iDreamPost
iDreamPost
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గౌరవం ఉంది. రెగ్యులర్ కమర్షియాలిటీకి భిన్నంగా అతను చేసే ప్రయోగాలు మెప్పించడమే కాదు అవార్డులు రివార్డులు తెచ్చిపెడుతుంటాయి. గమ్యంతో మొదలుపెట్టి గౌతమిపుత్ర శాతకర్ణి దాకా ఆయన ప్రయాణం విభిన్నంగా కొనసాగుతూ వచ్చింది. ఇటీవలే వచ్చిన కొండపొలం ఫలితం నిరాశపరిచినప్పటికీ ఇప్పుడు తన ఆశలన్నీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మీదే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ విజువల్ గ్రాండియర్ కోసం ఇప్పటికీ కోట్లాది రూపాయలు మంచి నీళ్ల ప్రాయంలా విపరీతంగా ఖర్చు పెట్టేశారు కానీ షూట్ ఇంకా చివరి దశకు రాలేదు.
జనసేన వల్ల బ్రేకులు పడుతూనే ఉన్నాయి కానీ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఇదిలా ఉండగా క్రిష్ త్వరలో ఒక వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేయబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. వేశ్యల జీవితాల చుట్టూ తిరిగే ఒక విలక్షణ కథను ఎంచుకున్నారని తెలిసింది. నవల ఆధారంగా అంటున్నారు కానీ అదే పుస్తకమో ఇంకా లీక్ కాలేదు. ఇటీవలే మల్లాది వెంకట కృష్ణమూర్తి పాత నవల తొమ్మిది గంటలను నైన్ అవర్స్ పేరుతో క్రిష్ ఓ వెబ్ సిరీస్ నిర్మించిన సంగతి తెలిసిందే. దర్శకత్వం చేయకపోయినా పర్యవేక్షణ ప్లస్ రచన అంతా ఆయనదే. హరిహర వీరమల్లు జరుగుతున్న జాప్యం వల్ల వస్తున్న గ్యాప్ ని దీంతో పూడ్చుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది.
2023 సంక్రాంతికి పవన్ మూవీని రిలీజ్ చేయడం డౌట్ గానే ఉంది. సరైన అప్ డేట్ ఏదీ ఇప్పటిదాకా రాలేదు. అప్పుడెప్పుడో చిన్న టీజర్ తర్వాత ఒక పోస్టర్ తప్ప ఎలాంటి సమాచారం లేదు. అందులో నటిస్తున్న క్యాస్టింగ్ కూడా సైలెంట్ గా ఉన్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కానీ జాక్వలిన్, వివేక్ ఒబెరాయ్ కానీ ఏదీ చెబుతున్న దాఖలాలు లేవు. దీనికన్నా ముందే తక్కువ టైంలో వినోదయ సితం రీమేక్ ని పూర్తి చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్టు ఇప్పటికే లీక్స్ ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే హరిహర వీరమల్లు వచ్చే వేసవి కన్నా ముందు ఎక్స్ పెక్ట్ చేయలేం. ఈలోగా వెబ్ సిరీస్ ఏంటి ఓ రెండు సినిమాలు కూడా క్రిష్ ఈజీగా చేసేయొచ్చు.