iDreamPost
android-app
ios-app

ఆసక్తికరంగా కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌..!

ఆసక్తికరంగా కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌..!

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు రెండు రోజులుగా ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ బీజేపీపై విరుచుకుపడ్డారు. శాంతియుత వాతావరణంలో చిచ్చు పెడుతోందంటూ ఆరోపణలు కురిపించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు కూడా పలు సందర్భాల్లో మోదీ పేరుతో కూడా విమర్శలు గుప్పించారు. వరద సాయం పైసా కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ ఆసక్తిగా మారింది.

కలిసి నడుస్తాం..?

ఢిల్లీలో ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసిన కేసీఆర్‌ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా వారితో విభిన్నంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఢిల్లీ వచ్చిన కేసీఆర్‌.. శనివారం రాత్రి 7 గంటలకు ప్రధానితో సమావేశమయ్యారు. అరగంటకు పైగా జరిగిన కీలక సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో సంభవించిన నష్టాన్ని వివరించారు. వరద బాధితులకు సాయం అందించేందుకు రూ.1300 కోట్లు అందించాలని గతంలోనే తాను లేఖ రాశానని గుర్తు చేస్తూ, ఆ నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.25వేల కోట్లు అందించాలని నీతి ఆయోగ్‌ సూచించిందని, ఈ విషయంలో సహకారం అందించాలని కోరారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని, లేని పక్షంలో ప్రజలు భరించే స్థాయిలో ధర ఉండేలా చూడాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయంగా ఎలాగున్నా.. అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు తెలిసింది.

విమానాశ్రయాలకు అనుమతులివ్వండి..

తెలంగాణలో ప్రతిపాదిత ఆరు విమానాశ్రయాల అభివృద్ధికి సింగిల్‌ విండో ప్రాతిపదికన చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వాలని కేంద్ర పౌరవిమానయాన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీకి సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. అనుమతులు మంజూరు చేసిన వెంటనే నాన్‌ షెడ్యూల్డ్‌ ఆపరేటర్స్‌ పర్మిట్‌ (ఎన్‌ఎస్‌ఓపీ) ఆపరేషన్లు ప్రారంభించడానికి వీలుగా సొంత వనరులతో మౌలిక సదుపాయాల కల్పన పనులు ప్రారంభిస్తామని తెలిపారు. బసంత్‌ నగర్‌(పెద్దపల్లి), మామునూరు(వరంగల్‌ అర్బన్‌), జక్రాన్‌పల్లి(నిజామాబాద్‌), దేవరకద్ర(మహబూబ్‌నగర్‌), కొత్తగూడెం(భద్రాది), ఆదిలాబాద్‌లో విమానాశ్రయాలు నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించామని వివరించారు.

అమిత్ షాతో భేటీలో..

చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కురిసిన వర్షాలతో హైదరాబాద్‌ తీవ్రంగా అతలాకుతలమైందని, ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నిధి నుంచి సాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఢిల్లీ వచ్చిన కేసీఆర్‌.. షాతో సమావేశమయ్యారు. భారీ వర్షాలు, మునుపెన్నడూ లేని వరదలతో హైదరాబాద్‌ అతలాకుతలమైన తీరు, జరిగిన నష్టాన్ని సుదీర్ఘంగా ఆయనకు వివరించారు. వందలాది కాలనీలు నీట మునిగి హైదరాబాద్‌ వాసులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారని, బాధిత కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సాయం అందించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు రూ.5వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని.. తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు సాయం అందించాలని ప్రధాని మోదీకి అక్టోబర్‌ 15న లేఖ రాసినట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల పునరావాస చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని కేసీఆర్‌ కోరారు. అలాగే శుక్రవారం ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్‌.. తొలుత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అభ్యర్థించారు. కృష్ణా నదీ జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య తిరిగి పంచేందుకు వీలుగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం–1956 పరిధిలోని సెక్షన్‌ 3 ప్రకారం ట్రిబ్యునల్‌ను మళ్లీ ఏర్పాటు చేయాలని కోరిన‌ట్లు తెలిసింది.