iDreamPost
android-app
ios-app

ఆ బంగ్లా బౌలర్‌ను ఎదుర్కొవడం కష్టం.. కానీ: విరాట్‌ కోహ్లీ

  • Published Oct 19, 2023 | 11:08 AM Updated Updated Oct 19, 2023 | 11:08 AM
  • Published Oct 19, 2023 | 11:08 AMUpdated Oct 19, 2023 | 11:08 AM
ఆ బంగ్లా బౌలర్‌ను ఎదుర్కొవడం కష్టం.. కానీ: విరాట్‌ కోహ్లీ

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో మరో ఆసక్తికరమైన పోరుకు సర్వం సిద్ధమైంది. పూణె వేదికగా భారత్‌-బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. అయితే.. టీమిండియాతో పోల్చుకుంటే.. బంగ్లాదేశ్‌ టీమ్‌ పసికూనే అయినప్పటికీ వారిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వరల్డ్‌ కప్‌ కంటే ముందు జరిగిన ఆసియా కప్‌ 2023లో బంగ్లాదేశ్‌ మనల్ని ఓడించిన విషయం మర్చిపోకూడదు. అలాగే 2007 వన్డే వరల్డ్‌ కప్‌లోనూ బంగ్లాచేతిలో ఓడిన భారత్‌.. ఆ మెగా టోర్నీ నుంచి లీగ్‌ దశలోనే ఇంటిబాటపట్టింది. అలాగే.. ఈ మ్యాచ్‌ కంటే ముందు.. ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన చివరి నాలుగు వన్డేల్లో మూడు బంగ్లాదేశ్‌ గెలవడం గమనార్హం.

ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని.. బంగ్లాదేశ్‌ను ఏ మాత్రం లైట్‌ తీసుకోకుండా టీమిండియా ఆడాలని భారత క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం టీమిండియా సూపర్‌ ఫామ్‌లో ఉంది. వరుసగా మూడు మ్యాచ్‌లు గెలిచి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ లాంటి మేటి జట్లతో పాటు ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించి.. మంచి జోష్ మీదుంది. అయితే.. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సంచలనాలు నమోదు కావడం కాస్త ఆందోళన కలిగించే అంశం. ఆఫ్ఘనిస్థాన్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను, అలాగే నెదర్లాండ్స్‌.. పటిష్టమైన సౌతాఫ్రికా జట్లకు షాకిచ్చిన నేపథ్యంలో టీమిండియా కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్న టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ.. బంగ్లాదేశ్‌లోని ఓ బౌలర్‌ను మాత్రం అస్సలు తక్కువ అంచనా వేయకూడదని అంటున్నాడు.

అతనే బంగ్లాదేశ్‌ కెప్టెన్‌, స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌. ఇండియా-బంగ్లాదేశ్‌ మధ్య ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా.. కోహ్లీ వర్సెస్‌ షకీబ్‌ ఫైట్‌ గురించి చర్చ జరుగుతుంది. అయితే.. మ్యాచ్‌కి ముందు జరిగే చిట్‌చాట్‌లో కోహ్లీ మాట్లాడుతూ.. “షకిబ్ చాలా అనుభవం ఉన్న క్రికెటర్‌, ముఖ్యంగా కొత్త బంతితో షకిబ్ మాయ చేయగలడు. రన్స్‌ ఇవ్వకుండా బ్యాటర్ ని ఇబ్బంది పెడతాడు. అదే అతని స్పెషాలిటీ. అతడిని ఎదుర్కొనేటప్పుడు మన బెస్ట్ ఇవ్వాలి. లేకపోతే మనల్ని ఒత్తిడిలోకి నెట్టి వికెట్ పట్టేస్తాడు’ అని కోహ్లీ అన్నాడు. అలాగే బంగ్లాదేశ్ చిన్న టీమ్ కాదన్న కోహ్లీ.. వరల్డ్ కప్ లో పెద్ద టీమ్, చిన్న టీమ్ అనేవి ఉండవని, చిన్న టీమ్ అనే ఆలోచనతో బరిలోకి దిగితే ఊహించని షాక్ లు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించాడు. కాగా, ఇప్పటివరకు షకిబ్ బౌలింగ్ లో 148 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ.. అందులో 140 పరుగులు చేశాడు. అలాగే షకిబ్ తన స్పిన్ తో కోహ్లీని 5 సార్లు ఔట్ చేయడం విశేషం. మరి గురువారం మ్యాచ్‌లో ఇద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారని మీరు భావిస్తున్నారో.. అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పాకిస్థాన్ కు షాకిచ్చిన ICC! ఇండియాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటది..