iDreamPost
android-app
ios-app

ప్రయాణికులకు బాడ్ న్యూస్.. టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ!

  • Published Jun 14, 2023 | 4:21 PM Updated Updated Jun 14, 2023 | 4:21 PM
  • Published Jun 14, 2023 | 4:21 PMUpdated Jun 14, 2023 | 4:21 PM
ప్రయాణికులకు బాడ్ న్యూస్.. టికెట్ ధరలు పెంచిన ఆర్టీసీ!

కూరగాయలు మొదలు.. ఇంధనం, బంగారం ఇలా దేన్నీ చూసిన ప్రతి దాని ధరలు మండిపోతున్నాయి. పెరుగుతున్న ధరలు చూస్తే సామాన్యుల గుండె గుభేలుమంటుంది. ఇది చాలదన్నట్లు సామాన్యులకు షాక్ ఇచ్చేందుకు ఆర్టీసీ కూడా చేరింది. టికెట్ ధరలు పెంచుతూ.. నిర్ణయం తీసుకుని ప్రయాణికుల జేబుకు చిల్లు పెట్టేందుకు రెడీ అవుతుంది. బస్సు ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. టికెట్ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పెంచిన ధరలు అన్ని టిక్కెట్లకు వర్తించదు.

కేవలం హైదరాబాద్ పరిధిలోని సిటీ బస్సుల్లో జారీ చేసే 24 గంటల పాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్‌ ధరల్ని పెంచుతూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తతం ఈ టికెట్ ధర సామాన్యులకు రూ.90 ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.100కి పెంచారు. సీనియర్‌ సిటిజన్లు (పురుషులు), మహిళలు, 12 ఏళ్లపైబడిన బాలికలకు ఈ టికెట్ ధర ప్రస్తుతం రూ.80 ఉండగా.. దాన్ని రూ.90కి పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు ఆర్టీసీ ఈడీ ఉత్తర్వులు జారీ చేశారు. పెంచిన ధరలు జూన్‌ 16 నుంచి జులై 31 వరకు అమల్లో ఉంటాయని టీఎస్‌ఆర్టీసీ అధికారులు వెల్లడించిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో టీ-24 టికెట్‌ ధర సాధారణ ప్రయాణికులకు రూ.100 ఉండగా.. ఏప్రిల్‌ 26న దాన్ని రూ.90కి తగ్గించింది. సీనియర్‌ సిటిజన్లకు ఈ టికెట్ ని రూ.80కి అందించింది. తాజా నిర్ణయంతో పాత ధరలు తిరిగి అమల్లోకి రానున్నాయి.

బస్సు కోసం ఎదురు చూడాల్సిన పని లేదు..

ప్రయాణికులకు చేరువయ్యేందుకు టీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్డినరీ బస్సుల్లో కూడా వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ సదుపాయాన్ని తీసుకొస్తే బస్సు ఏ సమయానికి వస్తుందనే విషయాన్ని ప్రయాణికులు సులువుగా తెలుసుకోవచ్చు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా తిరిగే 900 మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సిస్టంను తీసుకువచ్చింది ఆర్టీసీ. ఇప్పుడు అన్ని సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తోన్నారు. ఈ విధానం వల్ల ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవటానికి వీలుంటుంది. తద్వారా బస్టాప్‌లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదు