iDreamPost
iDreamPost
ఏదైనా ఒక ఆరోపణను గురించి తనను బ్లేమ్ చేసిన వెంటనే దాన్ని పక్కదారి పట్టించడంలో మన దేశంలోని రాజకీయ నాయకులు ముందువరసలో ఉంటారని విమర్శకులు భావిస్తున్నారు. కానీ అమెరికాలో కూడా భారత రాజకీయ నాయకులను తలదన్నే నాయకుడొకరున్నారని ఇటీవలే తేలింది. ఆయనే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్.
కరోనా వైరస్‌కు సంబంధించిన నిజాలు చెప్పవయ్యా బాబూ.. అంటే ఆ విషయం పక్కన పెట్టేసి చైనా, రష్యా, భారత్‌ల గురించి ఎత్తుకున్నాడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో తన ప్రత్యదర్ధి జో బెడెన్‌తో కలిసి ట్రంప్ చర్చాగోష్టిలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన ప్రత్యర్ధి తనను అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా ఈ మూడు దేశాలను గురించి చిన్నబుచ్చుతూ మాట్లాడడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్యను ఈ మూడు దేశాలో ఖచ్చితంగా చెప్పడం లేదంటూ ట్రంప్ చేసిన వ్యాక్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. తన ఎన్నికల ప్రచారంలో తనగురించి చెప్పుకోవాలి, లేదా తన ప్రత్యిర్ధని విమర్శించాలి అంతే గానీ ఇతర దేశాల మీద పడడం ఏంటన్న ప్రశ్న ఇప్పుడు ఎదురవుతోంది.
నిజానికి ప్రపంచ వ్యాప్తంగా అగ్రరాజ్యంగా కీర్తించబడుతున్న అమెరికా కరోనా కారణంగా తన అగ్రరాజ్య హోదాకు భంగం కలిగించుకునే విధంగా వ్యవహరించిందని ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు రేకెత్తున్నాయి. ఇతర దేశాలన్నీ లాక్డౌన్ విధిస్తే ట్రంప్ మాత్రం తన దేశంలో లాక్డౌన్ విధించలేదు. అలాగే కోవిడ్‌ను గురించి మొదట తక్కువగా అంచనా వేసి, ఆ తరువాత నాలిక్కర్చుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కొన్ని లక్షల మంది మృత్యువాత పడ్డారు. దీనిని ప్రత్యర్ధులు ఎత్తి చూపుతున్నారు. అయితే ఆ విషయాని పక్కదారి పట్టించే విధంగా ఇతర దేశాలను బ్లేమ్ చేస్తున్నారని ఆయాన దేశాల అభిమానులు మండిపడుతున్నారు.
ఈ క్రమంలోనే ఇండియాలో కొంత మంది రాజకీయ నాయకులతో ట్రంప్‌ను పోలుస్తున్నారు. తాను చేసిందే గొప్ప అని, ఇతరులు చేసిందంతా లెక్కలోది కాదనే తత్వం భారత్‌లోని పలువురు పాలకులు మాట్లాడుతుంటారు. వాస్తవాల మాటెలా ఉన్నా దేశాధ్యక్షుల పాత్రలో ఉన్న వ్యక్తులు నిజాలని ఒప్పుకుంటే చరిత్రలో వారి పేరు గొప్పగానే లిఖించబడుతుంది. కానీ తన తప్పులను ఎదుటి వ్యక్తుల మీదకు తోసేస్తే అవి చెరిగిపోయేవి కాదన్న విషయాన్ని ఆయా దేశాధినేతలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ట్రంప్ అయినా, మరెవరైనా ఇది వర్తిస్తుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.