తమిళ్ హీరో విశాల్ తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు తెలుగు, తమిళ భాషల్లోనే కాదు దక్షిణ భారతం మొత్తం చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఆయన తీసుకున్న ఒక నిర్ణయమే. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా శుక్రవారం నాడు మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ మరణంతో కన్నడ ప్రజలే కాక యావత్ దక్షిణ భారత ప్రజలందరూ కూడా చాలా బాధ పడ్డారు. అసలు పునీత్ రాజ్ కుమార్ ఎవరో తెలియని వాళ్లు కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు,ఆయన మంచి వ్యక్తిత్వం గురించి విని చాలా బాధ పడ్డారు. అలాంటిది ఆయనతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే అందరూ బాధపడి ఊరుకుంటే తెలుగువాడయి ఉండి తమిళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ మాత్రం ఎవరూ ఊహించని పని చేసి షాకిచ్చారు.
షాకిచ్చారు అనడం కంటే మేము గొప్ప, మా రేంజ్ వేరు అని ఫీలయ్యే చాలా మంది సినీ హీరోలు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పని చేశాడు. తనకు స్నేహితుడైన పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన చదివిస్తున్న 1800 మంది పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్టు విశాల్ అనూహ్య ప్రకటన చేశారు. ఆదివారం ఆయన నటించిన ఎనిమి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా విశాల్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే ఆయన ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారో లేదో తెలియదు కానీ 1800 మందిని చదివించడం అంటే మాటలు కాదు. పునీత్ ముందు నుంచి ఫిక్స్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన మేనేజ్ చేసుకునేవాడు, కానీ అనూహ్యంగా ఇలా 1800 మంది బాధ్యత తీసుకోవడం మామూలు విషయం కాదు. నేటి రోజుల్లో ఎంత తక్కువ లెక్క వేసుకున్నా ఒక్కో విద్యార్థికి 50 వేల నుంచి లక్ష దాకా ఖర్చు అవుతుంది.
ఎంత తక్కువ లెక్కవేసుకున్నా పది కోట్ల పై మాటే, అంటే ఒకరకంగా విశాల్ కు అది ఒక సినిమా రెమ్యునరేషన్. అయితే పునీత్ కుటుంబ సభ్యులు మేమే ఆ కార్యక్రమం చేపడతామని ముందుకు రావచ్చు, అది వేరే విషయం. కానీ ఇలా డేరింగ్ గా తన సాయాన్ని ప్రకటించడం మాత్రం గొప్ప విషయం. విశాల్ ఈ ఒక్క విషయంలోనే కాదు చాలా విషయాల్లో తన మంచితనంతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతానికి విశాల్ నటించిన సినిమాలకు సంబంధించిన ప్రతి టికెట్ ధర నుంచి ఒక రూపాయి రైతులకు చేరేలా చేస్తున్నారు. అంతే కాదు తనకు సంబంధించిన ఫంక్షన్స్ లో బొకేలను వాడొద్దని వాటికీ ఉపయోగించే డబ్బు ఆడపిల్లల చదువుకు ఉపయోగించమని, ఆ డబ్బు తనకు అందచేస్తే తానే వారికి చేరేలా చూస్తానని అంటూ ఉంటారు విశాల్. గతంలో తమిళనాడులో వరదలు సంభవించినప్పుడు విశాల్ చేపట్టిన సేవా కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విశాల్ తీసుకున్న నిర్ణయం ఆయనను మరోసారి ప్రశంసలలో ముంచెత్తేలా చేస్తోంది.