ఉంది. ఆ వ్యాఖ్యలు నిజమే అన్నట్లుగా బెంగాల్ ఓటర్లు రాష్ట్రంలోని ఏ పోలింగ్ బూత్‌లోనైనా ఏజెంట్లుగా ఉండొచ్చంటూ ఈసీ ఆదేశాలు జారీ చేయడాన్ని టీఎంసీ వెలుగులోకి తెచ్చింది.
అప్పటి నుంచీ బీజేపీతో పాటు ఈసీపైనా మమత ఆరోపణల దూకుడు పెంచారు. మమత దూకుడు కు కట్టడి వేయడానికే అన్నట్లుగా ఈసీ తాజాగా ఆమె ప్రచారంపై నిషేధం విధించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా 4 దశల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో మున్ముందు ఎటువంటి వివాదాలు రాజుకుంటాయో వేచి చూడాలి.
Also Read : నాలుగో దశలో హింస.. బెంగాల్లో రాజకీయ రగడ..