Idream media
Idream media
ఉండి టీడీపీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి జరిగిన తొమ్మిది ఎన్నికల్లో ఒక్క 2004 ఎన్నికల్లో మినహా మిగిలిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ నుంచి టిడిపి గెలిచింది. 2004లో మాత్రమే ఉండిలో కాంగ్రెస్ గెలిచింది.
దాదాపుగా రెండు లక్షలకు పైగా ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో లక్షమంది వరకు బీసీలున్నారు. 80వేల వరకూ ఎస్సీలున్నారు.. కానీ మొదటినుంచి ఇక్కడ క్షత్రియ సామాజిక వర్గ రాజకీయ ఆధిపత్యం మాత్రమే కొనసాగుతోంది. జిల్లా సీనియర్ నాయకుడు, దివంగత మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు అలియాస్ అబ్బాయిరాజు ఉండి నియోజకవర్గం నుంచి 1983-1999 మధ్య వరుసగా ఐదుసార్లు గెలిచారు,మంత్రిగా కూడా పనిచేశారు.
2004 వరకు కొనసాగిన అబ్బాయిరాజు హవా కు అడ్డుకట్ట వేస్తూ, 2004 ఎన్నికలలో సామాన్యుడైన పాతపాటి సర్రాజు గెలిచారు. రాజకీయ దురంధరుడైన అబ్బాయిరాజును ఓడించి ఉండి ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు సర్రాజు. అనంతరం 2009 ఎన్నికల్లో సర్రాజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటమిపాలయ్యారు. 2009లో టిడిపి తరఫున అబ్బాయిరాజు స్థానంలో కలవపూడి శివరామరాజు అలియాస్ కలవపూడి శివ పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు.
వైసీపీ ఆవిర్భావం తరువాట్ సర్రాజు వైసీపీలో చేరిపోయారు. 2014లో కలవపూడి శివ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగగా..వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సర్రాజు మరోసారి శివ చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటినుండి సర్రాజు రాజకీయంగా చురుకుగా లేరు . 2019 ఎన్నికల్లో వ్యాపారవేత్తగా, కుటుంబపరంగా నియోజకవర్గంలో పలుకుబడి ఉన్న పివిఎల్ నరసింహరాజు కు వైసీపీ టికెట్ ఇచ్చింది. .
తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగాల్సిన సిట్టింగ్ ఎమ్మెల్యే కలవపూడి శివను TDP చివరికి నిమిషంలో నర్సాపురం పార్లమెంట్ బరిలో దించారు . దీంతో ఆయన స్థానంలో శివ సహచరుడైన మంతెన రామరాజు టిడిపి నుంచి బరిలోకి దిగారు. అన్ని సర్వేల్లోనూ దాదాపుగా నియోజకవర్గంలో అందరూ పీవీఎల్ గెలుస్తారని భావించారు.. కానీ ఆయన తొమ్మిది వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన రామరాజును గెలుపు వరించింది.
పీవీఎల్ ఓటమితో దిగులు పడకుండా నిత్యం ప్రజలను కలుస్తూ క్రియాశీలకంగా వ్యహరిస్తున్నారు. అయితే పివీఎల్ కలుపుగోలుతనంగా ఉండకపోవడం వల్లే పార్టీ ఓడిపోయిందని కొంతమంది ఆయనపై ప్రచారం చేశారు. వైసీపీ క్యాడర్ పూర్తిస్థాయిలో సపోర్ట్ చేసుంటే గెలిచే వాళ్ళమని, కొందరు సహకరించలేదని పీవీల్ వర్గం చెప్తున్నారు. మరికొందరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొద్దిమంది ద్వితీయ శ్రేణి లీడర్లు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారని చెబుతున్నారు. ఏదేమైనా పార్టీ ఓటమి పాలైన తర్వాత కూడా నియోజకవర్గ నాయకులంతా కలిసికట్టుగా వ్యవహరించటం లేదు.
ఇటీవల సర్రాజు యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావడంతో ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పదవిపై వేడి మరింత రాజుకుంది. పార్టీకోసం ఇంతకాలం కష్టపడిన సర్రాజుకు ఇన్చార్జి పదవి ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుంటే 2019 ఎన్నికల్లో చివరివరకు పోరాడి ఆర్థికంగా, సామాజికంగా ఎంతో పోరాడిన పీవీఎల్ ను కొనసాగించాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తోంది. అయితే ఇప్పటివరకు పార్టీ అధిష్టానం మాత్రం పార్టీ ఓడిపోయిన తర్వాత ఏ ఇన్చార్జిని ఇక్కడ ప్రకటించలేదు..
పీవీఎల్ కూడా సొంతంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. అలాగే ఇక్కడ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా మొన్నటివరకు పీవీఎల్ కు మద్దతుగా నిలిచారు. అయితే ఇటీవల నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రఘురామకృష్ణరాజు పీవీఎల్ ను కాకుండా ఎమ్మెల్యే రామరాజును, సర్రాజును వెంటబెట్టుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఇప్పుడు ఇదే అంశం నియోజకవర్గంలో రాజకీయంగా దుమారం రేపుతోంది.
పీవీఎల్ ను కాదని వేరేవాళ్ళతో ఈ కార్యక్రమాలకు ఎలా శంకుస్థాపనలు చేస్తారంటూ పివీఎల్ వర్గం రఘురామకృష్ణంరాజును ప్రశ్నిస్తోంది. అయితే ఈవివాదంలో రెండు వర్గాలుగా విడిపోయి ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. సర్రాజు ఇంతకాలం పార్టీని కాపాడుకున్నారని, 2019లో తెరపైకి వచ్చిన పీవీఎల్ వల్ల పార్టీ నష్టపోతుందని సర్రాజు వర్గం ఆరోపిస్తుండగా.. 2019కి ముందు పార్టీ పూర్తిగా నియోజకవర్గంలో కనుమరుగవుతున్న సందర్భంలో వచ్చి నిలబడి పీవీఎల్ పార్టీని నిలబెట్టారని అందుకే ఈ రోజున పార్టీ ఈ స్థాయిలో ఉందని మరికొందరు చెబుతున్నారు. ఈ విషయాలన్నీ జిల్లా మంత్రులకు ఇంచార్జ్ మంత్రులకు చెబుతున్నారు.. అయినా వారు కూడా ఈ విషయంలో ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించే ఆలోచనలో జిల్లా మంత్రులు ఉన్నారని తెలుస్తోంది. వీలైనంత త్వరగా పార్టీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఇన్చార్జ్ విషయంలో మరోసారి క్లారిఫికేషన్ ఇవ్వాలని లేదంటే పార్టీపై ఉన్న అభిమానంతో మెలుగుతున్న తాము ఏ నాయకుడి వెంట నడవాలో అర్థం కావట్లేదని సగటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండి నియోజకవర్గ కార్యకర్త ఆవేదన చెందుతున్నాడు.