ఈరోజు ఉదయం నుండి సభలో విపక్ష సభ్యులు స్పీకర్ ఎంత వారిస్తున్నా వినకుండా స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మాటిమాటికి సభలో ఆటంకాలు కల్పించడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకదశలో అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో స్పీకర్ పోడియం వద్ద విపక్ష సభ్యులు గుమికూడి నినాదాలు చెయ్యడంతో అదేసమయంలో కొందరు అధికార పక్ష సభ్యులు కూడా పోటీగా నినాదాలు చేస్తూ తమ స్థానాలోనుండి లేచి స్పీకర్ పోడియం వైపు వెళ్లే ప్రయత్నం చేయడంతో సభలో ఘర్షణ వాతావరణం ఏర్పడడంతో, పోడియాన్ని చుట్టుముట్టిన సభ్యులను స్పీకర్ వారించి సభ్యులందరిని వారివారి స్థానాలకు పంపించారు.
ఈ ఘటనపై స్పందించిన సభా నాయకుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, సభలో తెలుగుదేశం సభ్యుల తీరు ప్రజాస్వామ్యాన్ని తీవ్ర అపహాస్యం చేసే విధంగా ఉందని, సభలో 150 మంది సభ్యులు ఉన్న అధికార పక్షం ఎంతో ఓపికగా వ్యవహరిస్తుంటే, ఒక పది మంది సభ్యుల చేత విపక్ష తెలుగుదేశం ఉద్దేశపూర్వకంగా కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడిస్తూ తమపై అధికార పక్షం దాడి చేసిందని తమ అనుకూల మీడియా ద్వారా అసత్య ప్రచారం చేసి, రాజకీయ లబ్ది పొందాలని దిక్కుమాలిన ఆలోచన చేసి భారీ కుట్రకి తెరతీసిందని ఆరోపించారు.
ఒకపక్క రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన సమయంలో విపక్ష సభ్యులు ప్రజా సమస్యలను గాలికొదిలేసి వ్యక్తిగత కామెంట్లు చేస్తూ వీధి రౌడీల్లా ప్రవర్తిస్తూ అధికార సభ్యులను రెచ్చగొడుతూ భాద్యతారహితంగా వ్యవహరిస్తున్నారని సియం మండిపడ్డారు. సభ్యులకు ఇష్టం లేకుంటే సభకు హాజరవ్వాల్సిన అవసరం లేదని గొడవ చేస్తున్న విపక్ష సభ్యులకు చురకలంటించారు. ఈరోజు సభ సజావుగా జరగాలంటే స్పీకర్ పోడియం మెట్ల దగ్గర మార్షల్స్ ని ఉంచి, హద్దు మీరు పోడియం వైపు వచ్చి సభను ఆటంకపరిచే విపక్ష సభ్యులను అడ్డుకొని మార్షల్స్ ద్వారా బయటకి పంపిస్తే తప్ప ఈ సభని సజావుగా జరిపే పరిస్థితులు లేవన్నారు. దీనిపై అలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది గా స్పీకర్ ని కోరారు.