Idream media
Idream media
కాంబినేషన్లు చూసుకుని సినిమాలకెళితే కళ్ళొత్తుకోవలసిస్తుందని మరోమారు నిరూపించిన చిత్రరాజం – వెంకీమామ. మొదటి రీలు నుండి శుభం కార్డు ముందేసే జోకు వరకూ… పాతికేళ్ళ క్రితం ఫార్ములాలని తు.చ తప్పకుండా పాటిస్తూ తీసిన సినేమా.
ఓ ఊళ్ళో పెద్దమనిషికి బోలెడు టాలెంటు. ఎవడి భవిష్యత్తునైనా బయోస్కోపేసి చూసినట్టు ఓ.. తెగ చూసేసి.. ఇప్పటి న్యూసు ఛానెళ్ళ వాళ్ళలా అవసరం ఉన్నా లేపోయినా అయ్యి బాబోయ్… అని అదరగొట్టేస్తూ ఉంటాడు. ఆయన బాధ ప్రపంచానికి బాధ అని ఫీలయ్యే మనిషి. ఆ తర్వాతిసీనులోనే డ్రైవరు డ్రెస్సేసుకుని మరీ, వెనక సీటోళ్ళతో సొల్లేసుకుంటా.. రోడ్డుని చూడ్డం మానేసిన ఓ డ్రైవరు మహాశయుడి వల్ల.. ఆ పెద్దాయన చెప్పిన జాతకం నిజమై కుర్చుంటాది. వెనక ఏవో సంస్కృత పదాలతో పాట యాడెడ్ ఫీచరు.
పోన్లే… ఊళ్ళో జరిగే కధ కాబట్టి లోకలు ఇలనూ, ఇలేజి కామెడీ, మోటు సరసాలూ, గుడి దగ్గర జాతర, అదయ్యాక ఫైటూ, గరగలూ తోలుబొమ్మలూ కామన్లే అని ఎంత సరిపెట్టుకున్నా.. తెర మీది పాత్రలతో మనల్ని అసలు కనెక్ట్ అవకుండా చేసిన కధ కధనం చిత్రానువాదం ఏదైతే ఉందో… ఆ డైరెట్రు బాబు పాదాలకి గోరింటాకెట్టి మరీ దన్నాలెట్టాలనిపించింది. ఇంక ఆ పై పాయలు రాజ్‌పుతు గారు తుక్కు రేగ్గొడుతూ వేసిన సగం తెలుగు సగం బెంగాలీ పాత్ర ఇంకో రేంజు. సగం బెంగాలీ అయినపుడు బెంగాలీ కదా మాట్లాడాలి.. హిందీ మాహాడతేందేంటీ మనం అడక్కూడదు. మనకి పాపం లగ్‌తాహై!
ఇంక సగం సగం బట్టలతో హీరోయినూ.. ఒంటి నిండా బట్టలతో ఆవిడ పక్కన లేడీ కమెడియను కూడా ఫార్ములా ప్రకారం వండిన పులిహోరే. లొల్ల లాకుల దగ్గర్నుంచి తణుకు బైపాస్ రోడ్డుకి, గోదారి రేవు నుంచి డైరెట్టు ఊరి మధ్యలో స్కూలుకీ, రాయిమండ్రి ఎల్లడానికి ఇంకా పడవల్నే నమ్ముకుని ఉన్న ఆ ఊరి జనం యొక్క దీన స్థితి చూస్తే.. గూగులు మ్యాప్సూ, గూగులు సీయీఓ, పోయిన సారి సీయంగా చేసినాయన కూడా నోట్లో గుడ్డలు కుక్కుకుని మరీ ఓ మూలకెళ్ళి నుంచుని మరీ ఏడుస్తారు, “ఏవి తల్లీ నిరుడు వేసిన సిమెంట్రోడ్డులూ…” అని.
ఊరికే ద్రాక్షారంలో కధతో తాత్సారం చేయడమెందుకని ఖర్చు పెట్టి మరీ కధని కాశ్మీరుకి షిఫ్టు చేసాక సీన్లు ఉన్నాయి నా సామిరంగా….. అసలు ఇండియను ఆర్మీని ఇంత సిల్లీగా చూపిస్తూ పాకిస్తానోళ్ళు కూడా సినిమాలు తీయరు. అపుడెపుడో వచ్చిన విజయేంద్ర వర్మ, మొన్నొచ్చిన బందోబస్తు.. ఇప్పుడిదిగో వెంకీమామ. మన ఆర్మీ మేటర్లంటే.. ఏదో అటుకులేపారం అన్నట్టు చూపించాయన్న మాట.
పోలీసు స్టేషన్లో ఓ రాత్రుండి, హైటు అటు ఇటూగా ఉన్నా సరే చైతూ బాబుకి సమంతని చేసుకున్న అదృష్టం వల్ల ఏకంగా ముడేళ్ళలోనే ఆర్మీలో కమాండరు రేంజి జాబొచ్చేస్తది. పైగా సర్జికల్ స్ట్రైకు లాంటి శస్త్రచికిత్సకి నాయకుడిగా. పోన్లే మనం వచ్చింది తెలుగు కమర్షియల్ సినేమాకి, లాజిక్కులతో పనేముంది.. అని తల్లీ బిడ్డా న్యాయంగా సరిపెట్టుకుని చూసేలోపే డబల్ చిన్ తో ఆర్మీ ఆఫీసర్‌గా ప్రకాశంరాజు గారి ఇంట్రో చూసాక తస్సాదియ్యా…. అర్జంటుగా నాకూ ఒళ్ళూ పెంచేసి ఆర్మీలో ఆఫీసరైపోవాలనిపించింది.
ఈ ఆఫీసరెలాంటోడంటే… ఏ కూరకి ఎంత ఉప్పు వేయాలో చెప్పే పెళ్ళిళ్ళకి వంట చేసే వంట మాస్టర్లాంటోడు. అన్ని నిర్ణయాలూ ఈయనవే! మన దేశానికంటూ ఓ పెబుత్వం ఓ ఇధానం ఉందని తెలియని అమాయక జీవి. ఇంక ఆర్మీవాళ్ళూ పాకిస్తాన్ వాళ్ళు బందీలని మార్చుకునే సీను ఏదైతే ఉందో… అచ్చు పాలకొల్లు సంతలో పక్క పక్క కొట్లోళ్ళు వందకీ రెండొందలకీ ఒకరికొకరు చిల్లర మార్చుకున్నంత ఈజీగా ఉగ్రవాదుల్ని ఎక్సేంజీ చేసేసుకుంటారు.
ఇక… విక్టరీ మామ తెలుగు హీరో కాబట్టి.. కాశ్మీరెళ్ళి మిలటరీ క్యాంపులో మిలటరీ వాళ్ళనే మిలట్రీ గన్ను పెట్టి మరీ బెదిరించి మిలటరీ నాయుడనిపించుకున్నాడు. ఆపై పాపం బుల్లెట్టు దెబ్బ తగిలి కళ్ళు తేలేసేయగా.. రెండు చేతులతో రెండు పెట్టిలట్టుకుని ఇస్త్రీ చేస్తున్నట్టు సుతారంగా గుండెల మీద అంటించిన డాట్రు.. “ఎబ్బే లాబం లేదు ఈయన గొంతులో గ్యాసాగిపోయిందన్జెప్పి” పెదవి విరిచి, ఆ విరిచిన పెదవికి వేజలిను రాసుకునెళ్ళిపోయాక.. చైతు బాబు చెప్పే డైలాగులిని ఎక్కడ ఎంకటేశు బాబు లేచిపోతాడో అనే భయంతో.. సీట్లోంచి లేచొచ్చి హాల్లోంచి బయటపడ్డాను. లోపలేదో జేకేసారనుకుంట, జనం నవ్వుతున్నారు. ఎంకీ మామ నా ఎంకమ్మా.. అనుకుంటూ రూంకొచ్చి ఇప్పటికి సరిగ్గా మూడ్రోజులైంది. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం పాయల్ రాజ్‌పుత్ పెట్టుకున్న ప్లాస్టిక్ పూలలా ఇంకా ఫ్రెష్షుగా ఉన్నాయి!!!
–Written By Vinod Krishna