పదేళ్ళ పాటు విలువైన సేవలందించి డ్యూటీలోనే చనిపోయిన కానిస్టేబుల్ ఓలికి యూపీ పోలీసులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఓలి మరణానికి సంతాపంగా పరేడ్ నిర్వహించారు. ఓలి పార్థివ దేహాన్ని పోలీస్ లైన్స్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం ముందుంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఇంతకీ ఓలి మనిషి కాదు శునకం! ఇంకా చెప్పాలంటే స్నిఫర్ డాగ్! పోలీస్ డిపార్ట్ మెంటు దానికి “కానిస్టేబుల్ ఓలి” హోదా ఇచ్చింది.
ఓలి 2010 మార్చి 10న పుట్టింది. గ్వాలియర్ లోని నేషనల్ డాగ్ ట్రెయినింగ్ సెంటర్ లో ఓలి విస్ఫోటక పదార్థాలు కనిపెట్టేలా ఆర్నెల్ల పాటు ట్రెయినింగ్ తీసుకుంది. శిక్షణ తర్వాత 2012లో ఓలికి కానిస్టేబుల్ హోదా ఇచ్చి స్థానిక పోలీస్ లైన్స్ లో రిక్రూట్ చేసుకున్నారు. అప్పటి నుంచి ఓలి చాలా సందర్భాల్లో బాంబులు కనిపెట్టింది. ఎంతో మంది నేరస్థులను పట్టించింది. 2014 ఏప్రిల్ లో కొత్వాలీ నగర్ లోని భారీ ఎత్తున ఆయుధాలను గుర్తించింది. 2015లో ఖరగ్ పూర్ లో జరిగిన ఓ బ్లాస్ట్ లో శిథిలాల కింద గన్ పౌడర్ కనిపెట్టి అది సిలిండర్ పేలుడు కాదన్న విషయాన్ని నిర్ధారించేలా పోలీసులకు సాయపడింది. బహ్రెయిచ్ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్ దగ్గర చెత్త కుండీలో దాచి పెట్టిన బాంబును కనిపెట్టి పెద్ద ప్రమాదాన్ని నివారించింది. ఇలా ఎన్నోసార్లు సాహసాలు చేసి ఎన్నో ప్రాణాలు కాపాడిన ఓలి శనివారం చనిపోయింది. పోలీసులు దీన్ని తమ కుటుంబంలో ఒక సభ్యుడిగా చూసుకునేవాళ్ళు. దీని తిండికి నెలకి 18 వేలు, చికిత్సలకు 3 వేలు ఖర్చు పెట్టేవాళ్ళు. చివరికి ఓలి చనిపోయాక సకల లాంఛనాలతో సాగనంపారు.