రాహుల్‌గాంధీకి ఆస్తిని రాసిచ్చిన బామ్మ.. కారణం ఏం చెప్పిందో తెలుసా..?

కాంగ్రెస్‌ పార్టీ యువనేత రాహుల్‌ గాంధీపై అచంచలమైన ప్రేమను, విశ్వాసాన్ని చాటుకుందో బామ్మ. సాధారణంగా రాజకీయ పార్టీల నేతలపై అభిమానం ఉంటే.. వారి ఫొటో ఇంట్లో పెట్టుకుంటాం. కానీ ఈ బామ్మ లక్షల రూపాయల ఆస్తినే రాహుల్‌ గాంధీకి రాసి ఇచ్చింది. ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రడూన్‌కు చెందిన 78 ఏళ్ల పుష్పమాంజీలాల్‌ తనకు ఉన్న 50 లక్షల రూపాయల ఆస్తిని, 10 తులాల బంగారాన్ని రాహుల్‌ గాంధీకి ఇచ్చేందుకు సిద్ధమైంది. అనుకున్న వెంటనే వీలునామా రాసేసింది. ఆయా పత్రాలను స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నేతలకు అందించింది. వాటిని రాహుల్‌ గాంధీకి అందించాలని విజ్ఞప్తి చేసింది.

అందుకే ఇచ్చిందట..

తన ఆస్తికి రాహుల్‌ గాంధీని ఎందుకు వారసుడుని చేస్తున్నానో పుష్పమాంజీలాల్‌ తెలిపింది. రాహుల్‌ గాంధీ, ఆయన ఆలోచనలు ఈ దేశానికి అవసరమని ఆమె పేర్కొంది. అందుకే తన ఆస్తిని రాహుల్‌ గాంధీకి రాసి ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ దేశం గురించి రాహుల్‌ గాంధీ ఆలోచిస్తున్న తీరు తనను ఎంతగానో ప్రభావితం చేసిందని పుష్పమాంజీలాల్‌ పేర్కొనడం గమనార్హం.

భావి భారత ప్రధానిగా..

కాంగ్రెస్‌ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్‌ ప్రచారంలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించి ఉంటే.. రాహుల్‌ గాంధీ ప్రధాని పీఠంపై కూర్చునేవారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నా.. అప్పుడు మన్‌మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలనే డిమాండ్లు వచ్చినా.. అవి కార్యరూపం దాల్చలేదు. 2014 నుంచి వరుస ఓటములు ఎదురవుతున్నా… కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతోంది. బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నిత్యం తనదైన శైలిలో రాహుల్‌ విరుచుకుపడుతున్నారు. దేశం కోసం, ప్రజా సంక్షేమం కోసం ఏమిచేయాలో చెబుతున్నారు. ప్రస్తుతం రాహుల్‌ గాంధీ వయస్సు 51 ఏళ్లు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటుచేసే అవకాశం వస్తే.. రాహుల్‌ గాంధీ ప్రధాని అవుతారు.

Show comments