ఆ చానెల్ నుంచి వెంక‌ట కృష్ణ నిష్క్రమణ, జాతీయ మీడియా సంస్థ‌పై క‌న్నేశారా

తెలుగు మీడియాలో మార్పులు, చేర్పులు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే అదో నిరంత‌ర ప్ర‌క్రియ‌. అయితే కొంద‌రు జ‌ర్న‌లిస్టు పెద్ద త‌ల‌కాయ‌ల మార్పిడి మాత్రం ఆస‌క్తిక‌ర‌మే. అందులోనూ రాజ‌కీయంగా స్పష్ట‌మైన విభ‌జ‌న ఏర్ప‌డిన నేప‌థ్యంలో వారి క‌ద‌లిక‌లు కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తూ ఉంటాయి. అలాంటి వారిలో వెంక‌ట కృష్ణ ఒక‌రు. తెలంగాణా నుంచి వ‌చ్చినా ఏపీలో తెలుగు శాటిలైట్ చానెల్ కి సీఈవో గా కొన్నేళ్లుగా చ‌క్రం తిప్పుతున్నారు. కానీ గ‌త కొంత‌కాలంగా ఆయ‌న ప‌రిస్థితి అంత శ్రేయ‌స్క‌రం గా లేద‌నే ప్ర‌చారం సాగింది.

అలాంటి ప్ర‌చారాల‌ను బ‌ల‌ప‌రుస్తూ ప్ర‌స్తుతం వెంక‌ట కృష్ణ‌కు త‌మ చానెల్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు అన్న‌పూర్ణ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేష‌న్ ప్ర‌క‌టించింది. ఏపీ 24/7 సంస్థ నిర్వ‌హ‌ణలో కీల‌క భూమిక పోషిస్తున్న వెంక‌ట కృష్ణ‌కు ఏపీలో అధికారం మారిన నాటి నుంచి కొన్ని త‌ల‌నొప్పులు ఉన్న‌ట్టుగా క‌నిపించింది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన కొన్నాళ్ల‌కు ఆయ‌న తెర‌మ‌రుగుయ్యారు. కొన్ని నెల‌ల పాటు ఆయ‌న రోజువారీ చానెల్ వ్య‌వ‌హారాల‌కు దూరంగా కూడా ఉన్నారు. అయితే ఆ త‌ర్వాత మ‌ళ్ళీ య‌ధావిధిగా చానెల్ సీఈవో క‌మ్ ఎడిటోరియ‌ల్ ఇన్ఛార్జ్ గా స‌ర్వం తానే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు.

కానీ కొంత‌కాలంగా ఆ సంస్థ‌లో ప‌రిణామాలు కొంత గంద‌ర‌గోళాన్ని త‌ల‌పించాయి. చివ‌ర‌కు చైర్మ‌న్ గా ఉన్న ముర‌ళీకృష్ణ రాజు (మాటీవీ మాజీ య‌జ‌మాని) వైదొల‌గ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. అదే స‌మ‌యంలో సిబ్బందికి సంబంధించిన వేత‌నాలు నెల‌ల త‌ర‌బ‌డి పెండింగ్ లో పెట్ట‌డం, ఇత‌ర బిల్లులు కూడా చెల్లించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో చివ‌ర‌కు ఏమ‌వుతుందోన‌నే ఆందోళ‌న సిబ్బందిలో కూడా క‌నిపించింది. కానీ చైర్మ‌న్ గా రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన ముర‌ళీకృష్ణం రాజు అనూహ్యంగా మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈసారి ఆయ‌న సీఎండీ హోదాలో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కొంత‌కాలంగా ఎడిటోరియ‌ల్ బోర్డ్ తో పాటుగా డైరెక్ట‌ర్స్ తో కూడా స‌ఖ్యంగా లేని వెంక‌ట కృష్ణ త‌న బాధ్య‌త‌ల నుంచి వైదొలిగిన‌ట్టు ప్ర‌క‌టించారు.

అదే స‌మ‌యంలో చానెల్ నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల కోసం కొత్త జ‌ర్న‌లిస్టుల‌ను తెర‌మీద‌కు తెచ్చారు. అందులో భాగంగా ఇన్ హౌస్ వ్య‌వ‌హారాల‌న్నీ కృష్ణ‌సాయిరాం కి అప్ప‌గించారు. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగా సామర‌స్యంగా వ్య‌వ‌హ‌రించే స‌మ‌ర్థుడైన జ‌ర్న‌లిస్ట్ గా సాయిరాంకి గుర్తింపు ఉంది. ఇక నెట్ వ‌ర్క్ తో పాటు ఇత‌ర వ్య‌వ‌హారాలు పి శ్రీనివాస్ కి అప్ప‌గించారు. గ‌తంలో వెంక‌ట‌కృష్ణ నిర్వ‌హించిన బాధ్య‌త‌ల‌ను ఇప్పుడు ఈ ఇద్ద‌రికీ అప్ప‌గించ‌డంతో మ‌ళ్లీ సంస్థ గాడిలో ప‌డుతుంద‌ని అక్క‌డి సిబ్బంది అంచ‌నా వేస్తున్నారు.

వెంక‌ట కృష్ణ భ‌విత‌వ్యంపై ఊహ‌గానాలు మొద‌ల‌య్య‌యి. ఈటీవీ గూటి నుంచి అడుగుపెట్టి టీవీ5, హెచ్ ఎంటీవీల‌లో ప‌నిచేసి, ఆ త‌ర్వాత 6టీవీ, ఏపీ 24 చానెళ్ల వ్య‌వ‌స్థాపక బృందంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన వెంక‌ట కృష్ణ అడుగులు ఎటువైపు అన్న‌ది ఆస‌క్తిగా మారింది. అయితే త్వ‌ర‌లో తెలుగు విభాగం ప్రారంభించ‌బోతున్న ఓ జాతీయ మీడియా వైపు ఆయ‌న ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌యిన‌ట్టు ప్ర‌చారం మొద‌ల‌య్యింది. ఇప్ప‌టికే వివిధ చానెళ్ల‌లో ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఉన్న ప‌లువురు సీనియ‌ర్లు కూడా అదే ప్ర‌య‌త్నాల్లో ఉండ‌డంతో చివ‌ర‌కు ఎవ‌రికీ అవ‌కాశం ఉంటుంద‌నేది ప్ర‌శ్నార్థ‌కం అవుతోంది. అదే స‌మ‌యంలో తెలుగులో అర్న‌బ్ గోస్వామి త‌ర‌హాలో వ్య‌వ‌హ‌రించాల‌ని భావించి ఇప్పుడు బ‌య‌ట‌కు రావాల్సిన ప‌రిస్థితికి వ‌చ్చిన వెంక‌ట కృష్ణ జ‌ర్న‌లిస్ట్ జీవిత ప‌య‌నం ఎటు అన్న‌ది ప్ర‌స్తుతానికి సందిగ్దంగా క‌నిపిస్తోంది.

Show comments