iDreamPost
iDreamPost
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కొత్త సినిమా శేఖర్ విడుదలకు సిద్ధంగా ఉంది. నిజజీవిత భాగస్వామి జీవిత స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఇప్పుడు ఆఫర్లు బాగానే వస్తున్నాయని ఫిలిం నగర్ టాక్. అదేంటి మార్కెట్ తగ్గింది కదా డీల్స్ రావడం ఏమిటనుకుంటున్నారా. అయితే అవి థియేటర్ కోసం కాదట. డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కోసం కొన్ని సంస్థలు 22 కోట్ల దాకా కోట్ చేసినట్టు వచ్చిన లీక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది, నిజంగానే దీన్ని హాళ్లలో వదిలితే ఇంత మొత్తం రావడం అసాధ్యం. మహా అయితే ఏడెనిమిది కోట్ల కంటే ఎక్కువగా అమ్ముడుపోయే ఛాన్స్ లేదు. బడ్జెట్ కూడా అంతకన్నా తక్కువే అయ్యింది.
అలాంటాప్పుడు శేఖర్ కు నిజంగా ఇంత మొత్తం ఇస్తామన్నారంటే అది గొప్ప విషయమే. ఇది వాస్తవమేనా లేక బజ్ కోసం వదిలిన లీకా అనేది తెలియాల్సి ఉంది. మలయాళం హిట్ మూవీ జోసెఫ్ కు శేఖర్ రీమేక్. అక్కడది బాగానే ఆడింది కానీ కథనం చాలా స్లోగా సాగుతుంది. తెలుగులో ఆ ఇబ్బంది లేకుండా కీలకమైన మార్పులు చేసినట్టు సమాచారం. మెడికల్ మాఫియా చుట్టూ తిరిగే ఒక డిఫరెంట్ పాయింట్ తో హీరో పాత్ర రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుంది. ఊహించని షాకింగ్ క్లైమాక్స్ కూడా జోసెఫ్ ని హిట్ చేసిన అంశాల్లో ఒకటి. అందుకే శేఖర్ కూడా వర్కౌట్ అవుతుందనే నమ్మకంతో ఓటిటికి అడిగారట.
మొత్తానికి రాజశేఖర్ తగ్గిపోయిన తన థియేట్రికల్ మార్కెట్ ని వెనక్కు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు కానీ ఇలా డిజిటల్ ద్వారా ఎక్కువ శాతం ప్రేక్షకులకు చేరే అవకాశం అయితే ఉంటుంది. తన కూతురు శివాని అద్భుతం సినిమా హాట్ స్టార్ లో బాగా రీచ్ అయినట్టు సంస్థే అధికారికంగా చెబుతోంది. సో శేఖర్ కూడా అదే బాట పడితే మంచిదేమో. లక్ష్మి భూపాల రచన చేసిన ఈ మెడికల్ థ్రిల్లర్ కు అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కల్కి నిరాశ పరచడంతో రాజశేఖర్ ఇప్పుడు శేఖర్ మీదే హోప్స్ పెట్టుకున్నారు. విడుదల విషయంలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి
Also Read : Theatres And OTT థియేటర్ కు ధీటుగా విడుదలైన డిజిటిల్ వినోదం