iDreamPost
android-app
ios-app

తెలుగు సినిమా పాటకు కేరాఫ్ అడ్రెస్ వేటూరి

తెలుగు సినిమా పాటకు కేరాఫ్ అడ్రెస్ వేటూరి

వేటూరి సుందరరామ్మూర్తి – తెలుగు సినిమా పాటకు కేరాఫ్ అడ్రెస్ ఆయన, తెలుగు సినిమా పాటల రచయిత కావడానికి ముందు ఆయన దాదాపు రెండు దశాబ్దాల పాటు పాత్రికేయుడిగా పని చేశారు. తెలుగు భాషకు ప్రాచీనహోదా కలిగించనందుకు ఆయనకు ఇచ్చిన జాతీయ అవార్డును వెనక్కు ఇచ్చేసిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. పలు సందర్భాల్లో ఆయన చెప్పిన కొన్ని సరదా విషయాలు ఆయన జయంతి నాడు స్మరించుకుంటూ…

తెలుగేతరుల దగ్గర పాటలు పాడించడంపై అతని అభిప్రాయం అడిగినప్పుడు ఆయన వివరిస్తూ … ‘చూడాలని ఉంది’ చిత్రంలోని ‘రామ్మా చిలకమ్మా ‘ పాట గురించి ఒక సందర్భంలో వేటూరి సుందర్రామ్మూర్తి గారు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

“కొత్తదనం కోసం కొత్త గాయకుల దగ్గర పాడించడం మంచిదే, కానీ భాష విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మర్చిపోకుండా చూసుకోవాలి – ఉదాహరణకు ‘చూడాలని ఉంది’ చిత్రం కోసం నేను రాసింది ‘రామా చిలకమ్మా’ అయితే అది రికార్డింగ్ థియేటర్లో ‘రామ్మా చిలకమ్మా’ అయింది… ఆ పదం కూడా తప్పు కాదు కనుక సరిపోయింది, ఆ పాట సూపర్ హిట్ అయింది, అదే కరెక్టు పదమేమోనని ఆ పేరుతో “రామ్మా చిలకమ్మా” అని సినిమా కూడా వచ్చింది”. అలా చిన్న పొరబాటు జరిగినా కూడా పాట చాలా పెద్ద హిట్ అయిందని సభలో అందరినీ నవ్వించారు.

మరోసారి ఒక బాలీవుడ్ గాయకుడితో తనకు ఎదురైన అనుభవం గురించి తానే స్వయంగా ఒక క్లాసులో చెబుతూ … “నేను ఒక పాటలో ‘జాబిలి’ అనే పదం రాస్తే, ఆ పాట పాడాల్సిన బాలీవుడ్ గాయకుడికి ఆ పదాన్ని ‘జాబిల్లి’ అనాలని ఎవరో చెప్పారు … అతను నా దగ్గరకు వచ్చి ‘ఏ బిల్లి క్యా హై, క్యో జా జా బోల్ రహే ఆప్ ?’ (ఈ పాటలో పిల్లి ప్రస్తావన ఎందుకొచ్చింది, మీరు దాన్ని ఎందుకు వెళ్ళిపోమంటున్నారు ?) అని అడిగాడు. నాకు ఇంక ఎలా చెప్పాలో అర్ధం కాక – ‘ఏ బిల్లీ ఓ బిల్లీ నై … ఏ బిల్లీ ఊపర్ ఆకాశం మే ఘుమ్తా హై'(ఇది మీరు అనుకునే పిల్లి కాదు, ఈ పిల్లి పైన ఆకాశంలో తిరుగుతుంటుంది) అని చెప్పాను.” అనగానే అందరూ కడుపుబ్బా నవ్వారు.(జాబిలి, జాబిల్లి రెండు పదాలు సరైనవే, పాటలో రాగానికి తగ్గట్టుగా వాడతారు)

‘సఖి’ చిత్రంలోని పాట గురించి చెబుతూ…

తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే చిత్రాలకు మేము కూడా పాటలు రాసేటప్పుడు తీసుకునే జాగ్రత్తల్లో మొదటిది – మాతృక అర్ధం మారకుండా ఉండటం, రెండవది – పెదాల కలయికలో ఎక్కువ వ్యత్యాసం లేకుండా చూసుకోవడం, మూడవది – సినిమా కథకు కూడా అన్వయించుకోవడం. దానికి ఉదాహరణే ‘సఖి’ చిత్రంలోని ‘స్నేహితుడా.. స్నేహితుడా’ పాట.. తమిళంలో ‘రగసియ స్నేహిదనే’ అన్న పదాన్ని ‘రహస్య స్నేహితుడా’ అని తర్జుమా చేశాను. ‘అర్ధం ఏమైనా మారిపోతుందేమో?’ అని ఒకతను నన్ను అడిగారు – ‘కథా పరంగా కూడా ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకునేసి, రహస్యంగా ప్రేమించుకుంటూ ఉంటారు కనుక ఆ విధంగా ప్రియుడు ఇక్కడ రహస్య స్నేహితుడే అవుతాడు’ అని చెప్పాను” అంటూ సెలవిచ్చారు.

వేటూరి -‘పడనీరా విరిగి ఆకసం,
విడిపోనీ భూమి ఈ క్షణం
మా పాట సాగేనులే’ అంటూ
తన తుది శ్వాస వరకు ఊపిరిలూదిన కలం ఆయనది…
రమ్యాక్షరాల రాగాల పల్లకీలో ఆబాలగోపాలాన్ని అలరించిన ఆ బాల గోపాలుడు..
సందెవేళకి ఆకాశంలో సూర్యుడుండకపోయినా,
తెల్లవారితే చందమామకి రూపం ఉండకపోయినా…
దివారాత్రాలూ తెలుగు అక్షరంలో
వేటూరి తొంగి చూస్తూనే ఉంటాడు.