iDreamPost
iDreamPost
ఎఫ్2 ఇండస్ట్రీ సక్సెస్ తో మంచి ఊపుమీదున్న విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నారప్ప చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. వెనుకబడిన వర్గాలకు చెందిన హీరో ఉన్నవాళ్ళ దురాగతాలకు తిరగబడే పల్లెటూరి వ్యక్తిగా వెంకీని ఇందులో సరికొత్త డైమెన్షన్ లో చూడబోతున్నాం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ సంస్థ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇంకో పాతిక శాతం షూటింగ్ పూర్తి చేస్తే ఫస్ట్ కాపీ పనులకు వెళ్లిపోవచ్చు. దీని తర్వాత వెంకటేష్ ఏ సినిమా చేస్తారన్న సస్పెన్స్ అందరిలోనూ ఉంది. అనిల్ రావిపూడి ఎఫ్3 స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడు.
అయితే ఇది లాక్ డౌన్ పూర్తయిన వెంటనే స్టార్ట్ అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మరో హీరో వరుణ్ తేజ్ డేట్స్ తో పాటు ఇతర ఆర్టిస్టుల అందుబాటుని కూడా చెక్ చేసుకోవాలి. ఈ మధ్యలో శేఖర్ కమ్ముల వెంకీకి ఓ కథ వినిపించాడట. లైన్ వినగానే ఇంప్రెస్ అయిపోయి ప్రొసీడ్ అవ్వమనే గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందట. శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్య లవ్ స్టోరీ ఫినిషింగ్ లో ఉన్నారు. కేవలం కొంత శాతం మాత్రమే బాలన్స్ ఉంది. అది అవ్వగానే తక్కువ టైంలోనే సెన్సార్ కు వెళ్ళిపోతారు. పరిస్థితులకు అనుగుణంగా డేట్ ని ఫిక్స్ చేస్తారు. మహా అయితే నవంబర్ లోపు శేఖర్ కమ్ముల ఫ్రీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీన్ని నిర్మించిన ఏషియన్ సంస్థనే వెంకీ ప్రాజెక్ట్ ని సైతం డీల్ చేయొచ్చు. కాకపోతే స్క్రిప్ట్ ని ఫైనల్ గా లాక్ చేశాకే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీనికి కొంత టైం అయితే పడుతుంది. లవ్ స్టోరీ సక్సెస్ మీద శేఖర్ కమ్ముల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. హీరోయిన్ సాయి పల్లవితో పాటు ఫీల్ గుడ్ మ్యూజిక్, ఎమోషనల్ జర్నీ లాంటివి ఇందులో హై లైట్ కాబోతున్నాయట. ఇప్పటిదాకా సీనియర్ స్టార్లు ఎవరినీ డైరెక్ట్ చేయని శేఖర్ కమ్ముల ఇప్పుడు వెంకీతో కనక పక్కాగా ఓకే అయితే మొదటిసారి ఆ అనుభవం కూడా చవిచూడబోతున్నారు. అభిమానులు కూడా దీని పట్ల మంచి ఆసక్తి కనబరుస్తారు.