అశోక్ మాటే ఫైనల్ !

“నేను వేరు.. అశోక్ గజపతిగారు వేరు కాదు.. ఇద్దరం ఒకటే.. ఆయన్ను ధిక్కరిస్తే నన్ను కాదన్నట్టే. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతి గారి మాటే వేదవాక్కు. ఆయన చెప్పిందే ఫైనల్. దానికి బద్ధులై ఉండనివాళ్ళ మీద చర్యలు తప్పవు. మీరు నిశ్చింతగా ఉందండి. ఇందులో రెండోమాటకు తావులేదు. అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇన్నాళ్లుగా అశోక్ బంగళాలో టిడిపి జిల్లా కార్యాలయం ఉండేది. మంత్రులు, ఎంపిలు సైతం అక్కడికే వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అయితే గత 2019 ఎన్నికల్లో టికెట్ దక్కని అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మీసాల గీత విజయనగరం లొనే ఇంకో ఆఫీస్ తెరిచారు. కార్యకర్తలు అక్కడికే రావాలని పిలుపునివ్వడంతో అశోక్ ఆధిపత్యానికి చెక్ పడినట్లు అయింది. మారాజు బిడ్డ, మాజీ కేంద్రమంత్రి అయిన అశోక్ ను వ్యతిరేకించి ఆఫీసు పెట్టడం అంటే కొరివితో తలగోక్కున్నట్టే.. అలాగని ఆవిడను ఊరికే వదిలేస్తే రేపు ఇంకోడు వచ్చి ఇంకోచోట కార్యక్రమం ఏర్పాటు చేస్తాడు. ఇది ఎటు దరితీస్తుందో తెలీదు. అందుకే విజయనగరం నుంచి ఓ రెండొందలమంది కార్యకర్తలు, అశోక్ మద్దతుదారులు అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసి విషయం చెప్పారు. ఆయన అంతా విని.. అశోక్ మాటే ఫైనల్..ఇందులో మరి ఇంకో మాటలేదు. ఎవర్నీ ఎలా దారికి తేవాలో చూద్దాం అని పంపించేశారు.

అచ్చెన్న చెప్పినా వినని గీత

అశోక్ కూతురు అదితి గణపతికి టికెట్ ఇప్పించుకుని తనకు అన్యాయం చేశారని బాధ పడిన గీత ఎన్నికలు ముగిసిన ఏడాది తరువాత మళ్ళీ జనంలోకి వచ్చారు. టిడిపిలో ఉంటే అదితిని కాదని తనకు టికెట్ రాదని ఆమెకు అర్థం అయింది. అందుకే ఏమి జరుగుతుందో తేల్చుకునే లక్ష్యంతోనే ధిక్కార స్వరం వినిపించింది. ఈ విషయం తెలుసుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా లైన్లోకి వచ్చి గీతను ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఆమెకు ఫోన్ చేసి అశోక్ కు ఎదురెళ్ళవద్దని, ఆమె భవిష్యత్తును చంద్రబాబు చూసుకుంటారని నచ్చజెప్పేందుకు అచ్చెన్న ప్రయత్నించారు కానీ ఆమె వినలేదు. తనదారి తనదేనని తేల్చిచెప్పారు. దీంతో ఇక చేసేదేం లేక కార్యకర్తలు చంద్రబాబు ను ఆశ్రయించారు. జిల్లా టీడీపీ చరిత్రలో అశోక్ కు వ్యతిరేకంగా ఇలా వేరే గా పార్టీ ఆఫీస్ పెట్టడం అంటే రానున్న రోజుల్లో ఇలాంటి సవాళ్ళయినా ఎదుర్కొనేందుకు సిద్ధం అని గీత స్పష్టంగా చెప్పినట్లు అయింది. గతంలో గీత కాంగ్రెస్ పార్టీ తరఫున విజయనగరం మున్సిపల్ చైర్మన్ గా పని చేసారు.

Show comments