Idream media
Idream media
జర్నలిజం కష్టకాలాల్లో 2005లో 1000 రూపాయల కోసం నేను ఉగాది కవి అవతారం ఎత్తాను. నేను కవి కాదని నాకు తెలుసు. దూరదర్శన్ వాళ్లకి తెలియదు. టీవీలో కవిత చదవాలంటే కవి కానక్కర్లేదు. అసలు తెలుగు రాకపోయినా ఫర్వాలేదు.
దూరదర్శన్‌లో ఓ మిత్రుడు వుండేవాడు. ఆయనకి కథలు రాయడం రాదు. అది ఆయనకి తెలియదు. తెలుగు అక్షరాలంటే ఆయనకి ప్రేమ. అవన్నీ అవిభక్త కవలల్లా కలిసిపోయి వుండేవి. ఉపాయం అని రాస్తే ఉ అనేది మాత్రమే కనిపిస్తూ మిగిలినవి పాము తోకల్లా వుండేవి. ఆయన స్క్రిప్ట్‌ని యూనివర్సిటీ వాళ్లకి ఇస్తే అదేదో పాళీ భాష శాసనం అనుకుని ఎవడో ఒకడికి థీసిస్ అప్పజెప్పి డాక్టరేట్ ఇచ్చేవాళ్లు. చాలామందికి ఇచ్చారు కూడా.
ఆ అక్షరాలన్నీ అర్థం చేసుకుని, అందులో భావగర్జిత నిగూఢ రహస్య కథానికని బయటికి లాగమని అడిగేవాడు. నవ్య వీక్లీలో పనిచేసినందుకు ఈ శిక్ష అనివార్యం. నిజానికి ఆ కథలు చదవడం కంటే రెండునెలల కఠినాగార శిక్షను ఆనందంగా అనుభవించొచ్చు. ఎన్నో కథలు చదవడం వల్ల లభించిన అదనపు శక్తి ఏమంటే కథలు చెప్పేవాళ్లని సులభంగా గుర్తుపడతాను. సినిమా ఫీల్డ్‌లో వీళ్లు ఎక్కువగా వుంటారు. డబ్బులు అడక్కుండా డైలాగ్‌లు రాస్తే కలిసి ఎన్నాళ్లైనా ట్రావెల్ చేస్తారు.
ఉగాదికి వారం రోజుల ముందు టీవీ మిత్రుడు ఫోన్ చేసి “మీకు బంపర్ ఆఫర్ , ఈ సారి ఉగాది కవి సమ్మేళనంలో మీ పేరు చేర్చాను” అని చెప్పాడు. ఉలిక్కి పడ్డాను. ” నేను కవిని కాదు, నాకు కవిత్వం రాదు” అని నసిగాను. “వెయ్యి రూపాయల రెమ్యునరేషన్” డబ్బు కబురు చల్లగా చెప్పాడు. వెయ్యి అంటే నా ఇంటి రెంట్‌లో సగభాగం. అయితే OK అన్నాను.
అప్పటికే కవుల మీద చాలా జోక్స్, సెటైర్లు రాసినవాన్ని. అయితే నా కోపం కవులు కాకుండా కవిత్వాన్ని కౌలుకి సాగు చేసేవాళ్ల మీద. నిజమైన కవులంటే చాలా ఇష్టం. శ్రీశ్రీ, శేషేంద్ర, శివారెడ్డి, అజంతా, అఫ్సర్ కవిత్వాన్ని ఒక ధ్యానంలా చదివే అలవాటు ఉన్నవాన్ని.
ఉగాది రానే వచ్చింది. ఏం రాశానో గుర్తు లేదు. రెండు పేజీలు కోయిల, ఉగాది పచ్చడి, జీవిత కష్టసుఖాలు అన్నీ కలబోసి తయారు చేశాను. పంజాగుట్ట నుంచి రామాంతపూర్‌కు బైక్‌పైన ప్రయాణం.
నా మిత్రుడు రిసీవ్ చేసుకుని ఒక పెద్దాయన దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయన చేతికో పెద్ద బంగారు కడియం, మెడలో పెద్ద గొలుసు, పట్టు పంచెలో గంభీరంగా కూచుని వున్నాడు.
ఆయన పేరు చెప్పి, సార్ తెలియని వాళ్లుంటారా అన్నాడు. (ఇప్పుడు యూట్యూబ్‌లో ఆయన చాలా ఫేమస్. ఆయనకి తెలియంది లేదు. ఆకాశంలో మబ్బుల నుంచి , ఇంట్లో వాడే సబ్బుల వరకూ దేని గురించైనా మాట్లాడగలడు)
విషయం ఏమంటే అప్పటికి ఆయన పేరు వినలేదు. లౌక్యం లేని మూర్ఖున్ని కదా!లేకపోతే 15 ఏళ్ల జర్నలిస్టు అనుభవం తర్వాత కూడా ఆంధ్రజ్యోతిలో 9 వేలకు పని చేస్తానా? జీతం పెంచి నాబోటి జర్నలిస్టుల్లో అహంకారం పెరగకుండా జాగ్రత్తగా చూసుకోవడం సంస్థ బాధ్యత. ఇప్పటికీ అనేక సంస్థలు ఆ సంప్రదాయాన్ని కాపాడుతున్నాయి.
ఆ పెద్దాయన తెలియదని నిజాయతీగా చెప్పాను. గాయపడినట్టు చూశాడు. ఆయనే కవి సమ్మేళనం సంధానకర్త. ఆయన రాసిన కవిత్వం ఒక సాహిత్య వీక్లీలో పనిచేస్తున్న నాకే గుర్తురాలేదు.
అక్కడ సమ్మేళన కవుల్లో ఒకరిద్దరి పేర్లు తప్ప ఇంకెవరివీ వినలేదు. నాలాగే సిఫార్సు కవులు. ఒక హెచ్చరికతో లైవ్ స్టార్ట్ అయ్యింది.
ఒక దుడ్డు కర్రలాంటి పద్యంతో ప్రారంభమైంది.
ఉగాది నిర్మల కథాతటాక సుందర సౌధ తుషార ఇలా పదాల పచ్చడి వడ్డించాడు. కవిత్వం ఐదు నిమిషాలైతే సంధానకర్త పది నిమిషాలు వివరణ చెప్పి చప్పట్లు కొట్టించాడు.
రెండో కవి కోయిల వెంట పడ్డాడు. కోయిలా కోయిలా ఎందుకొచ్చావు? ఏం చూద్దామని వచ్చావు, చూసింది చాలదా? ఓ పది పదాలని రకరకాల ఆర్డర్‌లో వినిపించాడు. దీనికీ వ్యాఖ్యానం నడిచింది.
ఎటుంచి నరుక్కొచ్చినా మన వంతు రాక మానదు. భయంగా ఉండగా ఒకావిడ నా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఉదయాన్నే ఆమె ఇంట్లో జరిగిన సంభాషణనే కవిత్వంగా రాసుకొచ్చింది.
అమ్మాయ్ పండుగ స్పెషలేంటి అని అమ్మ అడిగింది.
ఇంటి ముందు మావి చిగురు తిన్న కోయిలే మనకి పండగ అన్నాను.
ఈ రకంగా నడిపించేసింది. దీంట్లో కూడా కవిత్వాన్ని వెతికి మరీ వ్యాఖ్యానం సాగింది.
నాకు తప్పలేదు. అపస్మారక స్థితిలో చదివేశాను.
ఉగాదిని ఆహ్వానించిన తీరు చాలా బాగుందని సంధానకర్త క్లుప్తంగా చెప్పాడు. ఆయనెవరో తెలియదు అన్నందుకు రిటర్న్ గిఫ్ట్. కానీ ఆయన మీద నాకు చాలాగౌరవం కలిగింది. ఎందుకంటే నాది కవిత్వం కాదని గుర్తించినందుకు. చివరికి మనకి కావాల్సిన చెక్ ఇచ్చారు. వంద రూపాయలు ఖర్చులు పోయినా 900 నికర లాభం. కవిత్వంతో నాకు కలిగిన మొదటి ఆర్థికలాభం, చివరిది కూడా!
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కవులకి ప్రత్యేకంగా.