iDreamPost
android-app
ios-app

మహిళా బిల్లు: అనుకూలంగా 454, వ్యతిరేకంగా 2.. ఆ ఇద్దరు వీళ్లే!

మహిళా బిల్లు: అనుకూలంగా 454, వ్యతిరేకంగా 2.. ఆ ఇద్దరు వీళ్లే!

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రతిపాదన కొన్నేళ్ల క్రితం ప్రారంభమైంది. అయితే ప్రభుత్వాలు మారుతూ వస్తున్నా.. ఈ బిల్లుకు మాత్రం ఆమోదం పడలేదు. అయితే ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్ల బిల్లుకు బుధవారం లోక్ సభ ఆమోదం తెలిపింది. ఈ ఓటింగ్ లో 454 మంది సభ్యులు మద్దతు తెలపగా.. ఇద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు.  ఈ బిల్లు ఓటింగ్ సమయంలో ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందడంతో లోక్ సభతో పాటు అసెంబ్లీలో  33 శాతం కోటా మహిళలకు దక్కుతుంది. అయితే  దాదాపు లోక్ సభ మొత్తం ఈ బిల్లుకు ఆమోదం తెలుపగా కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే వ్యతిరేకించారు. బిల్లును వ్యతిరేకించిన ఆ ఇద్దరు ఎంపీలు ఎవరో,  అందుకు గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త పార్లమెంట్ లో చరిత్రాత్మక బిల్లుకు ఆమోదం లభించింది. భారీ మెజార్టీతో మహిళా రిజర్వేషన్ బిల్లు “నారీ శక్తి వందన్” కు లోక్ సభ  ఆమోద ముద్ర వేసింది. కొత్త పార్లమెంట్ లో పాసైన తొలి  బిల్లుగా రికార్డు సృష్టించింది. ఈ బిల్లుపై లోక్ సభలో 27 మంది మహిళా సభ్యులు ప్రసంగించారు. మొత్తం 60 మంది మాట్లాడారు. అందరూ బిల్లుకు మద్దతు పలికారు. ప్రస్తుతం లోక్ సభలో 82 మంది మహిళా ఎంపీలున్నారు. ఓటింగ్ సమయంలో సభలో 456 మంది సభ్యులు ఉండగా ..బిల్లుకు అనుకూలంగా 454 మంది ఓట్లు వేశారు. వ్యతిరేకంగా రెండు ఓట్లు పడ్డాయి. ఆ ఇద్దరు కూడా ఎంఐఎం పార్టీకీ చెందిన ఎంపీలు కావడం గమన్హరం.  ఈ ఇద్దరు మజ్లిస్ ఎంపీలు మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారు.

 ఆ ఇద్దరిలో ఒకరు ఎంఐఎం చీఫ్..హైదరాబాద్ ఎంపీ అసుద్దీన్ ఓవైసీ, మరో ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్(ఔరంగాబాద్)లు ఉన్నారు. ఓబీసీ, ముస్లిం కోటాలో రిజర్వేషన్లు కల్పించలేదనే కారణంతో ఈ బిల్లుకు ఆ ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేశారని తెలుస్తోంది. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం లభించడం ఇదే తొలిసారి. గతంలో యూపీఏ హయాంలో రాజ్యసభలో 108వ రాజ్యాంగ సవరణ బిల్లు పాస్  అయినప్పటికీ లోక్ సభలో ఆమోదం పొందలేదు. బుధవారం లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు నేడు రాజ్యసభ మందుకు వెళ్లనుంది. అక్కడ కూడా ఈ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇక డీలిమిటేషన్ తరువాత 2029 ఎన్నికల సమయంలో మహిళా రిజర్వేషన్ కోటా అమలు కానుందని సమాచారం.