iDreamPost
iDreamPost
ఇటీవలి కాలంలో ఆర్ఆర్ఆర్ పుణ్యమాని ఇతర హీరోలు కూడా మల్టీ స్టారర్ల గురించి సీరియస్ గా ఆలోచించడం మొదలుపెట్టారు. అభిమానుల మధ్య ఉన్న అంచనాలు, తమ మధ్య ఈగోలు వెరసి సౌత్ లో ఇద్దరు లేదా ముగ్గురు ఒకే స్థాయి స్టార్లు కలిసి నటించడం ఎప్పుడో కనుమరుగైపోయింది. వెంకటేష్ లాంటి సీనియర్లు తప్ప ఇంకెవరు ఆ దిశగా ఆలోచించడం లేదు. తాజాగా విశాల్ ఓ మల్టీ స్టారర్ కు ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్ గా నటించిన ఆర్య తమిళ్ లో మంచి మార్కెట్ ఉన్న హీరో. ఇతని కాంబినేషన్ లో మూవీ ప్లానింగ్ జరుగుతున్నట్టు చెన్నై టాక్.
దర్శకుడిగా ఆనంద్ శంకర్ వ్యవహరించబోతున్నట్టు తెలిసింది. బై లింగ్వల్ గా ఒకేసారి రెండు భాషల్లో రూపొందే ఈ సినిమాను అధికారికంగా త్వరలో ప్రకటించబోతున్నారు. అయితే ఆనంద్ శంకర్ ట్రాక్ రికార్డు చూస్తే దీన్ని ఎంతవరకు డీల్ చేయగలడు అనే అనుమానం రావడం సహజం. ఇతని ఫస్ట్ మూవీ అరిమ నంబి. తెలుగులో మంచు విష్ణు హీరోగా డైనమైట్ పేరుతో దేవ కట్ట రీమేక్ చేస్తే డిజాస్టర్ కొట్టింది. రెండో సినిమా విక్రమ్ ఇంకొక్కొడు. అరవంలో పర్వాలేదు అనిపించుకున్నా తెలుగులో మాత్రం అంతంత మాత్రంగానే ఆడింది. కాకపోతే స్టైలిష్ మేకింగ్ కి ప్రశంశలు దక్కాయి. ఇక మూడోది విజయ్ దేవరకొండతో తీసిన నోటా. దీని ఫలితం అందరికీ తెలిసిందే. ఇతర రాష్ట్రాల్లో గట్టి జెండా పాతాలనుకున్న రౌడీ బాయ్ ఆశలను ర్తిగా నీరు గార్చేసింది.
ఇప్పుడీ ఆనంద్ శంకరే విశాల్ ప్రాజెక్ట్ కు సారధ్యం వహించబోతున్నాడు. అఫీషియల్ గా న్యూస్ రాలేదు కానీ చర్చలు ముగిసి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసుకున్నారట. అభిమన్యుడుతో మార్కెట్ పుంజుకున్నాక విశాల్ మళ్ళీ ఇక్కడి మార్కెట్ వైపు కన్నేస్తున్నాడు. అతని తాజా చిత్రం చక్ర రిలీజ్ కు రెడీగా ఉంది. థియేటర్లలో రాకపోవచ్చని ఓటిటి డీల్ ఆల్మోస్ట్ ఒక కొలిక్కి వస్తోందని ఇప్పటికే చెన్నైలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే మరో పెద్ద హీరో మూవీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లో చూసుకోవచ్చు. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన చక్ర మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. ఏంఎస్ ఆనందన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ చక్ర రూపొందించారు. ప్రైమ్ లేదా జీ 5లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థియేటర్లు ఎప్పుడు తెరుస్తారో తెలియని అనిష్చితిలో ఇదే మంచి నిర్ణయమని చెప్పొచ్చు