iDreamPost
iDreamPost
సాధారణంగా స్టార్లు నటించే మాస్ సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే అతనికి సమానమైన స్థాయిలో విలన్ ఉండాలి. ఆ పాత్రను పండించే నటుడు కావాలి. ప్రతినాయకుడు వీక్ గా ఉంటే హీరో ఎంత బిల్డప్ ఇచ్చినా లాభం ఉండదు. అందుకే దర్శక రచయితలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. విలన్ ఎంత భయంకరంగా ఉంటే కథానాయకుడిలో అంత రెవల్యూషన్ వస్తుంది. దానికి మంచి ఉదాహరణగా బాషా సినిమాను చెప్పుకోచ్చు.
1995లో వచ్చిన ఈ సినిమా ఎంత చరిత్ర సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ హాఫ్ లో ఆటో డ్రైవర్ గా రెండో సగంలో ముంబైని గడగడలాడించినా మాఫియా డాన్ గా రజనీకాంత్ విశ్వరూపానికి ఇటు తెలుగులోనూ కనక వర్షం కురిసింది. నిజానికి బాషాకు సగం ప్రాణం మాణిక్ అయితే మిగిలిన జీవం ఆంటోనీ. కథ ప్రకారం చూసుకున్నా ఆంటోనీ ముంబైలో అరాచకాలు చేసి నేర సామ్రాజ్యం సృష్టించి ఉండకపోతే అసలు మాణిక్ కు బాషాగా మారే అవసరం వచ్చి ఉండేది కాదు. మాణిక్ ప్రాణస్నేహితుడిని చంపడం వల్లే బాషా అవతరిస్తాడు. అంటోనికి చెక్ పెట్టేందుకు తాను అంతకన్నా పెద్ద డాన్ గా మారతాడు. రజనిని కాసేపు పక్కన పెడితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రఘువరన్ గురించి.
శివ తర్వాత ఆ స్థాయిలో మెస్మరైజింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది ఇందులోనే. బాగా డబ్బుండి అందరిని తన చెప్పు చేతల్లో ఉంచుకున్న డాన్ గా ఆ తర్వాత సర్వం కోల్పోయి బిచ్చగాడిని పోలిన అవతారంలో ప్రతీకారం కోసం ఎదురు చూసిన అంటోనీగా రఘువరన్ యాక్టింగ్ మాములుగా ఉండదు. ముఖ్యంగా రజనితో తలపడే ముఖాముఖి సన్నివేశాల్లో ఈయన స్క్రీన్ అప్పియరెన్స్ కి భయపడిన వాళ్ళే ఎక్కువ. కూల్ విలనీతో ఎక్కువ అరవకుండా పొడి పొడి మాటలతో ఎక్స్ ప్రెషన్స్ తోనే భయపెట్టే రఘువరన్ కు బాషా చాలా ప్రత్యేక చిత్రంగా నిలిచిపోవడానికి కారణం ఇదే. బాషా ఇన్నేళ్ళ తర్వాత కూడా ఎవర్ గ్రీన్ గా చెప్పుకోవడానికి దర్శకుడు సురేష్ కృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ దేవా, రజినీకాంత్ ఎంత కారణమో విలన్ గా చేసిన రఘువరన్ కూడా అంతే.