iDreamPost
android-app
ios-app

నేడు తెలంగాణ బంద్

నేడు తెలంగాణ బంద్

ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకుమద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజాసంఘాలు శనివారం నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ బంద్‌’ కారణంగా శనివారం తెలంగాణ రాష్ట్రం లో ప్రజారవాణా స్తంభించే పరిస్థితులు నెలకొన్నాయి. బంద్‌ను విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాలు విస్తృత ఏర్పాట్లు  చేశాయి. ఇప్పటి వరకు ప్రైవేట్‌ సిబ్బంది సహాయంతోఅరకొరగా నడుస్తున్న సిటీ బస్సులూ నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బంద్‌కు పిలుపునిచ్చిన తెలంగాణ స్టేట్‌ ట్యాక్సీ, డ్రైవర్స్‌ జేఏసీ ‘తెలంగాణ బంద్‌’కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ఆటోలు, క్యాబ్‌లు కూడా నిలిచిపోనున్నాయి. తెలంగాణ ఆటోడ్రైవర్ల సంక్షేమ సంఘం, ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాలన్నీ ఆర్టీసీ మద్దతు తెలిపాయి.

14 రోజులుగా నిరవధికంగా కొనసాగుతున్న సమ్మె, తెలంగాణ బంద్, సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందన్న ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన, ఈ నెల 21 నుంచి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవడం తదితర పరిణామాలను దృష్టిలో ఉంచుకొని రవాణా అధికారులు  బస్సుల నిర్వహణపై సీరియస్‌గా దృష్టిసారించారు. ‘ప్రైవేట్‌ డ్రైవర్లు, కండక్టర్ల తాత్కాలిక నియామకాలను ముమ్మరం చేశాం. చర్చలు సఫలమై కార్మికులు విధుల్లో చేరితే మంచిదే.. లేని పక్షంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అత్యవసర, వైద్యసేవలు యధాతధంగా కొనసాగనున్నాయి.