iDreamPost
android-app
ios-app

ఛలో.. వైజాగ్!

ఛలో.. వైజాగ్!

మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న వెలువ‌డిన నాటి నుంచీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో నూత‌న అధ్యాయం మొద‌లైంది. ముఖ్యంగా కార్య నిర్వాహ‌క రాజ‌ధానిగా విశాఖ‌ప‌ట్ట‌ణాన్ని ప్ర‌క‌టించ‌డంతో ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏళ్ల త‌ర‌బ‌డి వెనుక‌బాటుకు గురైన ఆ ప్రాంత వాసుల‌కు ఓ ర‌క‌మైన భ‌రోసా క‌లుగుతోంది. త‌మ ప‌రిస్థితి ఎలాగున్నా భ‌విష్యత్ త‌రాలు ఊహించ‌ని అభివృద్ధిని చూస్తార‌న్న న‌మ్మ‌కం ప్ర‌స్తుత ప‌రిణామాల‌తో వారిలో పెరుగుతోంది. ఆ ప్రాంత అభివృద్ధికి ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో వాణిజ్య ప‌ర‌మైన అంశాల్లో కూడా విశాఖ వేగం పుంజుకుంది.

అంద‌రి చూపూ అటు వైపే..

ఒక‌ప్పుడు వ‌ల‌స‌లు అంటే అంద‌రూ హైద‌రాబాద్ వైపు చూసేవారు. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం అమ‌రావ‌తి ని ఏపీ రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ హైద‌రాబాద్ స్థాయిలో ఆ ప్రాంతంపై ప్ర‌జ‌లు ఆస‌క్తి చూప‌లేదు. ఐదేళ్ల కాలంలో తాత్కాలిక నిర్మాణాలు త‌ప్పా.. రాజ‌ధాని అన్నంత‌గా ప్రాచుర్యం పొంద‌లేదు. అందుకే అక్క‌డ‌కు ప్ర‌జ‌లు వ‌ల‌స‌లు వెళ్ల‌డం పెద్ద‌గా క‌నిపించ లేదు. కానీ ఇప్పుడు విశాఖకు మాత్రం ఊహించ‌ని ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. విద్య‌, వైద్య‌, పారిశ్రామిక త‌దిత‌ర రంగాల్లో వేగ‌వంత‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అతిపెద్ద న‌గ‌రం కావ‌డం.. దేశంలోనే మెట్రో పాలిట‌న్ సిటీగా గుర్తింపు పొంద‌డంతో ప్ర‌ముఖ కంపెనీల‌న్నీ విశాఖ‌లో త‌మ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రించే ప‌నిలో ఉన్నాయి. ఏ ప్రాంతం అనువుగా ఉంటుంది..? భూములు, నీరు, ఇత‌ర వ‌న‌రులు ఎక్క‌డ అధికంగా ల‌భ్య‌మ‌వుతున్నాయి..? త‌దిత‌ర అంశాల‌ను ప‌రిశీలించే ప‌నిలో ప‌డ్డారు.

అంచ‌నా 30 శాతం..

వాణిజ్య ప‌రంగా విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్ర‌మంలో ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు పెర‌గ‌నున్నాయి. ఒక‌ప్పుడు ఉత్త‌రాంధ్ర ప్రాంతానికి చెందిన ప్ర‌జ‌లు ముఖ్యంగా శ్రీ‌కాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల‌కు చెందిన వారు హైద‌రాబాద్ కు ఎక్కువ‌గా వ‌ల‌స‌లు పోయేవారు. హైద‌రాబాద్ స్థాయిలో విశాఖ కూడా ప్రాచుర్యం పొందుతుండ‌డంతో ఇక్క‌డే ఉండేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇత‌ర ప్రాంతాల వారు విశాఖ‌కు వ‌ల‌స వ‌స్తుండ‌డం పెరుగుతోంది. రాబోయే అతి కొద్ది కాలంలోనే విశాఖ జ‌నాభా 30 శాతం పెరుగుతుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేస్తోంది. అందుక‌నుగుణంగా అన్ని శాఖ‌ల‌నూ విస్త‌రించే యోచ‌న‌లో ఉంది. ఇప్ప‌టికే ద‌స‌రా నాటికి అక్క‌డ‌కు వెళ్లేందుకు చాలా మంది ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నారు. న్యాయ‌ప‌ర‌మైన అడ్డంకులు కూడా తొలిగిపోతే విశాఖ దేశ వ్యాప్తంగా ప్ర‌త్యేక గుర్తింపు పొందేందుకు ఎంతో కాలం ప‌ట్ట‌ద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదేమో.