Idream media
Idream media
రాజ్యాంగబద్ధంగానే ఆర్డినెన్స్ జారీ
నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతామని అధికార వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయాడు. ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియయాకం జరిగింది. దీనిపై టిడిపి, బిజెపి నేతలు హైకోర్టుకు వెళ్ళారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆర్డినెన్స్ జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఒక్కో సమయంలో న్యాయం జరగకపోవచ్చు. అలాంటప్పుడు పై కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. దానిపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నా”మని తెలిపారు.
ఎన్నికల్లో మద్యం, డబ్బు అరికట్టాలని చట్టం తీసుకువస్తే దానిపై చంద్రబాబు పంపిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం పెట్టారు.. మద్యం, డబ్బు పంపిణీని వ్యతిరేకిస్తూ నిమ్మగడ్డ లేఖ రాయడం సమంజసమా అని అంబటి ప్రశ్నించారు. ఇటువంటి లేఖల వల్ల ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుందని వ్యాఖ్యానించారు.
పక్షపాతంగా వ్యవహరిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను తీసివేస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు. కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే గౌరవిస్తామని, ఇచ్చిన తీర్పును పరిశీలించి అభ్యంతరాలు ఉంటే పై కోర్టుకు అప్పీలు చేస్తామన్నారు.
అంతేకానీ కోర్టు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు సిఎంగా ఉన్న సమయంలో చాలాసార్లు కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ అధికారాలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసన్నారు. ప్రభుత్వానికి పరిమిత అధికారాలు ఎలా ఉంటాయో మిగతా వ్యవస్థలకు పరిమితికి లోబడి అధికారాలు ఉంటాయని వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి లోబడే అన్ని వ్యవస్థలు పని చేయాలని అంబటి పేర్కొన్నారు.