Idream media
Idream media
సినిమాల్లో, కథల్లో మనది కాని పాత్రల్ని చూసి సంతోషిస్తాం. మన పాత్రల్ని గుర్తు పట్టలేం. ఎందుకంటే ఏ మనిషీ తనని తాను విలన్ అనుకోడు. వాడి ప్రపంచంలో వాడే హీరో. మంచి వాళ్లని వాడు శత్రువులనుకుంటూ వుంటాడు. మంచితనం కూడా సంపూర్ణం కాదు. పున్నమి చంద్రుడు క్రమేణా అమావాస్య చంద్రుడైనట్టు మనుషులు కూడా అంతే. ఇదో చక్రం. రంగుల రాట్నం పై అంచున మనుషులు ఎంతో కాలం ఉండలేరు. ప్రపంచం కంటే తాను ఎత్తులో ఉన్నానని కాసేపు అనిపిస్తుంది. తర్వాత భూమి పైకి రావాల్సిందే. పాతాళంలో ఉన్న మనిషి కూడా అంతే. భూమి పైకి వస్తే తప్ప నిశ్చింతగా వుండలేడు. కాళ్ల కింద భూమి మాత్రమే సంతృప్తి.
ఈ భూమిపై మనిషికున్న ఆకర్షణ అంతాఇంతా కాదు. దీని కోసమే యుద్ధాలు, దండయాత్రలు. భూమి కూడా నిరంతరం వెంటాడుతూ వేటాడుతూ వుంటుంది. ఆకాశ భవంతుల్లో నివసిస్తూ ఉన్నా దుమ్ము రూపంలో వచ్చేది, మట్టి సూక్ష్మ చిత్రం. ఆ రేణువుల్లో మన పూర్వీకుల ఆత్మలుంటాయి. అవి మనల్ని పిలుస్తూ వుంటాయి. ఎంత దూరంలో ఉన్నా గాలిలో అలలుగా తేలుతూ పిలుపు వినిపిస్తూనే వుంటుంది.
గాలిని సంగీతంగా మార్చడానికి ముందు వేణువు ఎగశ్వాస పీల్చుకుంటుంది. అడవిలో వెదురుగా పుట్టి ఎన్నో గాయాలను అనుభవించి గాలికి ప్రాణం పోస్తుంది. ఇనుము ఎన్నో సుత్తి దెబ్బల్ని తింటేనే ఆయుధంగా మారుతుంది. మనుషులు కూడా ఆయుధాలుగా మారుతారు. అయితే కొలిమిలో కాలాలి.
ఈ ప్రపంచం ఒక అడవి. ఇందులో నువ్వు వేటాడాలి లేదా వేటకు గురవ్వాలి. అడవిలో జంతువులకు ఒకే రూపం. పులి పులి లాగే, జింక జింకలాగే వుంటుంది. పులి కాసేపు జింకలా, తోడేలు కాసేపు కుందేలులా వుండదు. కానీ మనిషి అలా కాదు. అతడు అనేక జంతువుల సమాహారం. జింకలా వుంటూనే పులిలా లంఘిస్తాడు. కుందేలు కాస్త తోడేలుగా మారుతుంది. వినయంగానే గుండెల్లో పొడిచే వాడు మనిషి. వాడికున్న షేడ్స్ చీకటి కోణాలని ఎప్పటికీ కనిపెట్టలేం.
ప్రతిభావంతులు ఈ లోకానికి అంత సులభంగా అర్థంకారు. వాళ్లు చవటలని, చేతకాని వాళ్లని లోకం విచిత్రంగా చూస్తుంది. కంపుని పీల్చే ముక్కులకి పన్నీరు దుర్వాసనగా తోస్తుంది.
ప్రతిదాన్ని కొత్తగా అర్థం చేసుకోవాలి. చాలా ఏళ్లుగా చూస్తున్నది కూడా మన దృష్టి విశాలమైతే కొత్తగా అర్థమవుతుంది. నిజానికి మన చుట్టూ ఏం జరుగుతూ వుందో మనకు తెలియదు. అసలు మన శరీరంలో ఏం జరుగుతూ వుందో కూడా మనకు తెలియదు. శరీరమే ఒక రసాయన శాల. జీవితం ఒక రసవిద్య. కొత్తకొత్త సంతోషాలను, అనుభూతులను బంగారంగా మార్చి ఇస్తూ వుంటుంది. అదే సమయంలో విధ్వంసక శక్తి కూడా. ఎన్నింటినో బూడిదగా మారుస్తూ వుంటుంది. ఒక కొత్త మనిషిని భూమ్మీదకి తెచ్చి ఇచ్చే పంచభూతాలు , ఒక పాత మనిషిని తమలోకి తీసుకెళ్తాయి. ఏదీ స్థిరంగా వుండదు. ధ్వంసమైన ప్రతిదీ మళ్లీ పుడుతుంది. ఇదే సృష్టి రహస్యం.
ప్రతిదీ బహుముఖం, వైవిధ్యం. మనమెంతో ఇష్టపడే వాన కూడా ఒక్కోసారి పసిపాపలా ఇంకోసారి వెయ్యి చేతుల బ్రహ్మరాక్షసిలా వుంటుంది. మేఘాలన్నీ కాఫీ డికాక్షన్ రంగులో వున్నప్పుడు వాటిల్లో నుంచి దారి వెతుక్కుంటూ ఒక మెరుపు ప్రయాణిస్తుంది. గంభీరంగా ఏదో రాగం తీయడానికి ఒక ఉరుము ప్రయత్నిస్తుంది. వాన వాసనని కడుపులో మోస్తూ గాలి బద్ధకంగా బరువుగా కనపడుతుంది.
ఆకాశంలో నుంచి ఊగుతూ తూగుతూ వచ్చే చినుకు, సైన్యంలా విరుచుకుపడే చినుకు ఒకటి కాదు. తడిసీ తడవన్నట్టు ఉండే చినుకు, ముద్దగా తడిపేసే చినుకు వేర్వేరు, వాన వస్తూ పోతూ వుంటే ఆనందం. జీవితమే ఓ చిత్తడి నేలలా మారితే విషాదం.