Varasudu Review వారసుడు రివ్యూ

విజయ్ ఇమేజ్ పరిమితంగానే ఉన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు దీనికి భారీ రిలీజ్ దక్కేలా స్క్రీన్లను ప్లాన్ చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

విజయ్ ఇమేజ్ పరిమితంగానే ఉన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు దీనికి భారీ రిలీజ్ దక్కేలా స్క్రీన్లను ప్లాన్ చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది.

సంక్రాంతి పండక్కు డబ్బింగ్ మూవీకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వివాదం మీద ఎక్కువ చర్చలో I ఉన్న వారసుడు ఎట్టకేలకు తమిళ వెర్షన్ కన్నా మూడు రోజులు ఆలస్యంగా తెలుగులో విడుదలైంది. విజయ్ ఇమేజ్ పరిమితంగానే ఉన్నప్పటికీ నిర్మాత దిల్ రాజు దీనికి భారీ రిలీజ్ దక్కేలా స్క్రీన్లను ప్లాన్ చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. కంటెంట్ మీద బలమైన నమ్మకం చూపిస్తున్న ఎస్విసి టీమ్ దానికి తగ్గ ఫలితం అందుకుంటుందా లేదానే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు చిరు బాలయ్య అభిమానుల్లోనూ ఉంది. మరి ఈ వారసుడు ఉన్న కాసిన్ని అంచనాలను అందుకునేలా ఉన్నాడా లేక రాజుగారికి షాక్ ఇచ్చాడా రివ్యూలో చూద్దాం పదండి

కథ

కోట్ల రూపాయల వ్యాపారం చేసే సంస్థకు అథిపతి రాజేంద్ర(శరత్ కుమార్). ఇద్దరు కొడుకులు(శ్రీకాంత్-జై) చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవహరాలు చక్కబెడుతూ ఉంటారు. మూడోవాడు(విజయ్) తండ్రి పద్ధతులు నచ్చక స్వంతంగా ఎదగాలనే లక్ష్యంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. షష్టిపూర్తికి రమ్మని అమ్మ(జయసుధ)పిలవడంతో ఇష్టం లేకపోయినా ఆ వేడుక కోసం తిరిగి వస్తాడు. ఈలోగా బిజినెస్ శత్రువు జెపి(ప్రకాష్ రాజ్) వల్ల రాజేంద్ర కంపనీతో పాటు కుటుంబంలోనూ చీలికలు వస్తాయి. దాంతో ఇవన్నీ సరిదిద్దే బాధ్యత విజయ్ మీద పడుతుంది. మరి ఈ వారసుడు వీటిని ఎలా చక్కదిద్ది కుటుంబంలో ఆనందం తీసుకొచ్చాడనేదే అసలు స్టోరీ

నటీనటులు

విజయ్ కి తమిళంలో ఎంతైనా ఫాలోయింగ్ ఉండొచ్చు కానీ మనకు మాత్రం రజనీకాంత్ సూర్య రేంజ్ లో ఇమేజ్ ఉన్న హీరో కాదు. గత రెండు మూడేళ్ళలో చెప్పుకోదగ్గ కమర్షియల్ హిట్లు రావడం వల్ల అంతో ఇంతో ఫాలోయింగ్ పెరిగిందే తప్ప టాలీవుడ్లో స్టార్ అనిపించుకునే స్థాయి ఇంకా రాలేదు. నటన పరంగా చూసుకుంటే ఇందులో ఎప్పటిలాగే చేసుకుంటూ పోయాడు తప్పించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన గొప్ప విషయాలేం లేవు. లుక్స్, స్టయిల్ రెండూ బాగున్నాయి. డాన్స్ మాత్రం పదే పదే చూసిన ఫీలింగ్ ఇస్తుంది. చాలా తక్కువ ఎక్స్ ప్రెషన్లు పంచులు కూడిన మాటలు తప్ప వర్సటైల్ అనిపించుకునే రేంజ్ లో తన నుంచి ఏమీ ఆశించలేం

రష్మిక మందన్న కేవలం పాటల కోసం ఇంకెందుకు ఉపయోగపడలేదు. లవ్ ట్రాక్ కూడా పాత చింతకాయ పచ్చడే. శరత్ కుమార్ మూడు గంటల పాటు నీరసంగా కనిపిస్తారు. సహజనటి జయసుధ సహజంగా కన్నీళ్లు పెట్టడానికి ఉపయోగపడ్డారు. ప్రకాష్ రాజ్ అత్యంత రొటీన్ క్యారెక్టర్లలో ఈజీగా మర్చిపోదగ్గ విలన్ గా బోర్ కొట్టించేశారు. బకరా అన్నయ్యలుగా శ్రీకాంత్, జైలు ఓకే. యోగిబాబు కామెడీ అంతగా పేలలేదు. ఒకటి రెండు చోట్ల నవ్వించాడు అంతే. సంగీత తదితరుల గురించి చెప్పడానికి ఏమీ లేదు. క్యాస్టింగ్ గ్రాండ్ గా ఉంది కానీ వాళ్ల ఎనర్జీకి తగ్గ సరైన పాత్రలు పడకపోవడం వల్ల ఫ్రేమ్ నిండా తారాగణం ఉన్నా లాభం లేకపోయింది

డైరెక్టర్ అండ్ టీమ్

తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లికి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎస్ చెప్పాడంటే ఏదో గట్టి మ్యాటరే ఉంటుందని ఆశిస్తాం. కానీ విచిత్రంగా పాత కథలన్నీ కిచిడీ చేసుకొచ్చి దానికి ఎమోషనల్ డ్రామా అనే కలరింగ్ ఇవ్వడం విచిత్రంగా అనిపిస్తుంది. తండ్రికి విరుద్ధంగా అన్నదమ్ముల ప్రవర్తన ఉండటం శోభన్ బాబు మురళి మోహన్ కాలం నుంచి వెంకటేష్ దాకా లెక్కలేనన్ని సినిమాల్లో చూశాం. అయినా మళ్ళీ అదే బ్యాక్ డ్రాప్ అందుకోవడం ఎందుకో అర్థం కాదు. పోనీ అది ఏమైనా కొత్త చెప్పే ప్రయత్నం చేశారా అంటే అదీ లేదు. టైటిల్ కార్డుతో మొదలుపెట్టి క్లైమాక్స్ దాకా ప్రతి సన్నివేశం గతంలోనే చూసిన ఫీలింగ్ కలుగుతూనే ఉంటుంది

ఫ్యామిలీ ఎమోషన్ ని ఎన్నిసార్లయినా తీసుకోవచ్చు. కానీ దాన్ని హత్తుకునేలా చూపించినప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అంతే తప్ప కార్పొరేట్ కంపనీ ఉన్న హీరో కుటుంబాన్ని సెట్ చేసి వాళ్ళకో ప్రత్యర్థిని పెట్టినంత మాత్రాన సరిపోదు. అసలు అంత పెద్ద బిజినెస్ మెన్ నలుగురి ముందు కొడుకు తన దయాదాక్షిణ్యం మీద చదువుకున్నాడని లేకపోతే వాడికి భవిష్యత్తే ఉండేది కాదని చెప్పడంలో ఆంతర్యం అర్థం కాదు. కేవలం విజయ్ బయటికి వెళ్లేందుకు ఒక కాంఫ్లిక్ట్ కోసం బలవంతంగా ఆలా చెప్పించినట్టు ఉందే తప్ప అదేమాత్రం సహజంగా లేదు. పైగా మిగిలిన ఇద్దరూ చైర్మన్ కి పనికిరారనే ఉద్దేశంలో ఉంటారు సదరు ఫాదర్.

చూస్తున్నంత సేపు ఏవేవో సినిమాలు గుర్తుకు వస్తూనే ఉండటం వారసుడులోని ప్రధాన లోపం. కనివిని ఎరుగని కథలు రాసుకొనవసరం లేదు. కనీసం చెప్పే విధానమైనా కొంత వైవిధ్యంగా ఉంటే రెండు వందల రూపాయల టికెట్ కొని జనం థియేటర్లకు వస్తారు. అంతే తప్ప విజయ్ ఉన్నాడు కదా ఏం చేసినా చెల్లిపోతుందనుకుంటే మిగిలేది ఫ్లాపే. కంటెంట్ తేడా కొడితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రజనీకాంత్ అంతటి వాళ్ళకే డిజాస్టర్లు తప్పనప్పుడు విజయ్ ని అతిగా ఊహించుకుని కథ కథనాలు లైట్ తీసుకుంటే ఎలా. క్యారెక్టరైజేషన్లు మరీ రొటీన్ గా ఉండటం వారసుడుని విసుగు వచ్చేలా చేసింది. మూడు గంటల నిడివి కూడా సహనానికి పరీక్ష పెట్టింది

కోట్లు ఖర్చు పెట్టమని చెప్పుకున్నారు కానీ నిజానికి ముప్పాతిక సినిమా హీరో ఇంటి కోసం వాడుకున్న ఖరీదైన బంగ్లాలోనే సాగుతుంది. పాటలు, ఫైట్ల కోసం మాత్రమే బయటికి వెళ్లారు. స్టోరీ సంగతి ఎలా ఉన్నా ఒకే లొకేషన్లో సీన్లు రిపీట్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. పోనీ ఎంటర్ టైన్మెంట్ సరైన పాళ్ళలో ఉంటే ఇవన్నీ ఏదోలే అని సర్దుకోవచ్చు. కానీ అదీ జరగలేదు. కార్పొరేట్ సంస్థలో జరిగే బోర్డు మీటింగ్ ని కామెడీ చేయడం అల వైకుంఠపురములో ఎపిసోడ్ నుంచి స్ఫూర్తి చెందారు కానీ అల్లు అర్జున్ రేంజ్ లో విజయ్ దాన్ని పండించలేకపోవడంతో ఇది చప్పగా వెళ్లిపోయింది. అరవ ఫ్యాన్స్ కి నచ్చవచ్చు

మాస్ సినిమాల్లో ఎంత రొటీన్ గా చేసుకున్నా చెల్లుతుందేమో కానీ ఇలాంటి ఫ్యామిలీ డ్రామాలతో అలా వర్కౌట్ చేయలేం. పైగా రిపీట్ చేసిన ఫార్ములా కావడంతో వారసుడులో పూర్తిగా కొత్తదనం కొరవడింది. కేవలం తమిళ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని తీశారనుకుంటే మరి తెలుగులో ఇంత పెద్ద రిలీజ్ కు ఎందుకు ప్లాన్ చేశారన్న ప్రశ్న తలెత్తుతుంది. సరే దాని సంగతలా వదిలేస్తే సెకండ్ హాఫ్ లో పెట్టిన రెండు ఫైట్లు, రంజితమే పాట కొంత ఊరట కలిగిస్తాయి. అక్కడక్కడ డైలాగుల్లో కొన్ని మెరుపులు ఉన్నా అవి సరిపోలేదు. మాస్టర్, బీస్ట్, అదిరింది, తుపాకీ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్లు చూసిన కళ్ళతో విజయ్ ని ఇంత నీరసమైన డ్రామాలో చూడలేం

ఒరిజినల్ వెర్షన్ ఫలితం ఎలా ఉన్నా తెలుగు వరకు చూసుకుంటే వారసుడు అంచనాలకు తగ్గట్టు ఎంతమాత్రం లేదు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి లాంటి మసాలా కంటెంట్ మధ్య నిలదొక్కుకోవడం సులభం కాదు. ఎత్తులు పైఎత్తులు ఉన్నప్పుడే కార్పొరేట్ కథలు ఆసక్తికరంగా ఉంటాయి. ఉదాహరణకు నాన్నకు ప్రేమతో జనాన్ని మెప్పించడానికి కారణం ఇదే. కానీ వంశీ మాత్రం వీటికి సంబంధించిన ట్రాక్స్ ని సిల్లీగా రాసుకున్నారు. టెక్నికల్ టీమ్ ఎంతగా కష్టపడినా దానికి తగ్గ ప్రయోజనం నెరవేరలేదు. రొటీన్ కథలను ఎన్నిసార్లు చూసిన మాకు బోర్ కొట్టదనుకుంటే వారసుడుని ట్రై చేయొచ్చు తప్పించి అంతకు మించి కారణం లేదు

తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. లెన్త్ ఇష్యూ వల్ల అదీ ఒక స్టేజి దాటాక రిపీట్ అనిపిస్తుంది. పాటలు విజువల్ గా కలర్ ఫుల్ గా ఉన్నాయి. కార్తీక్ పళని ఛాయాగ్రహణం గ్రాండ్ గా ఉంది. మంచి లుక్ తో పాటు క్వాలిటీ కనిపించింది. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ ఎందుకు పదునుగా లేదో అంతు చిక్కదు. ల్యాగ్ ని వీలైనంత తగ్గిస్తే బాగుండేది. పోరాట సన్నివేశాలు బాగా వచ్చాయి. దిల్ రాజు నిర్మాణ విలువల గురించి తెలిసిందే. మరీ వందల కోట్ల బడ్జెట్ కాదు కానీ సబ్జెక్టు డిమాండ్ కు తగ్గట్టు ఎంత అవసరమో అంతా ఖర్చు పెట్టారు

ప్లస్ గా అనిపించేవి

విజయ్ ఎనర్జీ
గ్రాండియర్

మైనస్ గా తోచేవి

అరిగిపోయిన ఫ్యామిలీ డ్రామా
మూడు గంటల లెన్త్
పండని ఎమోషన్లు
ఎన్నో సినిమాల రెఫరెన్సులు

కంక్లూజన్

ఏడాది మొత్తంలో అతి కీలకమైన పండగ బరిలో యావరేజ్ కంటెంట్ ఉన్నవి కూడా ఎలాగోలా గట్టెక్కుతాయి కానీ మరీ దాన్నే నమ్ముకుని రొటీన్ వ్యవహారాలతో ఆడియన్స్ ని మెప్పించడం కష్టమే. ఒకవేళ ఈ వారసుడు ఓ పదిహేనేళ్ల క్రితం వచ్చి ఉంటే సూపర్ హిట్ అయ్యేదేమో. కానీ ఎందరో దర్శకులు వాడేసిన టెంప్లేట్ ని వంశీ పైడిపల్లి తన కోలీవుడ్ డెబ్యూకి ఎంచుకోవడం విచారకరం. తమిళంలో కోట్ల వసూళ్లు తేవొచ్చేమో కానీ మనకు నచ్చిందా లేదా అనేదే పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి ఆ కోణంలో చూస్తే వారసుడు ఎలాంటి కొత్త రుచి లేని అన్నం పప్పు మాత్రమే ఉన్న మాములు భోజనం. రుచులు ఆశించకుండా ఉంటేనే సేఫ్

ఒక్క మాటలో – వరస కుదరలేదు

రేటింగ్ : 2/5

Show comments