iDreamPost
android-app
ios-app

లాభాల బాటలో వైజాగ్ స్టీల్ ప్లాంట్.. కేంద్రం నిర్ణయంలో మార్పు వస్తుందా..?

లాభాల బాటలో వైజాగ్ స్టీల్ ప్లాంట్.. కేంద్రం నిర్ణయంలో మార్పు వస్తుందా..?

విశాఖ స్టీల్ ప్లాంట్ కు లాభాలపంట పండింది. నష్టాల సాకుతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయించింది. దీనిపైన పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. సంస్థ నష్టాల్లో ఉండటంతోనే ప్రైవేటీకరణకు నిర్ణయించామని చెబుతూ వచ్చారు. అయితే, నష్టాలను అధిగమిస్తూ స్టీల్ ప్లాంట్ లాభాలు సాధించింది. అయిదేళ్ల కాలంలో రెండేళ్లు లాభాలు సాధించి సత్తా చాటింది. దీంతో..ఇప్పుడు కేంద్రం పైన ప్రైవేటీకరణ నిర్ణయం ఉప సంహరించుకొనేలా ఒత్తిడి చేయటానికి రాజకీయ పార్టీలకు మరో అవకాశం లభించినట్లయింది.

కేంద్ర ఉక్కు శాఖ విడుదల చేసిన 2021-22 వార్షిక నివేదిక ప్రకారం గత ఏడాది ఏప్రిల్‌- డిసెంబర్‌ మధ్యకాలంలో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎన్‌పీఎల్‌)కు పన్నుకు ముందు రూ.946 కోట్లు, పన్ను తర్వాత రూ.790 కోట్లకు పైగా నికరలాభం వచ్చింది. గత సంవత్సరం వచ్చిన రూ.1,839 కోట్ల నష్టాలను అధిగమించి ఈసారి లాభాలబాట పట్టింది.

గత సంవత్సరంతో పోల్చి చూస్తే ముడి ఉక్కు ఉత్పత్తి లో 47 శాతం.. ఫినిష్డ్‌ స్టీల్‌ ఉత్పత్తిలో 75% వృద్ధి సాధించినట్లుగా లెక్కల్లో స్పష్టమైంది. సంస్థ ఉత్పత్తితో పాటుగా..అమ్మకాలు..అదే సమయంలో కంట్రిబ్యూషన్ మార్జిన్లలోనూ మంచి ఫలితాలు కనిపించాయి. తాజా లెక్కల మేరకు డిసెంబర్ చివరి నాటికే గత ఏడాది కంటే 69 శాతం వృద్ధిని నమోదు చేస్తూ.. రూ.19,401 కోట్ల అమ్మకాల టర్నోవర్‌తో నిలిచింది.

విక్రయాల అంశంలో 21 శాతం వృద్ధిని సాధించింది. 37.33 లక్షల టన్నుల విక్రయం జరిగినట్లు లెక్కల్లో స్పష్టం చేశారు. ఎగుమతుల విషయంలో 10 లక్షల టన్నుల ఉక్కు ఎగుమతి ద్వారా రూ 4,572 కోట్ల మేర ఆదాయాన్ని విశాఖ ప్లాంట్ ఆర్జించింది. గత ఆర్దిక సంవత్సరంతో పోల్చి చూస్తే.. ఇది 45 శాతం అధికంగా చెబుతున్నారు.

ఇదే సమయంలో నికర ఆస్తులు విలువ సైతం పెరిగింది. 2021 మార్చి 31 నాటికి నికర ఆస్తుల విలువ రూ 2,464 కోట్లు కాగా.. డిసెంబర్ కు అది రూ 3.240 కోట్లకు చేరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.595 కోట్ల మూలధన వ్యయం చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 2022 జనవరి 31 నాటికి రూ.575 కోట్లు ఖర్చు పెట్టింది.

విశాఖ స్టీల్‌ 2021-22లో డిసెంబర్‌ వరకు కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ భీమా కంపెనీలకు రూ.2,170 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.331 కోట్ల ఆదాయాన్ని చేకూర్చింది. వీటితో పాటుగా భారతీయ రైల్వే అవసరాలు తీర్చడానికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని లాల్‌గంజ్‌లో ఫోర్జ్‌డ్‌ వీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇది టెస్టింగ్‌ స్థాయిలో ఉంది. పూర్తి స్థాయి కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఈ కంపెనీ ఆథరైజ్డ్‌ షేర్‌ క్యాపిటల్‌ రూ.8 వేల కోట్లు. సబ్‌స్క్రైబ్డ్‌, పెయిడ్‌ అప్‌ షేర్‌ క్యాపిటల్‌ డిసెంబర్‌ 31 నాటికి రూ.4,889 కోట్లుగా వెల్లడించారు.

ఇలా .. పలు కేటగిరీల్లో లాభాల బాట పట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన ఇప్పటికైనా కేంద్రం పునరాలోచన చేస్తుందా లేదా అనేది ఆసక్తికర అంశంగా మారుతోంది. ఇప్పటివరకు నష్టాలే కారణంగా చెబుతున్న ఈ సమయంలో..రెండేళ్ల లాభాలు, ఉద్యమం చేస్తున్న కార్మికులకు..అండగా నిలుస్తున్న సంఘాలకు తమ వాయిస్ మరింత బలంగా వినిపించేందుకు అస్త్రంగా మారుతోంది. దీంతో..విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం ఏం చేయబోతుందనేది ఆసక్తి నెలకొంది.