iDreamPost
android-app
ios-app

కోమ‌టిరెడ్డి ప్ర‌క‌ట‌న‌తో టి.కాంగ్రెస్ లో క‌ల్లోలం.. జీవన్ రెడ్డి ఫైర్

కోమ‌టిరెడ్డి ప్ర‌క‌ట‌న‌తో టి.కాంగ్రెస్ లో క‌ల్లోలం.. జీవన్ రెడ్డి ఫైర్

అస‌లే షేర్ ఖాన్ రాజ్యం కోసం కాపుకాసి ఉన్నాడు.. ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా విరుచుకుప‌డ‌తాడు.. ఓ సినిమాలోని ఈ డైలాగు తెలంగాణ రాజ‌కీయాల‌కు స‌రిపోయేలా ఉంది. కాక‌పోతే ఇక్క‌డ షేర్ ఖాన్ గా బీజేపీని చెప్పుకోవ‌చ్చు. 2020 ఆ పార్టీకి బాగా క‌లిసొచ్చింది. అధికార పార్టీకి వెన‌క్కి నెట్టి దుబ్బాక సీటు కొట్టేసింది. జీ్‌హెచ్ ఎంసీలో దూసుకెళ్లింది. ఇప్ప‌టి 4 వ‌ర‌కూ త‌న బ‌లాన్ని 48కు పెంచుకుంది. ఈ ఊపుతో అన్ని పార్టీల‌పైనా దృష్టి సారించింది. అసంతృప్తి నేత‌ల‌పై క‌న్నేసి ఉంచింది. జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల‌కు ముందే కొంత మంది ప్ర‌ముఖులు క‌మ‌లం గూటికి చేరారు. ఇప్పుడు తాజాగా బండి సంజ‌య్ మ‌రో బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ స‌హా 30 మంది ఎమ్మెల్యేలు త‌మతో ట‌చ్ లో ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్ర‌క‌ట‌న దానికి ఊతం ఇస్తోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలో తాను బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు వెల్లడించిన విష‌యం తెలిసిందే.

అస‌లే కాపు కాసి ఉన్న బీజేపీకి కోమ‌టిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్ర‌క‌ట‌న బూస్ట్ ఇస్తే టీ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే టీపీసీసీ ఎంపిక ర‌చ్చ‌గా మారింది. సీనియ‌ర్ల మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తోంది. ఈ ప‌రిణామాల‌న్నీ అధిష్ఠానానికి త‌ల‌నొప్పిగా మారాయి. ఓ ద‌శ‌లో తెలంగాణ నేత‌లెవ్వ‌రూ ఢిల్లీ రావ‌ద్ద‌న్న సంకేతాలూ వెలువ‌డ్డాయి. టీపీసీసీ సార‌థి విష‌యంలో రేవంత్ పేరు ఖ‌రారైన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో అదే జ‌రిగితే తాను పార్టీలో ఉండ‌న‌ని సీనియ‌ర్ నేత వీహెచ్ ప్ర‌క‌ట‌న జారీ చేయ‌డం కూడా చూశాం. ఇలాంటి ప‌రిణామాల క్ర‌మంలో తాజాగా కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి తాను బీజేపీలో చేర‌తాన‌ని ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్నారు. భవిష్యత్తులో తాను బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని చెప్పారు. అన్నదమ్ములుగా కలిసి ఉంటామని రాజగోపాల్ పేర్కొన్నారు. పీసీసీ రేసులో కోమిటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఉన్నారని తెలిపారు. టీపీసీసీ ఎవరిని వరిస్తుందనేది కాలమే నిర్ణయిస్తుందని చెప్పారు. అయితే తన సొంత అభిప్రాయం మేరకే పార్టీ మారుతున్నాని, దీనికి తన అన్నయ్యతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

నిజానికి ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ఎప్ప‌టి నుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయంలో స్పష్టత ఇచ్చి ఆయన ఊహాగానాలకు తెరదించారు. రాజ‌గోపాల్ రెడ్డి ప్ర‌క‌ట‌న ఆయ‌న‌తోనే ఆగితే ప‌ర్వాలేదు. ఆ ప్ర‌భావం మిగ‌తా నేత‌ల‌పై కూడా ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ లో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. పార్టీ వీడే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ త‌రుణంలో రాజ‌గోపాల్ రెడ్డి బ‌హిరంగంగానే త‌న అభిప్రాయం కుండ‌బ‌ద్ద‌లుగొట్టారు. దీంతో మ‌రికొంత మంది బ‌య‌ట‌ప‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే కొంద‌రు బండి సంజ‌య్ తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌ట‌న ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ ప‌రిణామాల‌న్నీ టీ.కాంగ్రెస్ లో క‌ల్లోలం రేపుతున్నాయి.

బ్లాక్ మెయిల్ చేయొద్దు..

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడారు. కొందరు నేతలు వ్యక్తిగత స్వార్థంతో పార్టీలు మారుతున్నారని ధ్వజమెత్తారు. వ్యక్తులకంటే పార్టీ గొప్పదని తెలిపారు. ఆయన గెలుపు వ్యక్తిగత గెలుపు కాదన్నారు. కాంగ్రెస్ సింబల్ మీదే ఆయన గెలిచారని గుర్తుచేశారు. పార్టీ వీడాలనుకునే వారు ముందు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎవరూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయొద్దని జీవన్‌రెడ్డి హితవు పలికారు.