iDreamPost
iDreamPost
బొగ్గు కొరత కారణంగా దేశం మొత్తాన్ని విద్యుత్ సంక్షోభం కమ్మేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం అంగీకరించింది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా పెంచడానికి చర్యలు చేపట్టింది. కొరత ఉన్న రాష్ట్రాలు కేంద్ర కోటా పరిధిలో ఉన్న ఎవరికీ కేటాయించని విద్యుత్ వాడుకోవాలని సూచించింది. మిగులు ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలు దాన్ని బయట మార్కెట్లో అమ్మకుండా కొరత ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు సరఫరా చేయాలని ఆదేశించింది.
కేంద్రం చర్యలు, ఆదేశాలను బట్టే ఇది దేశవ్యాప్త సమస్య అని.. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉత్పన్నమైనది కాదని ఎవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది. కానీ రాష్ట్ర ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేతకు, ఆయన పార్టీ నేతల బుర్రలకు మాత్రం అవేవీ ఎక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు బృందం తాత్కాలికంగా తలెత్తిన బొగ్గు సంక్షోభం, విద్యుత్ కొరతను కూడా జగన్ ప్రభుత్వానికి అంటగట్టి దేశవ్యాప్త సమస్యకు వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కారణమన్నట్లుగా మాట్లాడుతుండటం వారినే నవ్వులపాలు చేస్తోంది. పనిలో పనిగా విద్యుత్ సంస్కరణలు, విద్యుత్ కొనుగోలు రేట్ల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని గురివింద గింజ సామెతను గుర్తు చేస్తున్నాయి.
Also Read : అప్పుడు ఆక్సిజన్, ఇప్పుడు బొగ్గు కొరత, ఎందుకిలా జరుగుతోంది..
కేంద్రం తప్పిదాలకు రాష్ట్రాన్ని తప్పుపడతారా..
బొగ్గు కొరత ముంచుకొస్తోందని.. అది విద్యుత్ సంక్షోభానికి దారి తీస్తుందని గత పది రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తదితరులు నేరుగా ప్రధానమంత్రి మోదీకి లేఖల ద్వారా పరిస్థితి తెలియజేశారు. బొగ్గు సరఫరా పెంచాలని, కేంద్ర కోటాలో తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. కానీ మొదట బొగ్గు కొరత లేదని బుకాయించిన కేంద్రం తర్వాత పరిస్థితి తీవ్రత గుర్తించి బొగ్గు సరఫరా పెంచడానికి చర్యలు చేపట్టింది. ఏపీలోని థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు నిండుకుంటున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.
అయినా టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసి కమీషన్లు దండుకునేందుకు విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అసంబద్ధమైన ఆరోపణలు చేశారు. అదే నిజమైతే కేంద్ర పరిధిలోని ఎన్టీపీసీ ప్లాంట్లు, పలు రాష్ట్రాల విద్యుత్ ప్లాంట్లలో కూడా ఉత్పత్తి నిలిచిపోవడానికి కేంద్రం, ఆయా రాష్ట్రాలు కృత్రిమ కొరత సృష్టించడానికే చేస్తున్న కుట్రలే కారణమని చంద్రబాబు చెప్పగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Also Read : ప్రధానికి జగన్ లేఖ .. సమస్య రాకుండా చూస్తారా..?
సంస్కరణల పేరుతో భ్రష్టుపట్టించింది ఎవరు?
సంస్కరణల పేరుతో విద్యుత్ రంగాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని.. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టడమంటే రైతుల మెడలో ఉరితాడు వేయడమేనని చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం.. ఎంత వినియోగం జరుగుతోందో తెలుసుకోవడంలో తప్పులేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అదే 2004కు ముందు చంద్రబాబు హయాంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును 7 గంటలకు పరిమితం చేశారు. ఎవరెంత వాడుకున్నారో తెలుసుకునేందుకు సబ్ స్టేషన్లలో ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేయించి ఏడు గంటల కంటే ఎక్కువ వాడుకున్న రైతులను ఎగవేతదారులుగా ముద్రవేసి కేసులు పెట్టి, కనెక్షన్లు తొలగించిన ఘనత నాటి చంద్రబాబు ప్రభుత్వానిదే. ఇంకా చెప్పాలంటే విద్యుత్ సంస్కరణల అమలుకు ఆధ్యుడు చంద్రబాబేనని చెప్పాలి. తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి.. విద్యుత్ రంగ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విద్యుత్ సంస్థను ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలుగా విడగొట్టారు.
ఎడాపెడా చార్జీలు పెంచి.. నిరసనలు తెలిపిన వారిపై కాల్పులకు తెగబడిన ఘటనలు బాబు ప్రభుత్వ ఘనకార్యాలే. ఇక బాబు పాలనలో నాడు కరెంటు కోతలు నిత్య అనుభవాలు పగలు రాత్రి తేడాలేకుండా గంటల తరబడి కోతలు అమలు చేసేవారు. అవి చాలవన్నట్లు లోడ్ రిలీఫ్ పేరుతో మరికొన్ని గంటలు నిలిపేసేవారు. సాయంత్రం అయితే చాలు పల్లెలు, చిన్న పట్టణాలు చీకట్లలో మగ్గిపోయేవి. విద్యుత్తుపై ఆధారపడిన అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ బాధలు పడలేకే 2004 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు. తన గత సంఘటనలను విస్మరించిన బాబు తాత్కాలికంగా తలెత్తిన సమస్యలను పట్టుకొని నానారకాల ఆరోపణలు చేయడాన్ని ప్రజలు హర్షించడం లేదు.
Also Read : బొగ్గు కొరతపై జగన్ సూచనలను కేంద్రం పట్టించుకుందా?