iDreamPost
android-app
ios-app

ఆంధ్రప్రదేశ్ లో దిశ చట్టం అమలుకు మరో ముందడుగు

ఆంధ్రప్రదేశ్ లో దిశ చట్టం అమలుకు మరో ముందడుగు

హైదరాబాద్ శివారులో జరిగిన దిశ హత్యాచార ఘటన తెలంగాణ ప్రభుత్వంపై ఎంతమేరకు ప్రభావం చూపిందో తెలియదు కానీ పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాత్రం ఎక్కువగా ప్రభావం చూపింది. దిశ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఆడవారిపై అత్యాచార ఘటనలు నివారించడానికి దిశా చట్టం ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి చర్చనీయాంశం అయింది.

మహిళలపై జరిగే అత్యాచారాలను నిరోధించేలా కఠిన శిక్షలను కేవలం 21 రోజుల్లోనే అమలయ్యేలా ఆంధ్రప్రదేశ్ లో దిశా చట్టం ఏర్పాటు చేయడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆడవారిని కించపరిచే పోస్టులు ఎవరైనా పెడితే వారికి కూడా కఠిన శిక్షలు పడేలా దిశా చట్టంలో చేర్చారు.ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియాని మానిటరింగ్ చేయడానికి ప్రతిజిల్లాలో ప్రత్యేక సెల్స్ ను ఏర్పాటు చేసారు. ఈ చట్టం పట్ల దేశవ్యాప్తంగా మహిళల నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రశంసలు అందాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ చట్టం పకడ్బందీగా అమలు చేయడానికి ముందడుగు వేసింది. దీనిలో భాగంగా దిశ చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా పని చేస్తున్న కలెక్టర్‌ కృతికా శుక్లా, కర్నూల్‌ ఏఎస్పీగా పనిచేస్తున్న ఐపీఎస్‌ అధికారిణి దీపికలను స్పెషల్‌ ఆఫీసర్లుగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ గా పని చేస్తున్న కృత్తిక శుక్లా అదే పోస్టునుండి దిశ చట్టం అమలును పర్యవేక్షించనుండగా,దీపిక మాత్రం డీజీపీ కార్యాలయంలోని సీఐడీ విభాగం నుండి దిశ చట్టాన్ని పర్యవేక్షించనున్నారు.

ఏదేమైనా మహిళల రక్షణ కోసం దిశ చట్టం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రసంశలు పొందుతూ మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది అనడంలో సందేహం లేదు.